“వంద కుర్చీలు” కథ నన్ను పట్టుకొని వదలడం లేదు

కరడుగట్టిన నిచ్చెనల కులవ్యవస్థ అతి నికృష్టమైన రూపాన్ని మనం దేవతల భూమి అయిన కేరళలోనే చూడగలమేమో!

నాయాడి కులం “చూడరాని” కులం. నాయాడిని ఎవరైనా చూస్తేనే మైల పడతారు. అంతేకాదు.. చూడకపోయినా, సవర్ణుడికి దగ్గరలో 300 అడుగుల లోపల నాయాడి వున్నా మైల పడతారు. ఈ దూరం కులాన్ని బట్టి మారుతుంది. 300 అడుగుల కంటే లోపల నాయాడి వుంటే నంబూద్రి బ్రాహ్మణుడు మైల పడితే, 70 అడుగుల లోపలుంటే శూధ్రుడు మైల పడతాడు.

ఈ చూడరాని, దగ్గరవలేని కుల కట్టుబాట్లు వుండడం వల్ల.. వాళ్ళు వూరికి దూరంగా, బాటకు దూరంగా పొదల చాటునో, గుట్టలు, రాళ్ళ మాటునో వుండి ఆ దారిన పొయ్యే వాళ్ళకు వినిపించేలా బిగ్గరగా (ఆకలిగొన్న కుక్కలు అరిచినట్లుగా వుంటుందట) “దమ్మదొరా, ఇంత గంజి పొయ్యి” అని ఏడ్చినట్లుగా అరుస్తారట. ఎవరన్నా దయదలిచి ఏదైనా ఇవ్వదలిస్తే ఆ దగ్గర్లో నేలమీద ఏదైనా పెట్టి దూరంగా వెళ్ళిపోయాక మాత్రమే వాళ్ళు దాని దగ్గరికి వచ్చి తీసుకుంటారట.

చచ్చేదశలో వున్న వ్యక్తులు, లేదా రోగాల బారిన పడినవారూ కోలుకోవాలని ఓ పంచెకు నాలుగు మూలలా పండునో, ధాన్యాన్నో మూట గట్టి ఆ రోగిష్టి మీద కప్పి, ఆ రోగం ఆ వ్యక్తి నుండి అవి దానం తీసుకున్న వ్యక్తికి పోవాలని ఆ పంచెను నాయాడికి ఇస్తారట.

మరోచోట అంటారు.. బ్రాహ్మణుడు గౌరవప్రదమైన దానం తీసుకొని మంచి జరగాలని దీవించమని ప్రజలు కోరుకున్నట్టే, దానికి విరుద్దంగా అగౌరవమైన పద్దతిలో దానం తీసుకొని నాయాడి శాపనార్థాలు పెట్టాలని ప్రజలు కోరుకుంటారట!

మన చూపు పడితేనే మైల పడతాం కాబట్టి సాధారణంగా వాళ్ళు పగలంతా చెట్ల చాటున, గుట్టల మాటున అడవుల్లో జీవిస్తారట. రాత్రిళ్ళు అడవుల్లో దొరికే అడవి పందులు, పక్షులు తదితరాలు వేటాడి కడుపు నింపుకుంటారట!

ఈ కథలో అలాంటి “నాయాడి” కులం నుండి కథానాయకుడు సివిల్ సర్వీసెస్ అధికారి అవుతాడు. అతని బాల్యం, అతనికి బువ్వ పెట్టి, చదువు చెప్పి నాగరిక సమాజంలోకి నెట్టిన స్వామాజీ వృత్తాంతం నుండీ ఎన్నో కోణాలను లోతుగా చూపిస్తుంది ఈ కథ. (ఇక్కడ హాస్టల్ లైఫ్ రాసిన Mohan Talari గుర్తుకు వచ్చారు) దీన్ని కథ అనడం కంటే మినీ నవల అనొచ్చు. ఒక సవర్ణున్ని చూస్తేనే ఎక్కడ వీపు చిట్లుతుందో, ఏ వైపు నుంచీ రాయి వచ్చి తనను తాకుతుందో అనే వేల ఏళ్ళ పరాకు నుండీ ఓ వ్యక్తి అధికారి అయితే అతనెలా వుంటాడు? ఆ వేల ఏళ్ళ పరాధీనత నుండీ బయటకు రాని తల్లి ఓ వైపు, ఆ “చూడరాని”కులపు నీడే తన కొడుకుకు తెలియకూడదు అని తపించే సవర్ణ కులపు భార్య ఓ వైపు, తన కులం, తన తల్లి ఎవరో తెలిసి తనకు తెలిసేటట్లే తన వెనుకాల నవ్వుకునే తన కింది అధికారులు..

ఎంత ఘర్షణ, ఎంత క్షోభ.. కథ నిండా…. ఇది చదివాక కూడా కులాన్ని బట్టే రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, ఉద్యోగం వచ్చాక ప్రమోషన్లకూ రిజర్వేషన్ ఎందుకు అవసరమో కథలో చెప్పకపోయినా మనకు అర్థం అవుతుంది.

“నెమ్మి నీలం” లోని “వంద కుర్చీలు” కథ నన్ను పట్టుకొని వదలడం లేదు.

“ఆంటరాని” కులాల గురించి పుట్టింది మొదలు తెలుసు. కానీ “చూడరాని” కులాల గురించి మాత్రం ఈ కథ చదివేదాకా తెలియదు. ఈ ఎఱుక కలిగించిన రచయిత జయమోహన్‌కు, అనువదించిన Avineni Bhaskar కు, ముద్రించిన ఛాయ Mohan Babu మరియు Arunank Latha లకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top