Description
యుద్ధమంటే మానవత్వంపై దాడి, హక్కుల హననం. అటువంటి ఒక బీభత్స, విషాద నేపథ్యంలో మనుషుల మధ్య, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు చిగురు తొడగడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఒక కొత్త ఆశనూ చిగురింపజేస్తుంది. యీ ప్రణయహంపీ నవలలోని ప్రేమకథకు నేపధ్యం రక్కసి – తంగడి యుద్ధం. చారిత్రిక నవల రాయాలి అంటే రచయిత ఆ కాలాన్ని ఆవాహన చేసుకోవాలి. ఆనాటి సంస్కృతి, ఆహార, ఆహార్య అలవాట్లను గ్రహించగలగాలి.
– టి. శ్రీనివాసమూర్తి, కథారచయిత, విమర్శకులు.
Maruthi Powrohitham –
N. Venugopal
Editor
Veekshanam :
“శిలలు ద్రవించి యేడ్చినవి”
చరిత్ర ఒక తరగని గని. ఒక చివరన అది వైభవోజ్వల గాథ అని, స్వర్ణయుగమనీ, అప్పుడంతా పాలూ తేనే ప్రవహించేవనీ చెప్పే ఆస్థాన, సాంప్రదాయక కథనాలూ, అమాయక గానాలూ ఉంటాయి. మరొక చివరన ఆ స్వర్ణయుగంలో చల్లారిన సంసారాలూ, మరణించిన జనసందోహం, అసహాయుల హాహాకారం మూలుగుతున్న వాస్తవాల మీద ఆధారపడిన కథనాలూ ఉంటాయి. సత్యం ఈ రెండు కొసల మధ్య ఎక్కడో నిగూఢంగా నిక్షిప్తమై ఉంటుంది. చరిత్ర రచనకు ఎక్కువ ఆధారాలు దొరకని, దొరికే ఆధారాలు కూడా అనుమానాస్పదంగా ఉండే మన సమాజం వంటి సమాజంలో అటు చివరి కథనాలకూ ఇటు చివరి కథనాలకూ మధ్యలో ఊహలకు కొరత ఉండదనే అర్థంలో అది తరగని గని. కనుక చరిత్ర ఎవరు ఎట్లా ఊహిస్తే అట్లా తయారవుతుంది. కాకపోతే అటువంటి చరిత్ర రచన నిజంగా చరిత్ర అనిపించుకోవాలంటే సాధికారికంగా, ఇతరరేతర ఆధారాలతో సమన్వయించేదిగా, క్రమబద్ధంగా, అలా జరిగి ఉండడానికి అవకాశం ఉన్నదన్నట్టుగా ఉండాలి. అది వర్తమానానికీ భవిష్యత్తుకూ కూడా పాఠాలు నేర్చుకోవడానికి తగిన గతం గురించిన విశ్వసనీయ కథనం కావాలి.
గతం గురించి తవ్విన కొద్దీ దొరికే కుండ పెంకుల నుంచీ, గాజు పూసల నుంచీ, విరిగి చెల్లాచెదురైన అద్భుత శిలాప్రతిమల శకలాల నుంచీ, లేఖకుల అతిశయోక్తులూ దురభిప్రాయాలూ విస్మరణలూ నిండిన, చెదలు కొట్టిన తాళపత్రాల నుంచీ ఎన్నో ఊహలూ, ప్రతిపాదనలూ, పరికల్పనలూ, కళాత్మక సృజనలూ అల్లవచ్చు. ఆ అర్థంలో కళా సృజనకు కూడా చరిత్ర ఒక తరగని గని. కాకపోతే కాల్పనికత ఎంతగా రెక్కవిప్పినా విశ్వసనీయంగా ఉండాలి. గాలి పటాన్ని ఏ తెలియని గాలుల్లో ఏ తెలియని తీరాలకు పంపినా, దారం చివర వ్యక్తి కాళ్లు బలంగా నేల మీద పూని ఉండాలి. అట్టడుగున అంతమందిమీ మానవులమే గనుక ఏ కాలంలో ఏ స్థలంలోనైనా మానవ సంబంధాలు వ్యక్తం కావాలి. అదే ప్రేమ, అదే కరుణ, అదే ఆనందం, అదే ఆహ్లాదం, అదే రౌద్రం, అదే భయం, అదే బీభత్సం కనబడాలి. అది నిజమైన కళగా ఉండాలంటే గతంగా ఉంటూనే వర్తమానం కావాలి. గతంగా ఉంటూనే భవిష్యత్తు కూడా కావాలి.
చరిత్రంటే గతానికీ వర్తమానానికీ మధ్య జరిగే నిరంతర సంభాషణే అని ఇ ఎచ్ కార్ అన్నప్పుడు ఆయన చరిత్రకారుడిగా, చరిత్రను ఒక శాస్త్రంగా సంభావిస్తూ ఆ మాట అన్నాడు గాని, చారిత్రక కల్పనలో ఆ మాట మరింత నిజం అవుతుంది. అదే వాస్తవం అనిపించేంత విశ్వసనీయ, సంభవనీయ, కళాత్మక కల్పన అవుతుంది.
ఒకదాని వెంట ఒకటిగా రెండు అద్భుతమైన చారిత్రక ఇతివృత్తాల నవలలు – ఉణుదుర్తి సుధాకర్ ‘చెదరిన పాదముద్రలు’, మారుతి పౌరోహితం ‘ప్రణయ హంపీ’ చదివినప్పుడు, విశ్వసనీయ కాల్పనికత అద్భుతంగా పండిన ఆ రెండు నవలలనూ, నవలాకారులనూ ఆహ్వానిస్తూ, అభినందిస్తూ రాయాలనుకున్నాను. ఒకటి ఇరవయో శతాబ్ది సమీప గతం, మరొకటి పదహారో శతాబ్ది, అంత సుదూరం కానిదైనా సుదూర గతం. మన సమాజంలో ఎప్పటెప్పటి గతం అవశేషాలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి గనుక రెంటి మధ్య ఏకసూత్రత ఉందనుకున్నప్పటికీ రెంటి మీద విడివిడిగానే రాస్తున్నాను. ఆ క్రమంలో ఇది రెండో స్పందన. ఇది మారుతి పౌరోహితం రాసిన ‘ప్రణయ హంపీ’ గురించి.
బహుశా తెలుగు విద్యావంతులందరిలోనూ హంపీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం గురించీ, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరారాయల గురించీ, హంపీ శిథిలాల గురించీ పాఠ్యాంశాలలోనో, సాహిత్యంలోనో చదివే ఉంటారు. కవిత్వ పాఠకులైతే కొడాలి వెంకట సుబ్బారావు ‘హంపీ క్షేత్రము’ లో ‘శిలలు ద్రవించి యేడ్చినవి’ అని కంట తడి పెట్టి ఉంటారు. ఒక అధికారిక, ప్రాబల్య కథనపు ప్రభావానికి లోనయ్యే ఉంటారు. హంపీ చూసినవారైతే ఆ అద్భుత శిథిలాల సౌందర్యంలో మనసు పారేసుకోకుండా ఉండడం అసాధ్యం. (ఇటీవల అయితే అక్కడి గైడ్ల అనవసరపు ముస్లిం ద్వేషాన్నీ, హిందుత్వ ప్రగల్భాలనూ కూడా వినవచ్చు – గత మూడున్నర దశాబ్దాలలో అరడజను సార్లు హంపీ వెళ్లిన స్వానుభవంతో చెపుతున్నాను). కనుక శీర్షికలోనే హంపీ పేరు ఉన్న చారిత్రక కాల్పనిక నవల చదువరులను తప్పనిసరిగా ఆకర్షిస్తుంది. పరిమాణం రీత్యా నవలిక అనదగినంత చిన్నదీ, ఒక్క ఊపున చదవగలిగిన ఆకర్షణీయ శిల్పంలో తీర్చిదిద్దినదీ అయిన ఈ నవల తప్పనిసరిగా వస్తువూ శిల్పమూ సమపాళ్లలో సమకూరిన మంచి రచనగా తెలుగు నవలా చరిత్రలో నిలుస్తుంది.
