నెమ్మి నీలం పూర్తిచేసాను. 430 పేజీలు చదవడానికి దాదాపు నెలరోజులు పట్టింది. గబగబా చదివేసి పక్కన పెట్టడానికి ఇదేం పల్ప్ ఫిక్షన్ కాదుగా!
ఆగి ఆగి చదువుతూ, కారుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, గడ్డకట్టిన దుఃఖంతో గొంతు నొప్పెడుతుంటే నేనెందుకు చదవాలీ పుస్తకాన్ని? చదివాను పో.. ఇంత బలహీనమైన గుండె నాకెందుకివ్వాలి? ఈ నెలరోజుల్లో ఈ పుస్తకాన్ని పక్కన పెట్టుకుని ఎన్ని రాత్రులు ఏడ్చి వుంటాను!
మరోసారి “అమ్మవారి పాదం” కథ ఆడియో ఫైల్ వింటూ ” నాకు జయమోహన్ గారిని కలవాలని వుంది… ” అంటూ మోహన్ బాబు గారికీ భాస్కర్ కీ మెసేజ్ పెట్టాను. కాసేపు సంభాషణ తర్వాత భాస్కర్ జయమోహన్ గారి మెయిల్ ఇస్తూ ” మెయిల్ చేయి అక్కా! ఆయన తప్పకుండా రిప్లై ఇస్తారు” అన్నాడు.
రిప్లై ఇవ్వకుండా ఎందుకుంటారు? ఆయన జయమోహన్ కదా. ఆయన మన జయ మోహన్. వంద కుర్చీలు లాంటి కథ రాసిన జయమోహన్. అమ్మవారిపాదం రాసిన జయమోహన్. ఎంతో సంగీతం సాధన చేసి, భార్య తలమీద మలమూత్రాలు పోయగల వ్యక్తి పాత్రని మన ముందు పెట్టగల జయమోహన్. ‘కాప్పన్ ‘ వేపు నుండి కాప్పన్ అమ్మ కథ జయమోహన్ తప్ప ఎవరు చెప్పగలరు మనకి. ఏనుగు డాక్టర్ చదివాక అడవిలో సీసాలు పారేయడం మాట పక్కన పెట్టండి, రోడ్డు పక్కన వీధి కుక్కల పట్ల మన ఆలోచన మారిందా లేదా?
నెమ్మినీలం చదివాక జయమొహన్ గారికి మెయిల్ పెడదాం అని మొదలుపెడితే ఏం రాసినా పేలవంగానే అనిపిస్తోంది.. ఒకవేళ నేనొక నాలుగు మాటలు రాసినా ఆయనకి చేరే వందల వేల మాటల్లో ఈ మాటలు ఏమూలకో నక్కి కొన్ని బైట్ల మెమొరీ స్పేస్ ఆక్రమించడం తప్ప నిజంగా నా ఉద్వేగాన్ని అక్షరాల్లో పెట్టగలనా అనిపిస్తోంది.
చాలా ఏళ్ళ క్రితం పాపియాన్ చదివినప్పుడు చాలారోజులు ఆ దుఃఖం వెంటాడింది. కూచోనివ్వక, నుంచోనివ్వక హెన్రీ అతలాకుతలం చేసాడు. మళ్ళీ ఇన్నాల్టికి జయమోహన్!
ఎలాంటి జ్ఞానప్రదర్శన లేకుండా సమాజంలోని ఎక్కువ తక్కువలని నేరుగా మనసుకి ఎక్కించగల తచయిత బహుసా ఈయన తప్ప ఇంకెవరన్నా ఉన్నారేమో నాకు తెలీదు. మందగించిన చూపుకి కేటరాక్ట్ చేయగల రచయిత.
జయమోహన్ గారికి మెయిల్ పెడదామని కూచుని మీ అందరికీ ఈ రెండు ముక్కలూ చెప్తున్నా. నెమ్మినీలం చదవండి. చదివించండి. మొద్దుబారి, బండగా అయిన మన మనసులకి కాస్త తడి తగలనివ్వండి.