మిత్రమా వసుధేంద్రా! Vasudhendra
నిద్రపోతూ ఉండి ఉంటావు కదా ఈ సమయానికి. ఎట్లా? ఈ దిగులు కుండను నా నెత్తి మీద మోపి నువ్వీ రాత్రివేళ నిద్రపోగలుగుతున్నావు. బెల్లా చేతినుంచి గాబ్రియేల్ దగ్గరికి అక్కడినుంచి అగ్వేద దగ్గరికీ ఆమె చేతిమీదుగా తుంగబద్రా నదిలోకి జారిన బంగారు చేపపిల్లనై అటు లిస్బన్ కీ ఇటు హంపీకి మధ్య… గోవాలో తెగిపడిన గాబ్రియేల్ శిశ్నపు పూర్వచర్మపు ముక్కనై రోదిస్తున్నాను నాయనా.
ఎక్కడ మొదలైందో ఈ కథ…. కథలా అనిపించే వికృత చరిత. మిరియాలకోసం, వాటి వేటలో సాధించే ధనం కోసం, ఆధిపత్యం కోసం జరిగిన హింస. పోర్చుగీస్ ‘వాస్కో డ గామా’ ఐనా, నాదిల్షా అయినా, లేదూ విజయనగర సామ్రాజ్యాధిపతి దేవరాయడైనా ఒక్కొక్కడూ యెంతటి కౄరుడు?! చరిత్రనిండా నిండిన కౄరత్వం కదా చిన్నారి ఈశ్వరిని కళ్ళముందు తలతెగి పడిన మనిషిని చూసి “అతను మా నాన్నను చంపినవాడు” అని నవ్వుతూ చప్పట్లు కొట్టేలా చేసిందీ.
సొంత దేశపు రాజులని, సొంత గడ్డమీది మనుషులనీ పాలించటానికి గుర్రాల మీద వ్యామోహంతో అరబ్బులనూ, అరబ్బుల మీద కోపంతో పోర్చుగీసులనూ ఈ దేశంలోకి ఆహ్వానించిన కృరులే కదా ఇప్పటికీ మా “తెలుగుతేజపు”చక్రవర్తులయ్యారు. 400 పేజీల్లో ఇంతటి చరిత్ర పాఠం ఎట్లా సాధ్యమయ్యింది ? ఇట్లాంటి వాడొక్కడు నా చదువుల కాలంలో ఉండి ఉంటే చరిత్ర పాఠాన్ని మర్చిపోగలమా? ఇప్పటికైనా నువ్వీ అద్బుతమైన ప్రేమకథని చరిత్రలో కలిపి చెప్పకపోతే ఈ దేశపు రక్త చరిత్ర తెలిసేదా?
ఇంతకీ నేను గాబ్రియేల్ నా? అహమ్మద్ ఖాన్ నా? అమ్మద కణ్ణున్నా? ఏ రూపపు మనిషినో అర్థం కాని స్థితిలో ఆ పాత్రగా మారి అన్ని లక్షల మైళ్ళ, అన్ని వేల రోజుల చరిత్రలో ఓలలాడి వచ్చాను కదా. వసుదేంద్రా….. లవ్యూ… తెలుగులోకి అనువదించిన రంగనాథా లవ్ యూ, ఈ పుస్తకాన్ని నాకు చేర్చిన చాయా మోహన్ బాబూ Mohan Babu లవ్యూ సోమచ్.
కొన్ని కథలని రాయటం అంత ఈజీ కాదు. చాలా రీసెర్చ్ చేయాలి, చరిత్రలో కొన్ని అంశాలని కథకి అనుకూలంగా మలుచుకోవాలి. ముఖ్యంగా అది కేవలం సమాచార పత్రంలాగా కాకుండా ఉండాలి. చివరి పదిపేజీలనుంచీ మొదలైన ఒకానొక ఉత్కంఠ లేదా ఉద్వేగమూ వంటి ఏదో భావన వెంటాడుతూ వస్తుంటే… వద్దు వద్దు… నేను ఊహించినవిధంగా ఉండకూడదూ అనుకుంటూ చదువుకుంటూ వచ్చి, నిజంగానే మనం ఊహించినదానికన్నా విచిత్రమైన మలుపును చూపించి మనసునంతా భారం చేసేలా సాగిన తేజో తుంగభద్ర అనే ఈ పుస్తకం చదవటమే ఒక ఎక్స్పీరియన్స్.
మొన్నమొన్నటివరకూ తెలుగులో వచ్చిన పుస్తకాల్లో ఉణుదుర్తి సుధాకర్ “తూరుపుగాలులు” కథల తర్వాత ఇంకో పుస్తకం ఇట్లా చరిత్రని అర్థం చేయిస్తూ సాగే కథలతో వస్తుందా? అనుకున్నాను, తర్వాత బండినారాయణ స్వామి “శప్తభూమి” చదువుతూ మళ్ళీ అలాగే అనుకున్నాను. చరిత్రని, జరిగిపోయిన కాలాన్ని ఇంతందగా ఎవడైనా రాయగలడా? అని అనుకున్నాను. లేదు లేదు… ఉన్నట్టున్నారు ఇంకా ఉన్నట్టే ఉన్నారు… ఇదిగో కాస్త ఆలస్యంగా అయినా #తేజో_తుంగభద్ర చదివాను. మూడురోజులపాటు పగలంతా పనికిచ్చి, రాత్రుళ్ళు మాత్రం చదువుతూ మూడవ రాత్రి గడవకుండానే కన్నీళ్ళతో…ఇప్పటివరకూ అనుభవించని ఒకానొక ఉద్విగ్నపు అనుభూతితో ఆ చివరగా వచ్చే మలుపు ఇచ్చిన సంభ్రమంతో ఈ కథని ముగించాను. చాలు తండ్రీ చాలు… ఇంకొన్ని రోజులవరకూ నన్ను గాబ్రియేల్, బెల్లా, హంపమ్మా, కేశవ, చప్పక్కగా మారిన హనుమా… అతని జీవితంలోని గుండె గడ్డకట్టే విషాదమూ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఈ దేశపు చరిత్ర మీద పారిన రక్తపుటేరులంత మహా ప్రవాహాలవలె నన్ను ముంచెత్తుతూనే ఉంటాయి….
Click here to Buy