నిజానికి ఇందులోని కథ చాలా సూక్ష్మమైనది. ఒక ప్రేమ కథ. విజయనగర రాజ్యం చివరి దశలో మహారాజుకు అంగరక్షకుడిగా ఎంపిక అయిన వీరుడు సంబజ్జ గౌడకూ, ఆ రాజ్యంలోని భామాకలాపపు అభినయాల కుప్ప నాట్యకారిణి ముద్దుకుప్పాయికీ కుదిరిన ప్రేమ, మధ్యలో యుద్ధం వల్ల వారి ఎడబాటు, చివరికి యుద్ధ బీభత్సాన్ని జయించి నిలిచిన ప్రేమైక బంధం. కథ అంతే. కాని కథా గమనం తుంగభద్ర ప్రవాహం లాగ ఉరకలెత్తుతూ ఒడ్లొరసి సాగుతుంది. ఒకవైపు రాజవైభోగాల వర్ణన, మరొక వైపు అసహాయుల ఆక్రందనలు, ఇంకొక వైపు రాచరికపు యుద్ధాల చదరంగపుటెత్తుగడలు, యుద్ధ బీభత్సం, సంగీతం, నాట్యం, వీరత్వం, ఆహార్యం, సంస్కృతి, విజయనగర ప్రాభవంలో వేశ్యా జీవితం, జీవితంలో, పాలనలో మతం పాత్ర, శ్రీరంగనాథ ఆలయం, సిరిమాను ఉత్సవం, బీజాపూరు ఆలీ ఆదిల్ షా పట్ల అళియ రామరాయల పుత్ర వాత్సల్యం, సూఫీ తత్వం వంటి ఎన్నెన్నో పాయలు తుంగభద్రలోకి సాగివస్తాయి.
నవలలోని కాలమూ సుదీర్ఘమైనది కాదు, కథా స్థలాలు ఆనెగొంది, హంపీ, రక్కసి-తంగడి మాత్రమే, పెనుగొండ ప్రస్తావనకు మాత్రమే వస్తుంది. కాని స్వల్ప కాలంలోనే తక్కువ స్థలాలలోనే వైవిధ్యభరితమైన, లోతైన, హృద్యమైన కథను చెప్పవచ్చునని రచయిత నిరూపించారు.
“అక్కడ వాడే పాత్రలు, కూజాలు అన్నీ బంగారుతో చేసినవే…” అని ఒక దృశ్యాన్ని చూపుతూనే, “బయటకు కనిపించే అంతఃపుర వైభవం వెనుక కన్నీరు ఉన్నట్లు తొందరలోనే సంబజ్జ గౌడకు బోధపడింది” అని ఆ దృశ్యపు మరొక ముఖాన్ని కూడా రచయిత ఎదురుబొదురు పెట్టారు. అళియ రామరాయలకు ఉన్న అనేక మంది భార్యలనూ, అంతకు మించి ఉంపుడుగత్తెలనూ, వారి సొంత సిబ్బందినీ, పరిచారికలనూ ప్రస్తావిస్తూనే “అంతఃపురంలోని స్త్రీల కళ్లు కాంతి విహీనంగా ఉన్నాయ”ని వాస్తవిక కోణం చూపారు.
విజయనగర సామ్రాజ్యం గురించి ఉన్న బహు జనామోద కథనాలను వినిపిస్తూనే, ఆ రాజ్యం ఎట్లా వేశ్యలు చెల్లించే పన్నులకు ప్రాధాన్యత ఇస్తుందో ఒక వేశ్య పాత్ర చేత చెప్పించారు: “రాజసభ అందంగా ఉండాలంటే అందులో ఉండవలసిన వివిధ వృత్తులవారిలో వేశ్యలు ముఖ్యులు. అందునా వేశ్యలను శుభ శకునానికి ప్రతీకలుగా నమ్ముతారు. మన విజయనగర సామ్రాజ్యంలో వ్యభిచారం అధికారికం. మేము రాజుకు పన్ను చెల్లిస్తాం. మా నుండి వచ్చే ఆదాయాన్ని కైజీతపు సైన్యానికి జీతం ఇచ్చేందుకు వినియోగిస్తున్నారని విన్నాను.” వేశ్యల గురించి చెడ్డగా రాసేవారిలో ఎక్కువమంది ఆ సందులలో తిరిగేవారే అనే కఠోరసత్యాన్ని కూడా ఆమె చెపుతుంది.
యుద్ధంలో అళియ రామరాయలు చనిపోయాడనీ, విజయనగర సామ్రాజ్యం ఓడిపోయిందనీ తెలిసినాక సంపద సర్దుకొని పెనుగొండకు తరలిపోవడానికి తిరుమలరాయల నిర్ణయాన్ని వివరిస్తూనే, “ముప్పై ఆరు రకాల పన్నులు కట్టించుకున్నారే! మరి కనీస బాధ్యత లేకుండా వారి దారి వారు చూసుకుంటే ఎలా?” అని ముసలివాళ్లు శాపనార్థాలు పెట్టారనే వాస్తవాన్నీ నమోదు చేశారు.
నవలలో అన్నిటికన్నా ప్రధానమైనవి యుద్ధం గురించి వ్యక్తమైన అభిప్రాయాలు. అవి యుద్ధంలో పాల్గొంటున్న, యుద్ధ బీభత్సానికి ప్రభావితమైన పాత్రలు అనుకున్నవీ, చెప్పినవీ. “అన్ని యుద్ధాలు మోసంపై ఆధారపడి ఉంటాయి” అని ముద్దు కుప్పాయి అంటుంది. “యుద్ధం రాజ్యరక్షణ కోసం అనీ, ఒక సైనికుడిగా దానిలో పాల్గొనడం తన ప్రథమ కర్తవ్యం” అనీ మొదట అనుకున్న సంబజ్జ గౌడ తన అభిప్రాయాలు సరి కావనీ, యుద్ధం హింసకు మూలమనీ గుర్తిస్తాడు. “అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించడానికి యుద్ధం చేయడంలో తప్పు లేదు. కాని ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం న్యాయ అన్యాయాలకు సబంధించనిదిగా అతడికి తోస్తోంది” అనీ, “ఈ యుద్ధంలో సంబజ్జ గౌడకు రక్తం, శ్రమ, కన్నీళ్లు, చెమట తప్ప అందించడానికి ఏమీ లేదు అనిపిస్తోంది” అనీ, “దోచిన సంపద యుద్ధం తాలూకు ఆత్మ. అన్ని యుద్ధాలు సంపద కోసమే జరుగుతాయి” అనీ యుద్ధం గురించి లోతుగా ఆలోచింపజేసే మాటలెన్నో ఉన్నాయి.
