ఏ యుద్ధమైనా ప్రజలకు మాత్రమే నష్టం చేస్తుంది. అధికార కాంక్ష పెరిగిన తర్వాత రాజ్యాల కన్ను సుభిక్షంగా ఉండే ప్రాంతాల మీద పడింది. అక్కడినుంచే కుటిల తంత్రాలు మొదలయ్యాయి. దేశం ఎలా ఉన్నా , ఎన్ని కరువులు సంభవించినా కానీ రాజ్యాలు తమ సైన్యాన్ని పెంచి పోషించే నిల్వలు మాత్రం గట్టిగానే పొగుచేసుకున్నాయి.ప్రపంచ చరిత్ర నిండా ఎన్నో మరకలున్నాయి, వెన్నుపోట్లు, వక్రీకరణలు ఇలా రాసుకుంటూ పోతే అంతం లేకుండా సాగుతూనే ఉంటుంది.
కూలిన కోట గోడల వెనక ఉన్న మర్మమేమిటి అనేది శాసనాల్లో ఉంటుంది .అందులో రాజుల పరాక్రమం దానాలు, ధర్మాలు, వితరణల చిట్టాలు మాత్రమే ఉంటాయి. సాధారణ ప్రజానీకం పడిన బాధలు ఉండవు. గొంతు అరుచుకున్నా సరే గుక్కెడు పాలివ్వలేని తల్లుల బాధ అక్షరాలకు అందదు. రాచరికపు పాండిత్యం అంతా పల్లకిలో ఊరేగిన రాజుల చరితే రాసింది తప్పా పల్లకీ మోసిన బోయిల గురించిన ప్రస్తావనలు దాదాపు శూన్యమనే చెప్పాలి. అలాంటి మనుషుల కథని ,అందునా ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశారు ప్రముఖ కథకులు శ్రీ మారుతీ పౌరోహితం గారు. ఆయన రాసిన ఊరిమర్లు అనే కథల సంపుటి రాయలసీమ నేపధ్యంగా ,సీమలో ఉండే అనేకమైన వెతలను బయటకు తీసుకువచ్చింది. ‘కుశలంబే గదా ఆంజనేయ ‘ అనే కథ ఈయనకి ప్రాచుర్యం కల్పించినా ఆయన్ని అంచనా వేయడానికి మాత్రం చాలా కథలున్నాయి. అటు సీమ మాండలికాన్ని ఇటు తనకి తెల్సిన కన్నడ సీమ చరిత్రని ఆ భాషా మాధుర్యాన్ని మారుతీ గారు వదలకుండా తన కథల్లో చొప్పిస్తున్నారు.
‘ప్రణయ హంపీ’ కాస్త ‘హాళుహంపీ’ గా మారిపోవడం వెనక విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న అళియ రామ రాయలు, పంచ పాదూషాల సైన్యం ‘రాక్షస తంగడి’ వద్ద తలపడిన యుద్ధం, దాని వెనక గల కారణాలు, ఆ యుద్దానంతర పరిస్థితులని అంచనా వేయడం ఈ నవలలోని ఒక ప్రధాన అంశం. అక్కడితో మాత్రమే ఆగిపోలేదు రచయిత, ఆ కత్తులు సంవాదం వెనక ఒక మెత్తని ప్రేమ కథని మనకి అందించారు.వీర రసంతో మొదలైన నవల అనేక మలుపులు తిరుగుతూ వెళ్తుంది. తెలుగు సాహిత్యం లో ఈమధ్య కాలంలో రెండు పార్శ్వాలుగా సాగిన చారిత్రాత్మక నవల రాలేదు అంటే అతిశయోక్తి కానే కాదు.
కథని నేను ఇక్కడ పూర్తిగా చెప్పను గాని రచయిత ఊహా శక్తిని తప్పక మెచ్చుకుంటాను. నవల ని నడిపే ఒడుపు కాస్త అటు ఇటుగా ఉన్నా మూలమైన విషయాన్ని మాత్రం చాలా బిగువుగా చెప్పారు. సంబజ్జ గౌడ ఈ నవల కథానాయకుడు, ముద్దుకుప్పాయి కథా నాయిక, ఒక వీరుడు ఒక కళాకారిణి మధ్య నడిచే ఈ ప్రణయ కావ్యం హంపీ ఆ నగరపు చుట్టుపక్కల ఉండే అనేక దేవాలయాలు, ప్రాంతాలు, నగరాలు ఈ ప్రేమ కథలో భాగం అవుతాయి. స్త్రీ పురుషుల కలయిక పట్ల పెద్దగా ఆంక్షలు లేని ఆ కాలంలో కూడా నాయకా నాయికలు ఏకాంత సమయంలో కూడా యోగ క్షేమాలు మాత్రమే మాట్లాడుకోవడం అనేది రచయిత ఆ పాత్రలని ఎంత ఇష్టంతో రాశారో మనకి అర్థం అవుతుంది. ప్రేమలో ఎక్కడ మోహానికి తావివ్వలేదు. యుద్ధం విడదీస్తున్నదని తెల్సినా వారి ప్రేమ అజరామరం గానే నిలపడానికి రచయిత చేసిన ప్రయత్నం మెచ్చుకోతగింది. ప్రణయ హంపీ లో ఎలాగూ ప్రణయం ఉంది కదా అని రచయిత తన సొంత అభిప్రాయాన్ని మన మీద రుద్ధకపోవడం ఒక గొప్ప సంగతి.
