చదివి నాలుగు రోజులు అవుతుంది. అయినా కథల్లో దృశ్యాలు కళ్ళముందు నుంచి పోవడం లేదు.

మొదటి కథ ధర్మం నుంచి చివరి కథ ఎల్లలోకములు ఒక్కటై దాకా అన్నీ దేనికవే ప్రత్యేకం. తమిళ సినిమా మీద ఉన్న అభిప్రాయమే తమిళ సాహిత్యం మీద కూడా ఉంది నాకు. అరవ అతి, నేను చిరాకు పడే ఒకానొక విషయం. అయితే, too much ఓవర్ యాక్షన్ చేస్తారు లేదా too much realistic చేస్తారు. Too much నాకెప్పుడూ నచ్చదు. కానీ ఈ కథలు నాకు too much గా నచ్చాయి. ధర్మం కథ ఫ్లో అదిరిపోతుంది. ‘ఒగ్గనివాడు’ ఓ వెట్రిమారన్ సినిమా. ఇక ఎంతో చర్చకు గురైన ‘ఏనుగు డాక్టర్’ ప్రకృతి, జంతుజాలం పట్ల నాకు ఒక కొత్త perspective ను ఇచ్చింది. ‘ వంద కుర్చీలు ‘ నన్ను బాధ పెట్టింది, భయపెట్టింది. అసలు ఏ కథకి ఆ కథ ఇంత ప్రత్యేకంగా ఇంత వైవిధ్యంగా ఎలా సాధ్యం అయింది. అది కూడా ఒక్కొక్కటి ముప్పై, నలభై, యాభై పేజీలు. తెలుగులో మూడు నాలుగు పేజీలు ఉండే కథ మొదటి పేరా చదవగానే విషయం అర్థం అయిపొద్ది. కానీ ఈ కథలన్నీ తెలీని ఓ మార్మికతని నింపుకున్నాయి. దాన్ని చివరిదాకా పట్టి ఉంచుతాయి. రచయిత వీటిని తను చూసిన మనుషుల జీవితాల ఆధారంగా రాశాడు అనిపిస్తుంది. బహుశా ఆ మార్మికత, వైవిద్యం మనిషి జీవితంలోనే ఉందేమో. జయమోహన్ రచన ఇంతకు ముందు చదవడం అంటే, ఆయన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మీద రాసిన వ్యాసమే, అది మరి సౌందర్యమే తెలీని వ్యక్తి రాసినట్టుగా అనిపించింది. కానీ ఈ కథల్లో ప్రకృతి గురించీ, సంగీతం గురించి ఎంతో అందమైన వర్ణనలు చదువుతుంటే ఆయనలోని గొప్పతనం అర్థం అయింది. యాత్ర కథ నాకు వసుదేంద్ర మోహనస్వామి కథల్లో కిలిమంజారో పర్వతారోహణ గురించిన కథని గుర్తుకు తెచ్చింది. తాటాకు శిలువ, కూటి ఋణం కథలు ఆశ్చర్యపరుస్తాయి. సత్యకాలంలో అలాంటి మనుషులు ఉండేవాళ్ళని విన్నాము. ఈ కథలు చదివి నిజమే అని నమ్ముతున్నాను.

ఈ మధ్య అనువాదాలు చదివి కాస్త చిరాకులో ఉన్నాను. కానీ ఈ అనువాదం గాలి వాటంలో తెప్పకి తెడ్డు వెయ్యాల్సిన బాధ లేనట్టు ఈజీగా వెళ్ళిపోయింది. అవినేని భాస్కర్ గారు చాలా బాగా చేశారు. ఇంతమంచి పుస్తకం వేసిన మా మంచి మోహన్ బాబుగారికి ధన్యవాదములు. అభిరుచిగలిగిన పాఠకులంతా కచ్ఛితంగా కొని చదవాల్సిన పుస్తకం.

For Copies – https://chaayabooks.com/product/nemmi-neelam/

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top