నవలను సంపూర్ణంగా, హృదయపూర్వకంగా, సగౌరవంగా ఆహ్వానిస్తూనే రెండు మూడు మాటలు చెప్పవలసి ఉంది. నవల విస్తృతంగా రాయవలసింది, కుదించినట్టు అనిపిస్తున్నది. వాక్య నిర్మాణంలో, ముఖ్యంగా వాక్యాంత క్రియలలో ఏకరూపత లేదు. ఒకే పారాగ్రాఫులో లెక్కగట్టెను, నరికెను, మోగెను వంటి గ్రాంథిక, పాత వ్యవహారపు వాసనలు, వాటికి అటూ ఇటూ ఇస్తారు, ఇప్పిస్తారు, మెచ్చుకుంటున్నారు వంటి ఆధునిక వ్యవహారాలు పక్కపక్కనే ఉన్నాయి. చారిత్రక నవల గనుక అన్నీ పాత రూపాలే ఉన్నా ఫరవాలేకపోయేది. లేదా అన్నీ కొత్త రూపాలే అయినా ఫర్వాలేదు. కాని అవీ ఇవీ కలిసి ఉండడం ఇబ్బందికరం. అలాగే రక్కసి తంగడి గ్రామాలకూ తళ్లికోటకూ మధ్య దూరం “మైళ్ల”లో కాకుండా పాత కొలతలలో చెపితే బాగుండేది.
వాటికన్న ముఖ్యమైనది దక్కన్ సుల్తనత్ లు “ముస్లిం రాజ్యాలు” అనీ, విజయనగర రాజ్యం “హిందూ రాజ్యం” అనీ అనూచానంగా వస్తున్న మాటను రచయిత అంగీకరిస్తున్నారా అనే అనుమానం. నిజానికి పాలకుడి మత విశ్వాసం ఆధారంగా ఒక రాజ్యాన్ని నిర్వచించడం సరి అయిందేనా ఆలోచించాలి. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వ్యక్తమైన హిందూ ముస్లిం పాలకుల ఐక్యతను చూసిన తర్వాత వలస పాలకులు దురుద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టిన విభజించి-పాలించులో భాగంగా ఈ విభజన మొదలయింది. ఆ కాలపు ఇండాలజిస్టుల, ఓరియెంటలిస్టుల చేతిలో మరింత పెరిగింది. అదే భారతీయ సాంప్రదాయిక చరిత్రకారుల మీద, జాతీయవాద చరిత్రకారుల మీద ప్రభావం వేసింది. సురవరం ప్రతాప రెడ్డి, ఈ విషయంలో స్మిత్ మాటలను ఎంత పారవశ్యంతో ఉటంకించాడో చూసి తీరాలి. చివరికి కంభంపాటి సత్యనారాయణ కూడా ఆ హిందూ – ముస్లిం విభజన ప్రభావాన్ని తప్పించుకోలేకపోయారు (కంభంపాటి ‘ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి’ మీద కె బాలగోపాల్ సమీక్ష చూడండి). పాలకుడి మత విశ్వాసాల ఆధారంగా పాలనను, రాజ్యాన్ని గుర్తించడంలో చాలా సమస్యలున్నాయి. హిందూ సామ్రాజ్య పరిరక్షకురాలిగా చరిత్రకెక్కిన (ఎక్కించబడిన) విజయనగర రాజ్యం ముస్లిం రాజులతో కన్నా హిందూ రాజులతోనే ఎక్కువ యుద్ధాలు చేసింది, హిందూ రాజుల రాజ్యాలనూ సంపాదనూ ఎక్కువగా కొల్లగొట్టింది. ఐదు దక్కన్ సుల్తనత్ లు కూడా తళ్లికోట నాటికి ఏకమయ్యాయి గాని అంతకు ముందు అనేక యుద్ధాలలో వాళ్లలో ఇద్దరు ముగ్గురు మతంతో సంబంధం లేకుండా విజయనగరంతో చేతులు కలిపారు. భారత ఉపఖండంలో అనేక మంది ముస్లిం ప్రభువులు ఇరుగు పొరుగు ముస్లిం ప్రభువుల మీదనే యుద్ధాలు చేశారు. మధ్యయుగ భారత ఉపఖండంలో యుద్ధాలు సంపద కోసం, భూ ఆక్రమణ కోసం, అధికార విస్తరణ కోసం (స్త్రీల కోసం కూడా) జరిగాయి గాని మతం కోసం జరిగాయా అనేది అనుమానమే. ఆధునిక చరిత్రకారుల పరిశోధనల్లో ఈ సమస్య మీద ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. దేవాలయాల మీద దాడులు అవి సంపద పోగుబడిన కేంద్రాలు గనుక జరిగాయి గాని అక్కడైనా మత కారణాలున్నాయా అని పునఃపరిశీలన జరుగుతున్నది. ఆ పని విజేతలైన హిందూ రాజులు కూడా చేశారు. విగ్రహాలలో సంపద దాచి ఉంచారనుకుని విగ్రహ విధ్వంసం జరిగింది. ఇస్లామిక్ సంప్రదాయం విగ్రహారాధననే వ్యతిరేకిస్తుంది గనుక కూడా అందువల్ల కూడా ఆ దాడులు జరిగి ఉండవచ్చు గాని అదే ప్రధానం కాదు.
పైగా ఇవాళ పెచ్చరిల్లుతున్న మత రాజకీయాలు ప్రచారంలో పెట్టదలచుకున్న కథనం నేపథ్యంలో ఈ విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంది. చరిత్రలో ఐదు వందల ఏళ్ల కింద ఏమి జరిగిందనే దానికన్న ముఖ్యంగా, ఆ రోజు ఒక ఘర్షణ జరిగిందనీ, అది మత కారణం మీదనే జరిగిందనీ, అందుకు ప్రతీకారం ఇప్పుడు తీసుకోవాలనీ ఈ అధికారిక, ప్రాబల్య కథనం చెప్పదలచుకున్నది, చెపుతున్నది. ఆ కథనాన్ని బలపరిచే ఆధారాలు చరిత్రలో చాలా తక్కువే అయినప్పటికీ, ఇవాళ్టి రాజకీయావసరాల కోసం ఆ కథనం తయారవుతున్నది. అటువంటి సందర్భంలో చరిత్ర ఇతివృత్తంగా రాసే కాల్పనిక రచయిత తీసుకోవలసిన జాగ్రత్తలు మరింత ఎక్కువవుతాయి. చారిత్రక కాల్పనిక రచయిత మీద బాధ్యత మరింత పెరుగుతుంది.
ముగ్గురు పాదుషాలు అలీ ఆదిల్ షా ను యుద్ధానికి రెచ్చగొట్టడానికి మాట్లాడిన మాటలు గాని, “ధర్మం విలసిల్లే ఈ నేల పైన వారికి ఈర్ష్య, ద్వేషం” అని రామరాయలు తల్లితో అన్న మాటలు గాని, “విజయనగర సైన్యంలోని ముస్లిం సైనికులు తమ సైనికులనే చంపడం ప్రారంభించారు” అనే మాట గాని మరి కాస్త జాగ్రత్తగా రాసి ఉండవలసింది.
“యుద్ధం ఎప్పుడూ మంచిదికాదు. అది మానవత్వపు పునాదిని నాశనం చేస్తుంది. ధనవంతులు యుద్ధం చేస్తే పేదలు చనిపోతారు. రాజుల మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు చనిపోతారు. మీరు చేసిన యుద్ధానికి కారణం మతం కాదు, అది ఒక సాకు మాత్రమే…” అని సూఫీ సల్మా అహమ్మద్ ఫరూకీ అన్న మాటలు నిజంగా నవల చెప్పదలచుకున్నవి, ఆశించిన ప్రయోజనం నెరవేర్చేవి.
అవి అలా ఉంచి, ఈ నవల ప్రేమ కోసమూ, యుద్ధ వ్యతిరేక భావాల కోసమూ ఎన్నదగిన నవలగా నిలిచే ఉంటుంది.