రాజా వేశ్యల గురించిన ప్రస్తావన వాళ్ళ మీద వేసిన పన్నునుంచే సైనికుల జీతభత్యాలు నడిచినాయనే ఒక కఠోర వాస్తవం మనకి తెలుస్తుంది. బాగా బతికిన రాజ్యాలన్ని ఇలాగే ఉండేవేమోననే ఒక శంక మనసులో పాతుకుపోతుంది. పైగా సైన్యం యుద్దానికి వెళ్లే సమయంలో వాళ్ళ వెనక వెళ్లి వాళ్ళ శారీరిక అవసరాలు తీర్చే వేశ్య వృత్తి రాసిన విధానం బాగుంది. దాదాపు ఐదు లక్షల కాల్బలానికి కేవలం ఇరవైరెండు వేలమంది ఎలా సరిపోతారు. సైన్యం యుద్ధ విరమణ అనంతరం శృంగారానికి ప్రాధాన్యత ఇస్తూ అమ్మాయిల కోసం మల్లయుద్దాలు చేయడం వంటివి సైన్యాల మీద ఉండే నమ్మకాలు సడలిపోయేలా చేస్తాయి.కానీ ఇది నిజం.
ఇదిలా ఉంటె మధ్యలో ‘ వలంది’ కథ మనల్ని చిన్నాభిన్నం చేస్తుంది. రాజ వేశ్యలకి యుద్దాలతో పనేం లేదని మనం అనుకోవచ్చు , కానీ ఈ నవల ఆ భావన అపనమ్మకం అని పైన చెప్పిన ఋజువులతో సహా చూపిస్తుంది. ఒకానొక సందర్భంలో కథానాయిక కన్నా ‘వలంది’ బాధ పాఠకుణ్ణి ఎక్కువ కలవరపెడుతుంది. ప్రణయానికి ప్రాణాలు కాపాడుకోవడానికి మధ్యలో ఉండే ” స్వేచ్ఛ” అనే మాట ఎంత గొప్పదో ఈ రెండు పాత్రల్లో మనం అంతర్లీనంగా చూడొచ్చు. యుద్ధం వల్ల కలవరపడే వ్యాపారస్తులులు , వాళ్లు సొమ్ము పరాయి రాజుల పాలు కాకుండా దాచుకోవడానికి పడే తాపత్రయం ఇవన్నీ చరిత్ర చెప్పని నిజాలు , వాటన్నిటినీ ఈ నవల చర్చకు పెడుతుంది. పంచ పాదుషాల కలయిక ఆ నేపధ్యంగా సాగే నాటకీయ పరిణామాలు ఇంకాస్త లోతుగా చర్చిస్తే బాగుండేది అనిపించింది. సొంత సైన్యం వెన్నుపోటు లాంటి అంశాలు ఒక్కసారి మనకి కథని వెనక్కి వెళ్లి మళ్ళీ చదవడానికి ఆస్కారం కలిపిస్తాయి. ఓడిపోయిన రాజ్యం ఎలాఉంటుంది…? ఓటమి తర్వాత రాజులు ఏమి చేస్తారు అనే ఘట్టాలు ఇందులో వస్తాయి. కొండవీటి రాజ్యంలో ఉన్న అవచి తిప్పయ్య శెట్టి లాంటి పేర్లు ఇక్కడ కూడా దర్సనం మిస్తాయి. రాజ్యం పట్ల రాజు పట్ల వాళ్ళకుండే అపనమ్మకాలని ఈ నవల రేఖా మాత్రంగా స్పృశిస్తుంది.
యుద్ధం విడదీసిన ప్రేమ ఫలించిందా…? వికటించిందా..? అనే సస్పెన్స్ నేను చెప్పను కానీ మీకీ నవల ఒక అజరామరమైన ప్రేమ కథను అందిస్తుంది. కేవలం అద్దంకి శాసనాన్ని నేపథ్యం గా తీసుకుని రాసిన
“బోయ కొట్టములు పండ్రెండు” సీమ నుంచి వచ్చిన “శప్తభూమి” . ఈ రెండు నవలల సరసన ఈ నవల కూడా సగర్వంగా నిలబడుతుంది.
ఛాయా ఎప్పటిలాగానే మరో మంచి పుస్తకాన్ని తెచ్చింది. ఇలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి పబ్లిషర్స్ తటపటాయిస్తున్న సమయంలో ఛాయ చేసిన ఈ ప్రయోగాన్ని అభినందించాలి. వీరలక్ష్మి గారి ముందుమాట బాగుంది.
అనంతు డిజైన్ చేసిన కవర్ పేజీ బాగుంది.
ముమ్మాటికి రచయిత కృషి అభినందనీయం. మారుతీ పౌరోహితం గారినుంచి ఇలాంటి మేలిమి రచనలు మరిన్ని రావాలని ఈ ‘ప్రణయ హంపీ’ తన జైత్రయాత్ర కొనసాగించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.
ప్రతులకు :
లేదా