ఆ అడవిదారుల, గిరిజన జీవులమధ్యా తిరుగుతున్నట్టు మనసు నిండిపోయింది

యాత్రికుడు అనే మాట వినగానే చిన్నప్పుడు చదివిన యూఅన్‌ఛాంగ్ లాంటి రూపం ఒకటి కదిలేది. ఆ తర్వాత అది రకరకాల మార్పులు చెందుతూఒకసారి పరవస్తు లోకేశ్వర్ లాగా, మరోసారి దాసరి అమరేంద్రలాగా లేదంటే మరొకలాగా … ఎన్నో రూపాలు మారుతూ ఓ నాలుగేళ్లకిందట మాచవరపు ఆదినారాయణ గారి రూపం తీసుకుంది. ఇప్పటికీ యాత్రికుడు అనగానే ఆదినారాయణ గారి రూపమూ, “తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుందీ అనే వాక్యమూ గుర్తొస్తాయి.” (ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఒక్కోసారి గుర్తొచ్చినా ఊహూ ఎందుకో అతను వేరనిపిస్తాడు) “యాత్ర అంటే కేవలం ఒక ప్రదేశానికి వెళ్లి రావటం కాదు. ఎంత దూరం ప్రయాణించామో అంత మేరా మనల్ని మనం విస్తరించుకొని రావటం కదా.

సంచారమే ఎంత బాగున్నదీ… దీనంత ఆనందమేమున్నదీ అనే గోరెటెంకన్న పాట వింటూ చత్తీస్ఘఢ్ ఊళ్లని పలకరించిన నాటి రోజులూ, జయధీర్ తిరుమలరావ్ గారితో నల్లమలలో తిరిగిన రోజులూ లాంటి చిన్న చిన్న అనుభవాలు తప్ప పెద్ద యాత్రానుభవమేమీ లేదు నాకు.

ఇదిగో ఈ పుస్తకం చదువుతుంటే. ఆ లోటేదో తీరినట్టూ ఆ అడవిదారుల, గిరిజన జీవులమధ్యా తిరుగుతున్నట్టు మనసు నిండిపోయింది. నాలుగురోజుల పాటు అడవితోవల్లో తిప్పుకొచ్చాడీ యాత్రికుడు వివేక్ లంకమల. ఇది రహదారుల యాత్రకాదు కాలినడకల బాట… అడుగు అడుగూ జీవితాన్ని అనుబూతులతో కొలుచుకున్నట్టు సాగిన ఒకానొక అద్బుత యాత్ర. ఇలాంటి అనుభవం ఒక జీవితమనే కాలానికి సంపూర్ణతని తెచ్చిపెట్టే అపూర్వావకాశం… అయితే ఇది అనుకోకుండా అందినది కాదు ఈ అవకాశాన్ని వివేక్ సృష్టించుకున్నాడు. (ఈమాట ఎందుకన్నానంటే అతనేమీ యాత్రలకు పరిమితమైన వాడు కాదు ఐటీలో పనిచేస్తున్నవాడు, మనం మెటీరియలిస్టిక్ హ్యూమన్స్ ఇండస్ట్రీ అని పిలిచే సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో ఉన్నవాడు. వీకెండ్ అంటే పబ్, మాల్, హ్యాంగౌట్ అంటూ తిరుగుతారు అనుకునే ప్రపంచంలో చేరినవాడు. అతను ఇట్లాంటి ప్రయాణాలు చేయటం అంటే అవకాశాన్ని కల్పించుకున్నట్టే కదా. వెవేక్ అతనితో ప్రయాణించినవాళ్ల యాత్ర అదవి లాగే గజిబిజిగా అనిపిస్తుంది. ఈ మనుషులకి రోడ్లతో పనిలేదు, అర్థరాత్రుల్లు సేదతీరటానికి హొటల్ కాదుకదా చిన్న గుడిసె కూడా అవసరం లేదు. అలాంటి ప్రదేశాలకు వెల్తున్నప్పుడు ఉండే ప్రత్యేకమైన ఎల్విప్మెంటూ అవసరం లేదు. అట్లా వెళ్ళిపోయారంతే. కొన్నిసార్లు గుంపుగా మొదలై అనుకున్న గమ్యం చేరేసరికి ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. మిగతా వాళ్లు అలసిసిపోయి మధ్యలో ఆగిపోయారు. అయినా సరే గమ్యం ఎప్పుడూ అందకుండా, ఊహల్లో మిగల కూడదు కదా. విన్న ప్రదేశాన్ని కల్లతో చూసేదాక వదలకుండా వెళ్ళారు. అదవి లోతుల్లోకి, వాగులూ వంకలూ, లోయలూ…. దాటుకుంటో వెళ్లారు.

బాటలు నడచీ

పేటలు కడచీ

కోటలన్నిటిని దాటండి.

నదీనదాలు,

అడవులు,కొండలు

ఎడారులా మనకడ్డంకి ? అని శ్రీశ్రీ అన్నమాటలని కాగితాలమీదే ఆగిపోనివ్వలేదు వీల్లు.

అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రయాణం ఆయా ప్రాంతాల ప్రజా జీవితంలోకి మనల్ని ఇన్వాల్వ్ చేయలేదు. చే గువేరా మోటార్ సైకిల్ డైరీస్ చదివితే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చేతిలో బైక్ ఉన్నప్పుడు, అది పోయినప్పుడూ గ్రనాడో, చే ల ప్రయాణాన్నీ, వాళ్లు కలిసిన మనుషులనీ గమనిస్తే ఈ తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని సౌకర్యాలు తగ్గించుకుంటే అంతగా చుట్టూ ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. మనుషుల జీవితాల్లోని వివిధ కోణాలని దర్శించటం వీలవుతుంది. ఎందరో మనుషులతో టేమ్‌గా ఈ ప్రయాణాలు చేసిన రచయిత ఎర్రచందనం కూలీల (స్మగ్లర్లు వేరే ఉంటారు, అడవిలో చెట్లు కొట్టే కూలీలు వేరే వీళ్ల జీవితాల్లో మనకు తెలియని విషాదం ఎంతో ఉంది) బతుకులో విషాదాన్ని తెలుసుకున్నాడు, అడవి పిట్టలు రాలిపోవటాన్ని, అడవులు ప్లాస్టిక్‌తో నిండి పోవటాన్ని గమనించాడు. సోమశిల వలస జాలరి బతుకుల కన్నీళ్లని రుచి చూశాడు. ఎక్కడో దవిదుంపల వేటగాల్లైన గిరిజనుల భాషలని విన్నాడు.

ఓ పుల్లా…ఓ పుడకా..

ఎండుగడ్డి, సిన్న కొమ్మ, చిట్టి గూడు

పిట్ట బతుకే ఎంతో హాయి…

చిగురుటాకు, వగరు పూత

లేత పిందే, తీపి పండు… అన్న గోరటి వెంకన్న పాటలాగా అన్నీ రాసుకొచ్చాడు. అయితే ఎంకన్న పాటలోని పిట్ట బతుకంత హాయిగా మాత్రం అడవి బిడ్డల బతుకు లేదన్న సత్యాన్నీ చెప్పాడు. నడుస్తూ నడుస్తూ యాత్రికుడు తత్వికుడయ్యాడు, తాత్వికుడు ఙ్ఞాని అయ్యాడు.. ఙ్ఞాని విప్లవకారుడయ్యాడు… “నో ప్లాస్టిక్ లంకమల” అనే కార్యక్రమాన్ని నెత్తికెత్తుకున్నాడు. బిబూతి భూషన్ “వనవాసి” ఇప్పటివరకూ నా ఫేవరెట్‌గా ఉండేది ఇప్పుడు దాదాపుగా అలాంటి అనుభవాన్ని మళ్లీ ఇక్కడ ఈ అడవి రచనలో పొందగలిగాను. రచనలోనూ అతను చదివిన పుస్తకాల ప్రభావం, అతను తిరిగిన, అతను పెరిగిన ప్రాంతాల భాషల ప్రభావం కలిసి అత్యంత రమణీయతని పొందింది. మధ్యలో ఆపనీయని రచనా శైలి, మళ్లీ మళ్లీ వెనక్కి వచ్చి చదువుకోదగ్గ వాక్యాలు చేరి ‘జుస్ట్ ట్రావెలాగ్’ అనే మాటని వెనక పడేశాయ్. ఆ ప్రతీ క్షణాన్నీ ఘాఢంగా లోలోపలికి పీల్చుకున్నాడు. కాబట్టే, అతను ఆ అనుభవాలని ఇంతందంగా రాయగలిగాడు.

ఈ లంకమల దారుల్లో అనే పుస్తకాన్ని కేవలం ట్రావెలాగ్ అనో, యాత్రా కథనం అనో అనలేను… ఇది మానవ జీవన విశ్లేషణ, రకరకాల సమాజాల, ప్రాంతాల, సంస్కృతుల, చరిత్రల తిరగబోత. మనముండే భూమిమీదే, మనం మా దేశం, మా ప్రాంతం అని చెప్పుకునే ప్రాంతాల్లోనే మనకేమీ తెలియని జీవన విధానాలని తెలిపే సత్యదర్శిని.

వివేక్ ప్రయాణించిన దారుల్లో ఏ ఎండిన కొమ్మో, బాటమీదికి సాగిన ములో, కొద్దిగా తలెత్తిన రాయో అతని శరీరానికి గాయాలని ఇచ్చే ఉంటాయి, అవి మానిపోయి శరీరం మీద మచ్చలుగా మారిపోయుంటాయి. వాటి తాలూకు నొప్పి కూడా తగ్గిపోయే ఉంటుంది…. కానీ ఒకనాడు సజీవంగా కళకళలాడిన పల్లెలు ముంపుగ్రామాలై, నీళ్లు తగ్గినప్పుడు కనిపించిన ఆనవాళ్లు చేసిన గాయాల తాలూకు నొప్పి ఎలా తగ్గుతుందీ? పచ్చని అడవిలోనూ కనిపించే ప్లాస్టిక్ ఆనవాళ్లు కొట్టిన దెబ్బ ఎలా మానుతుందీ?

థాంక్ యూ మొహన్ బాబు & కుప్పిలి పద్మా మీరు ఈ పుస్తకాన్ని ఇవ్వకుంటే చాలా మిస్సయ్యేవాడిని. పుస్తక తీసుకుంటున్నప్పుడు వివేక్‌తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఇతను లంకమల దారుల్లో చెప్పిన అనుభూతి తగ్గిపోయాక మళ్లీ అతన్ని కలవాలి… మాట్లాడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top