ఒక అద్భుతమైన సంభాషణలో, “మా ప్రేమ గాలి వంటిది. నేను దానిని చూడలేను. కాని అనుభవించగలను” అని ముద్దు కుప్పాయి అంటుంది. “అనుభవం మానసికం. జీవితం భౌతికం. వాస్తవిక జీవితంలోకి రావాలి తల్లీ” అని తల్లి అంటుంది.
సర్వవ్యాప్తమైన గాలి వంటి ప్రేమను చదువరి అనుభవంలోకి తెచ్చి, వాస్తవిక జీవితంలో గతకాలపు యుద్ధాలనే కాదు, వర్తమాన యుద్ధాలనూ చదువరి స్ఫురణకు తెచ్చి, అనుభవాన్నీ, అవగాహననూ ఉన్నతీకరించిన మారుతి పౌరోహితం గారికి హృదయపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.
Maruthi Powrohitham –
అనంతు చింతలపల్లి :
బహుశా తెలుగు నేలను పాలించిన రాజులు చేసిన యుద్ధాలలో జరిగిన చివరి ప్రధాన యుద్ధం తల్లికోట. ఆ యుద్ధం గురించిన చారిత్రిక రచనల నమోదుకు భిన్నంగా, అనునాదంగా సాగాలని ప్రయత్నించిన తొలి చారిత్రక కాల్పనిక నవల ‘ప్రణయ హంపి’ కావచ్చు.
దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం గ్రీకు కవి హోమర్ రచించిన ఖండ కావ్యం ఇలియడ్ మానవ సాహిత్య చరిత్రలో నమోదయిన తొలి యుద్ధ నవల. ఇలియడ్ ఏక కాలంలో పౌరాణిక కావ్యం, చారిత్రక కాల్పనిక కావ్యం కూడా. ఇక్కడ పోలిక రెండు నవలల్లో యుద్ధమే నేపథ్యం కావడం. అయితే ప్రణయ హంపి చారిత్రక కాల్పనిక నవల కోవకే చెందుతుంది.
కథకుడిగా బాణీని, సంతకాన్నీ స్థిరం చేసుకున్న మారుతీ పౌరోహితం రాసిన ‘ప్రణయ హంపి’ తన తొలి నవల. నిజానికి అన్నప్రాసన నాడే ఆవకాయలాంటి సవాలు ఈ నవలా రచన. తన తొలి రచనతోనే ఒక కొత్త చారిత్రక ప్రతిపాదనని బలంగా ముందుకు తెస్తున్నాడు మారుతి. అది హంపిని తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా ప్రతిపాదించడం. ఇది చరిత్ర కారులు తేల్చవలసిన, చర్చించవలసిన అంశం.
చారిత్రక కాల్పనిక సాహిత్యం కత్తిమీద సాము, పులిమీద స్వారీ ఏకకాలంలో. Historical Fiction రాసేందుకు చాలా నియమాలున్నాయి, సిద్ధాంతాలున్నాయి. అయితే Historical Fiction రాస్తున్నప్పుడు చరిత్రతో కల్పన పెనవేసుకుని సాగాలే కాని, చరిత్రలో కల్పన అస్సలు కూడదు. ఈ రెండవదే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం చాపకింద నీరులా కొద్దిసార్లు, బాహాటంగా ఎక్కువసార్లూ జరుగుతూ పోతున్నది. అయితే ఈ ప్రమాదంలో తనను పడేసుకోకుండా తన తొలి నవలలోనే మారుతి ఏ మేరకు జాగ్రత్తలు తీసుకున్నాడు? నవల చివర అతను పేర్కొన్న గ్రంథాల పట్టీ ఆ జాగ్రత్తను పట్టి చూపుతుంది.
రక్కసి, తంగడి అనే ఊర్ల మధ్య నెలలపాటు జరిగిన యుద్ధమే తల్లికోట. పాలనకు తల్లినీ, పాలకులకు కోటనూ మిగల్చని నాటకీయ యుద్ధం అదే! ఒక రకంగా ఈ యుద్ధమే దక్షణాదిన ముస్లిం పాలనను సంపూర్ణంగా స్థాపించేందుకు తెర ఎ్తతింది అని చెప్పవచ్చు. నిజానికి తల్లికోట యుద్ధం తర్వాత కూడా విజయనగర సామ్రాజ్య పాలన మిణుకుమిణుకు మంటూ సాగినప్పటికీ వైభవ హంపికి చరమగీతిని పాడింది తల్లికోట యుద్ధమే. ఆ చరమగీతి నేపథ్యంలో సాగే ప్రణయగీతమే ఈ నవల.
యుద్ధ నేపథ్యంలో ప్రేమ కథ చెప్పాలంటే భీభత్స రస ప్రధానంగా సాగుతూ శృంగార రససిద్ధిని కల్పించవలసి వుంటుంది రచయిత. ఈ ప్రయత్నంలో మారుతి తన తొలి నవలలో తడబాటును ప్రదర్శించినా పొరబాటుకు చిక్కలేదు. నవలానాయిక ముద్దుకుప్పాయి ఒక కూచిపూడి భాగవత నాట్య కళాకారిణి, నాయకుడు సంబజ్జ గౌడ ఒక యోధుడు. వీరిద్దరి ప్రేమకథలో రక్కసి తంగడి యుద్ధాన్ని జొప్పించి, జరిపించి విజయనగరకు అపజయాన్ని, ప్రేమకు జయాన్నీ రచియిస్తాడు మారుతి.
Detail is art, but not necessarily every detail knits the plot. అయితే ఏ వివరం కథను లోతుకు, ముందుకూ తీసుకుని ఉరకలెత్తిస్తుందో ఆ కిటుకు రచయితకు తెలిసి వుండటం కళ. ఈ నవలలో చారిత్రక నేపథ్యాన్ని వివరించే వివరాలతో పాటు ఆ కాలపు సాంస్కృతిక, సామాజిక రూపం పాఠకుడి కళ్ళ ముందు నిలిపేందుకు రచయిత చేసిన కసరత్తు ముచ్చట గొలుపుతుంది.
ప్రతి నాగరికతలో, సమాజంలో Fault Lines వుంటాయి, వున్నాయి. కానీ చరిత్ర రచనలో ఆయా Fault Linesని treat, deal చేసే పద్ధతిలో గణన, స్ఫురణ, చేతన ఆ చారిత్రక రచనలోని దృక్పథాన్నీ, లేదా నిబద్ధతనీ వెల్లడి చేస్తుంది. పంచ పాదుషాల వ్యూహాలు, అళియరామరాయల పరమతసహన జీవనం, సామరస్య గతం, అందుకు భిన్నమైన అతని దారుణ మరణం, రాజ్య విధేయత కోసం ప్రాణాలకు తెగించే సంబజ్జ గౌడ, ప్రేమను చాటేందుకు సరికొత్త నట్వాంగానికి మువ్వలు సవరించుకునే ముద్దుకుప్పాయి, యుద్ధ భీభత్సానికి పరాకాష్ట పతాకగా అవనతం అయిన వలంది పాత్రల నిర్వహణ రచయిత నిపుణతే కాదు, పరిణితి కూడా.
తల్లికోట అపజయం తర్వాత, అలియ రామరాయల హత్య తర్వాత రాజ్యంలో అల్లకల్లోలం (chaos) నెలకొంది. ప్రజలకు ఎలాంటి సూచనలూ, ఆదేశాలూ, భరోసా ఇవ్వకుండా ప్రజలనుంచి నానారకాల పన్నులు వసూలు చేసి కుప్పపోసుకున్న ఖజానాను ఏకంగా ఏనుగుల మీద తరలించి దొడ్డిదారిలో పారిపోయారు పాలకులు. ఇక విజయోత్సాహంలో మునిగితేలిన ముస్లిం సేనలు హంపిని నామరూపాల్లుకుండా చేయడమే కాకుండా యథేచ్ఛగా దోచుకోవచ్చని తమ సేనలను సామాన్య జనాలమీదికి కూడా పురిగొల్పారు. ఇట్లాంటి భయానక వాతావరణంలో నవలలోని ప్రధాన పాత్రలు కేవలం తమ ప్రేమను గెలిపించుకునేందుకు తాపత్రయపడతారు. నాయిక ముద్దుకుప్పాయి ఏకంగా శతృరాజుల మనసును కరిగించి తన ప్రియుడినీ, ఇతర బందీలుగా వున్న సైనికులనూ విడిపించుకుంటుంది. నాయికానాయకులిద్దరూ యుద్ధ భీభత్సానికి స్పందించిన దాఖలాలు లేకుండానే నవల ముగుస్తుంది. అట్లా ఇటు యుద్ధానికీ, అటు ప్రణయానికీ ఇవ్వవలసినంత పాత్ర, బాధ్యత ఇవ్వడంలో రచయిత మారుతి శ్రద్ధ తీసుకోలేదు.
హంపి విధ్వంసం తర్వాత 1565 నుంచి 1614 దాకా ఏలిన చివరి విజయనగర చక్రవర్తి వెంకటపతి రాయలు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల ఏళ్ళు సాగిన ముస్లిం పాలన చరిత్రలోని చివరి అధ్యాయాలలో తల్లికోట యుద్ధం మెరిసి వెలిసిన అధ్యాయం. దక్షణాదిని తమ హస్తాల్లోకి తెచ్చుకునేందుకు నానా తంత్రాలు రచించిన పంచ పాదుషాలకు చివరి నిరసనలు విజయనగర చివరి బలహీన చక్రవర్తి వెంకటపతి రాయలు నుంచే వచ్చాయి. మతం సార్వభౌమాధికారానికి ప్రధాన సూచికగా మారుతున్న కాలం దక్షిణాదిన తల్లికోట యుద్ధం ముందటి కాలం. శైవం నుంచి మొరటుగా వైష్ణవానికి రవాణా అవుతున్న కాలం కూడా అదే. ఈ grand picture మీద చూచాయగానయినా రచయిత దృష్టి నిలపలేదు ఈ నవలలో. నిలిపివుంటే నవల మరింత నిలిచివుండేది.
ఏ కాలపు రచయిత అయినా ఆ కాలంలోని 15-45 వయసు మధ్య వున్న పాఠకుల పఠనను సులువు చేసేందుకు తమ భాషను సవరించుకోవాలి. కాలిక, చారిత్రక రచనలు కూడా ఈ వయసు పాఠకులకే చేరువ కావాలి అనే లక్ష్యం, బాధ్యత వుండాలి. ఈ నియమంతో చూసినప్పుడు ప్రణయ హంపి నవల భాష పాఠకులను దూరం చేసుకునే భాషగానే మిగిలింది. ఈ నవలా రచనకోసం మారుతి జరిపిన పరిశోధనను ప్రతిఫలించే, ఆ కాలపు జనజీవిత ఆచారవ్యవహారాలను పాఠకులకు అందించే ప్రయత్నం నవలలో పుష్కలంగా వుంది. అయితే రచయిత వాడిన చాలా పదాలకు అర్థాల పట్టీ ఇవ్వకపోతే అందాల్సినంత మందికి నవల అందదు, చెందదు. చారిత్రక నవలా రచనలో ఆ కాలపు మ్యాప్ ఒకటి సూచన ప్రాయానికయినా పాఠకులకు పొందుపరచడం కూడా పాఠకుల ఊహకు చేదోడుగా వుంటుంది. అదొక లోపం. ముద్రారాక్షసాలు పాఠకుల పట్ల చిన్నచూపుకు నిదర్శనాలే. ప్రచురణ కర్తల మరింత జాగరూకత, బాధ్యత మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం.
But nothing is fair in love and war; even when war is lost, love wins.
*
ప్రణయమూ, హంపీ వొక నవలా సాకు నాకు!(FB:20.07.2024)
*
యుద్ధం అంటేనే అదేదో గత, పాత, లేదా జానపద కాలానికి చెందిన వ్యవహారంగా మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందనుకుంటా. అందుకు ప్రధాన కారణం ‘మన వాళ్ళ’ చరిత్ర రచన స్టైల్. లేదా చరిత్రను మనం అర్థం చేసుకునే పద్ధతి ఇలానే వుండాలని ఫిక్స్ చేయడం అనే మెగా ప్రాజెక్టులోనూ, విధానంలోనూ వాళ్ళు మనల్ని ఫిక్స్ చేయడం అనుకుంటా.
పాలస్తీనాలో జరిగే మారణహోమం మనకు అందుకే పట్టదు, ఉక్రెయిన్ లో జరుగుతున్న ఏకపక్షయుద్ధం అందుకే మన కంటికి కానరాదు. కాశ్మీర్, మణిపూర్ లో జరుగుతున్న తరాల మారణకాండలు మనకు లెక్కకు రావు. దండకారణ్యంలో జరుపుతున్న హింస, దాడులు మన స్రవంతికి చెందవు. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు పక్కన పెడదాం కాసేపు. ( మనం నిజానికి ఇవి చాలా సేపు పక్కన పెట్టి కదా బతికి బట్టకడుతున్నాం.) ఇవన్నీ వర్తమానంలో అంటే మన కళ్ళముందే జరుగుతున్న యుద్ధాలే అని మనకు తెలియదు. తెలియడానికి మనకు కొన్ని పొరలు అడ్డొస్తున్నాయి. ఆ పొరల్లో మనం వేసుకున్న కర్టెన్లు కొన్ని. మనం ఓటు వేసి గెలిపించిన పాలకులు మనకోసం తాజాగా కట్టించే తెరలు ఇంకొన్ని. రెండూ ఇనుప తెరలే.
ఇట్లా ఆ తెరలన్నీ పేరుకునిపోయి మెల్లగా వర్తమానం పట్లా, గతం పట్లా మనం మొద్దుబారేలా చేసాయి, చేస్తాయి, చేస్తుంటాయి. ఇక అప్పుడు రేపటి సంగతి మొలకే ఎత్తదు. అది ప్రతి పాలనకూ అవసరం అయిన తతంగం. నిన్నా, నేడూ, రేపూ కూడా.
సమాజంలోని అన్ని రకాల సమాచార స్రవంతులు ఈ పాత్రను పెద్ద ఎత్తులో పోషిస్తాయి. అందుకే Out of sight is out of mind, అనుకునే చిల్లర పాలకులు చరిత్ర నిండా మనకు పాలకులే.
ఈ తంత్రాల, కుతంత్రాల వల్లా మన కళ్ళముందుండే విషయాలే మనకే కనిపించకుండా పోతాయి. లేదా మెల్లగా మన దినపత్రికల్లోంచీ, మన టివిల్లోంచి, మన పాఠ్యపుస్తకాల్లోంచి ఆవిరవుతూ పోతాయి.
అందుకే మన చరిత్ర పట్ల మనది జానపద అప్రోచ్. అంటే మనకు చరిత్ర అంటే మహా కట్టడాలు, శిథిలాలు, భవంతులు, అట్టహాసాలు, ఐశ్వర్యాలు, కత్తులు, నెత్తుటేరులు, యుద్ధాలు, గెలుపులు, ఓటములూ. లేదంటే చరిత్ర అంతా రాజుల కోణం నుంచి రాసిన కేవల డాంబికాలే, ఇంకా చెప్పాలంటే ఇదంతా దోపిడిని దాచే తంతే అనుకునే ఇంకో విపరీత కోణం. ఏదో వంతెన తెగింది ఈ రెండు కోణాలకూ, వాటి నుంచి బలపడిన దృక్పథాలకూ.
సిసలైన చరిత్రకారులు రాజుల కోణం, ప్రజల కోణం అని చూడకుండా ఆయా కాలాల్లో సమాజంలో ఎలాంటి జన జీవనం కొనసాగింది? ఆ వ్యవస్థలో ఎలాంటి ఉత్పత్తి సంబంధాలు వున్నాయి? అందుకు బయట మానవ సంబంధాలు ఎలా కొనసాగాయి? ఏయే రంగాలలో ఎలాంటి కృషి జరిగింది? ఏయే సంక్షేమాలకు రూపకల్పన జరిగింది? ఏయే పాలనాపరమైన సంస్కరణలు చోటుచేసుకున్నాయి? కళలు, సారస్వతం అన్ని స్తరాలలో ఎలా విలసిల్లింది లాంటి అనేక కోణాల నుంచి కూడా చరిత్ర అధ్యయనం, రచన ఇంకా జరగవలసే వుంది. ఆ కోణంలోంచి చరిత్ర రచన ఇటు సాహిత్యంలో కూడా జరగవలసి వుంది.
అందుకే జరిగింది నమోదు మాత్రమే, చరిత్ర కాదు, జరగవలసిన రచన ఒక నూతన చరిత్ర.
వర్తమానంలో ఇటు రాయలసీమలో శప్తభూమి, ప్రణయ హంపి నుంచి అటు శ్రీకాకుళం నుంచి వచ్చిన చెదిరిన పాద ముద్రలు వరకు చరిత్ర తవ్వకానికీ, నమోదుకు, పునర్ వ్యాఖ్యానానికీ తెలుగు నేల కాల్పనిక సాహిత్యం సీరియస్ గా నడుంబిగించిందని చెప్పడానికి దాఖలాలు.
ప్రణయ హంపి నవల గురించి మరిన్ని మాటలు.
తెలుగునేలలో తెలుగు పాలకులు చేసిన చివరి ప్రధాన యుద్దంగా తల్లికోట అనుకుంటే ప్రణయ హంపి నవల అట్లాంటి చారిత్రక నేపథ్యంలో సాగే రచన.
అయితే ఏది తొలి, ఏది మలి, ఏది చివరి అనే వర్గీకరణలు అకడమిక్ అవసరాలకు అవసరమయినప్పటికీ అవి తవ్వి తీసే కొద్దీ మారేవే అనే అవగాహన సాహిత్యకారులకు తప్పనిసరిగా వుండి తీరాలి. లేకపోతే వాటి కీర్తి, కీరీటాల మీద వున్న వల్లమాలిన వ్యామోహం వల్ల సమకాలీన తక్కెడలో బేరీజు వేయడంలో తడబడతాం. నిజానికి అట్లా తూకం వేయాలంటే కూడా కేవలం దృక్పథాలూ, పక్షాలు పట్టుకుని మన జానపద సాహిత్య సిద్ధాంతాలను, పురాతన విమర్శా సూత్రాలనూ సంచీలో వేసుకుని బయలుదేరితే మన మాట స్వగతమై, మన వాదన గతం అయిపోగలదు.
ఇవాళ చరిత్ర రచన అంటే అది కేవలం నిన్నటికి చెందింది కాదు. నేటికీ నిలబెట్టగలిగిన, తనకు తానుగా నిలబడే ఒక నాగరిక సమకాలిక నాలుక కూడా. ఇదే అర్థంలో వర్తమానంలో కూడా చరిత్ర భాగస్వామి కాగలుగుతోంది. చరిత్ర రచన లేదా దాని చారిత్రక కాల్పనిక రచన మనలో praxis …అంటే జ్ఞానాచరణని కలిగించగలగాలి. అంతే కానీ తప్పుడు కార్యాచరణకి పురిగొల్పేదిగా దారితీయకూడదు. అట్లా లేకుండాపోయిన చారిత్రక రచన, చారిత్రక చూపు చాలా ప్రమాదం. అదే మన వర్తమానం. ఫలానా కాలంలో ఫలానా తప్పిదం, ఘోరం, విధ్వంసం, మారణ హోమం జరిగింది కాబట్టి దాన్ని ఇప్పుడు, ఇక్కడ నిలబడి దాన్ని రిపేరీ చేసేందుకు, వాటిని ప్రాయాశ్చిత్తం చేసేందుకు మనల్ని మనకే ప్రతిపక్ష శిబిరం ఏర్పాటు చేసి కత్తులు నూరుకునేందుకు, నెత్తురు కళ్ళ చూసేందుకు సర్వాన్నీ సిద్ధం చేయగలదు. ఏ రాజుల నుంచి అయినా మనం భట్వాడా చేసుకోవలసిన సంగతులు అధికార లాలస, విస్తరణ కాంక్ష, ద్వేషం కానే కాదు. అట్లాగే ఏ కాలాల జనపదాలనుంచయినా మనం సరఫరా చేసుకోగలిగిన విలువలు దోపిడి పట్ల జీరో టాలరెన్స్, అణచివేతల పట్ల ఉదాసీనత, వివక్ష పట్ల సంఘటితం కాలేని ఎడతెగని మౌనాలు కానే కాదు. ఈ ఇంగితం ఆకళింపు ఆధునికతే.
నిజానికి చారిత్రక కాల్పనిక సాహిత్యం కత్తి మీద సాము, పులిమీద స్వారీ ఏకకాలంలో. Historical Fiction రాసేందుకు చాలా నియమాలున్నాయి, సిద్ధాంతాలున్నాయి. అయితే Historical Fiction రాస్తున్నప్పుడు చరిత్రతో కల్పన పెనవేసుకుని సాగాల్సి వుంటుంది. అంటే చారిత్రక ఘటనల క్రమాన్నీ, ఆ కాలపు సామాజికార్థిక పరిణామాలనూ, ఉత్పత్తి, పునరుత్పత్తి, వాటి బయటా వున్న సంబంధాలనూ, వాటి పర్యవసానాలనూ చెప్పేటప్పుడు వాస్తవాలను, సాక్షాధారాలను లెక్కలోకి తీసుకునే పరిశోధకుడు రచయితలో చెలమలో ఊటలా ఉబికి రావాలి. రచయిత ఆ కసరత్తునూ, శ్రమనూ విధిగా చేయాలి. లేకపోతే అవాస్తవాలు జొప్పించి, అవాకులూ చెవాకులూ పేర్చి, మసిపూసి మారేడుకాయ చేసి అదే సిసలైన చరిత్రగా చలామణీ చేసేందుకు, నిలిపేందుకు మనమంతా తయారైపోగలం. ఇప్పుడు జరుగుతున్నది చాలామటుకు అలాంటి గతవైభవ పునఃప్రతిష్టా బృహత్ కార్యక్రమమే. ఇటు త్రేతాయుగమే వర్తమాన ప్రజాస్వామ్య పాలనకు ఆదర్శ నమూనాగా ప్రకటించేందుకూ, అటు సావర్కరే సిసలైన స్వాతంత్ర్య పోరాట యోధుడిగా చిత్రీకరించేందుకు ఈ రకం చరిత్ర రచన అస్సలు వెనకాడదు. ఎందుకంటే దొంగ చరిత్ర, దొంగ చరిత్రకారులు, దొంగ చారిత్రక రచన, దొంగ గతం, దొంగ వైభవం, దొంగ నవల, దొంగ సినిమా, దొంగ సీరియల్, సిరీస్, దొంగ నాగరికత మనకు పాఠ్యపుస్తకాలనుంచి, వాట్సాప్ దాకా ఆవరించి వుంది. అది విశ్వవిద్యాలయాలనూ, విశ్వగురువులనూ, వసుధైకాలనూ సుస్థిరిం చేసేయగల చరిత్ర రచన ఇదే.
అయితే ఈ నవలా రచయిత మారుతి ఈ బారిన పడలేదు. ప్రణయ హంపి నవలలో ఆ జాగ్రత్త పాత్రల ఎంపిక నుంచే వుంది. కథనం అళియ రామ రాయల కోణం నుంచి కాక, ముద్దు కుప్పాయి కోణం నుంచి చెప్పడంలో ఆ జాగ్రత్త వుంది. చదువరులూ గమనిస్తారు. ఈ కట్టు తప్పకుండా రచన సాగిందని చెప్పడానికి మారుతి చేసిన పరిశోధన, శ్రమ పుస్తకం చివర్లో ఇచ్చిన పుస్తకాల జాబితాలో వుంది.
ప్రతి నాగరికతలో, సమాజంలో Fault Lines వుంటాయి, వున్నాయి. Fault lines అంటే విడివడిన రేఖలు, స్థరాలు, చీలికలు అని అర్థం. ఇది Geology కి చెందిన పదం. చరిత్ర రచయితలు ఈ పదాన్ని అక్కడినుంచే అరువు తెచ్చుకున్నారు. భూమి ఏర్పడినప్పుడు అది అనేక పొరలుగా, స్థరాలుగా ఏర్పడింది. ఈ చీలికలనే Fault lines అంటున్నారు. ఈ చీలికలు భూమి గర్భంలోనే పదిలంగా వుంటాయి. ఏదైనా ట్రిగ్గర్ (external or internal) వచ్చినప్పుడు ఈ fault lines విజృంభిస్తాయి. వాటి ఫలితంగా సునామీలు, భారీ విస్ఫోటనాలు, లావాలు బద్దలవడాలు, భారీ భూకంపాలు కూడా వస్తాయి.
మానవ నాగరికత గర్భంలో కూడా ఇట్లా Fault Lines వుంటాయి. అవి ఎప్పుడయినా రేగ వచ్చును, చెలరేగవచ్చును. వాటిని ఎప్పుడయినా రెచ్చగొట్టవచ్చును, విద్వేషం చెలరేగేలా చేయ వచ్చును. అట్లాంటప్పుడే ఈ fault lines స్వార్థప్రయోజనాలకు చాలా బాగా అందివస్తాయి.
ముస్లింల, బ్రిటిష్ పాలన, దేశవిభజన(లు), సిక్కుల ఊచకోత, కశ్మీర్ కాష్టం… ఇవన్నీ మన నాగరికతలోని Fault linesకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుని రెడీమేడ్ గా విద్వేషాన్ని రెచ్చగొట్టి చీలిక తీసుకురావచ్చని చరిత్రను ఇప్పుడు తిరగరాస్తున్న వారికి చాలా బాగా తెలుసు. అందుకే చరిత్ర రచనల్లో, కాల్పనిక చరిత్ర రచనల్లో ఈ ఫాల్ట్ లైన్సు పట్ల రచయిత ఎలాంటి దృక్పథంతో వ్యవహరించాడనేది కూడా చాలా కీలకం అవుతుంది. ప్రణయ హంపి నవలలో మారుతి ఈ నిర్వహణని చాలా చాకచక్యంగా నిర్వహించాడు. ఈ చైతన్యమే, ఈ వివేకమే మారుతి దృక్పథాన్నీ, నిబద్ధతనీ వెల్లడి చేస్తుంది. పంచ పాదుషాల వ్యూహాలు, అళియరామరాయల పరమతసహన జీవనం, సామరస్య గతం, అందుకు భిన్నమైన అతని దారుణ మరణం, రాజ్య విధేయత కోసం ప్రాణాలకు తెగించే సంబజ్జ గౌడ, ప్రేమను చాటేందుకు సరికొత్త నట్వాంగానికి మువ్వలు సవరించుకునే ముద్దుకుప్పాయి, యుద్ధ భీభత్సానికి పరాకాష్ట పతాకగా అవనతం అయిన వలంది పాత్రల నిర్వహణ ఈ కోణంలోంచి చూసినప్పుడు రచయిత నిపుణతే కాదు, పరిణితిని కూడా పట్టి ఇస్తుంది.
*
అయితే మారుతి మరచిన ఇంకో fault line నవలా కాలంలోనే పొడసూపిన వైష్ణవ, శైవ చీలిక. నిజానికి పంచపాదుషాల సైన్యం తళ్ళికోట యుద్ధాన్ని గెలిచి హంపీ పుర వీధులలో సృష్టించిన విధ్వంసంలో మరో నమోదు కాని కోణం వుంది. అది వైష్ణవం బలవంతంగా రుద్దబడిన శైవుల తిరుగుబాటు, నిరసన. ఇది చరిత్రగతిలో ముస్లిం సైనుకుల అకౌంటులోకి జారుకుని ఆవిరి అయిపోయింది. కానీ, ఆ నిరసన నమోదు కావలసినదే. హంపీ శైథిల్యంలో శైవుల నిరసనకు రుజువు నేటికీ ఒకే ఒక్క వైష్ణవ ఆలయం శిథిలంగా కూడా మిగలకపోవడం. ఒకే ఒక్క ఆలయం విరూపాక్ష(వింతకన్నులవాడు) ఆలయమే హంపికి ఆనవాలుగా మిగలడం. మీరు ఎప్పుడన్నా హంపికి వెళ్ళండి. సేదతీరుతున్న ఆనెగొంది పర్వతం కనిపిస్తుంది. అది ఎక్కి చూస్తే తుంగభద్ర దాటి చూపు మారితే విరూపాక్ష ఆలయం కనిపిస్తుంటుంది. ఆనె అంటే ఏనుగు. అలాంటి ఐదువందల ఏనుగుల మీద రాత్రికి రాత్రే ఖజానాని కొల్లగొట్టి తరలించిన మరొక పాలకులే విజయనగర పాలకులు. ఏ పాలకులకూ తీసిపోలేదు మరి!
Maruthi Powrohitham –
హంపీ నడిపిన ప్రేమకథ
—-అనిల్ డ్యాని
ఏ యుద్ధమైనా ప్రజలకు మాత్రమే నష్టం చేస్తుంది. అధికార కాంక్ష పెరిగిన తర్వాత రాజ్యాల కన్ను సుభిక్షంగా ఉండే ప్రాంతాల మీద పడింది. అక్కడినుంచే కుటిల తంత్రాలు మొదలయ్యాయి. దేశం ఎలా ఉన్నా , ఎన్ని కరువులు సంభవించినా కానీ రాజ్యాలు తమ సైన్యాన్ని పెంచి పోషించే నిల్వలు మాత్రం గట్టిగానే పొగుచేసుకున్నాయి.ప్రపంచ చరిత్ర నిండా ఎన్నో మరకలున్నాయి, వెన్నుపోట్లు, వక్రీకరణలు ఇలా రాసుకుంటూ పోతే అంతం లేకుండా సాగుతూనే ఉంటుంది.
కూలిన కోట గోడల వెనక ఉన్న మర్మమేమిటి అనేది శాసనాల్లో ఉంటుంది .అందులో రాజుల పరాక్రమం దానాలు, ధర్మాలు, వితరణల చిట్టాలు మాత్రమే ఉంటాయి. సాధారణ ప్రజానీకం పడిన బాధలు ఉండవు. గొంతు అరుచుకున్నా సరే గుక్కెడు పాలివ్వలేని తల్లుల బాధ అక్షరాలకు అందదు. రాచరికపు పాండిత్యం అంతా పల్లకిలో ఊరేగిన రాజుల చరితే రాసింది తప్పా పల్లకీ మోసిన బోయిల గురించిన ప్రస్తావనలు దాదాపు శూన్యమనే చెప్పాలి. అలాంటి మనుషుల కథని ,అందునా ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశారు ప్రముఖ కథకులు శ్రీ మారుతీ పౌరోహితం గారు. ఆయన రాసిన ఊరిమర్లు అనే కథల సంపుటి రాయలసీమ నేపధ్యంగా ,సీమలో ఉండే అనేకమైన వెతలను బయటకు తీసుకువచ్చింది. ‘కుశలంబే గదా ఆంజనేయ ‘ అనే కథ ఈయనకి ప్రాచుర్యం కల్పించినా ఆయన్ని అంచనా వేయడానికి మాత్రం చాలా కథలున్నాయి. అటు సీమ మాండలికాన్ని ఇటు తనకి తెల్సిన కన్నడ సీమ చరిత్రని ఆ భాషా మాధుర్యాన్ని మారుతీ గారు వదలకుండా తన కథల్లో చొప్పిస్తున్నారు.
‘ప్రణయ హంపీ’ కాస్త ‘హాళుహంపీ’ గా మారిపోవడం వెనక విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న అళియ రామ రాయలు, పంచ పాదూషాల సైన్యం ‘రాక్షస తంగడి’ వద్ద తలపడిన యుద్ధం, దాని వెనక గల కారణాలు, ఆ యుద్దానంతర పరిస్థితులని అంచనా వేయడం ఈ నవలలోని ఒక ప్రధాన అంశం. అక్కడితో మాత్రమే ఆగిపోలేదు రచయిత, ఆ కత్తులు సంవాదం వెనక ఒక మెత్తని ప్రేమ కథని మనకి అందించారు.వీర రసంతో మొదలైన నవల అనేక మలుపులు తిరుగుతూ వెళ్తుంది. తెలుగు సాహిత్యం లో ఈమధ్య కాలంలో రెండు పార్శ్వాలుగా సాగిన చారిత్రాత్మక నవల రాలేదు అంటే అతిశయోక్తి కానే కాదు.
కథని నేను ఇక్కడ పూర్తిగా చెప్పను గాని రచయిత ఊహా శక్తిని తప్పక మెచ్చుకుంటాను. నవల ని నడిపే ఒడుపు కాస్త అటు ఇటుగా ఉన్నా మూలమైన విషయాన్ని మాత్రం చాలా బిగువుగా చెప్పారు. సంబజ్జ గౌడ ఈ నవల కథానాయకుడు, ముద్దుకుప్పాయి కథా నాయిక, ఒక వీరుడు ఒక కళాకారిణి మధ్య నడిచే ఈ ప్రణయ కావ్యం హంపీ ఆ నగరపు చుట్టుపక్కల ఉండే అనేక దేవాలయాలు, ప్రాంతాలు, నగరాలు ఈ ప్రేమ కథలో భాగం అవుతాయి. స్త్రీ పురుషుల కలయిక పట్ల పెద్దగా ఆంక్షలు లేని ఆ కాలంలో కూడా నాయకా నాయికలు ఏకాంత సమయంలో కూడా యోగ క్షేమాలు మాత్రమే మాట్లాడుకోవడం అనేది రచయిత ఆ పాత్రలని ఎంత ఇష్టంతో రాశారో మనకి అర్థం అవుతుంది. ప్రేమలో ఎక్కడ మోహానికి తావివ్వలేదు. యుద్ధం విడదీస్తున్నదని తెల్సినా వారి ప్రేమ అజరామరం గానే నిలపడానికి రచయిత చేసిన ప్రయత్నం మెచ్చుకోతగింది. ప్రణయ హంపీ లో ఎలాగూ ప్రణయం ఉంది కదా అని రచయిత తన సొంత అభిప్రాయాన్ని మన మీద రుద్ధకపోవడం ఒక గొప్ప సంగతి.
రాజా వేశ్యల గురించిన ప్రస్తావన వాళ్ళ మీద వేసిన పన్నునుంచే సైనికుల జీతభత్యాలు నడిచినాయనే ఒక కఠోర వాస్తవం మనకి తెలుస్తుంది. బాగా బతికిన రాజ్యాలన్ని ఇలాగే ఉండేవేమోననే ఒక శంక మనసులో పాతుకుపోతుంది. పైగా సైన్యం యుద్దానికి వెళ్లే సమయంలో వాళ్ళ వెనక వెళ్లి వాళ్ళ శారీరిక అవసరాలు తీర్చే వేశ్య వృత్తి రాసిన విధానం బాగుంది. దాదాపు ఐదు లక్షల కాల్బలానికి కేవలం ఇరవైరెండు వేలమంది ఎలా సరిపోతారు. సైన్యం యుద్ధ విరమణ అనంతరం శృంగారానికి ప్రాధాన్యత ఇస్తూ అమ్మాయిల కోసం మల్లయుద్దాలు చేయడం వంటివి సైన్యాల మీద ఉండే నమ్మకాలు సడలిపోయేలా చేస్తాయి.కానీ ఇది నిజం.
ఇదిలా ఉంటె మధ్యలో ‘ వలంది’ కథ మనల్ని చిన్నాభిన్నం చేస్తుంది. రాజ వేశ్యలకి యుద్దాలతో పనేం లేదని మనం అనుకోవచ్చు , కానీ ఈ నవల ఆ భావన అపనమ్మకం అని పైన చెప్పిన ఋజువులతో సహా చూపిస్తుంది. ఒకానొక సందర్భంలో కథానాయిక కన్నా ‘వలంది’ బాధ పాఠకుణ్ణి ఎక్కువ కలవరపెడుతుంది. ప్రణయానికి ప్రాణాలు కాపాడుకోవడానికి మధ్యలో ఉండే ” స్వేచ్ఛ” అనే మాట ఎంత గొప్పదో ఈ రెండు పాత్రల్లో మనం అంతర్లీనంగా చూడొచ్చు. యుద్ధం వల్ల కలవరపడే వ్యాపారస్తులులు , వాళ్లు సొమ్ము పరాయి రాజుల పాలు కాకుండా దాచుకోవడానికి పడే తాపత్రయం ఇవన్నీ చరిత్ర చెప్పని నిజాలు , వాటన్నిటినీ ఈ నవల చర్చకు పెడుతుంది. పంచ పాదుషాల కలయిక ఆ నేపధ్యంగా సాగే నాటకీయ పరిణామాలు ఇంకాస్త లోతుగా చర్చిస్తే బాగుండేది అనిపించింది. సొంత సైన్యం వెన్నుపోటు లాంటి అంశాలు ఒక్కసారి మనకి కథని వెనక్కి వెళ్లి మళ్ళీ చదవడానికి ఆస్కారం కలిపిస్తాయి. ఓడిపోయిన రాజ్యం ఎలాఉంటుంది…? ఓటమి తర్వాత రాజులు ఏమి చేస్తారు అనే ఘట్టాలు ఇందులో వస్తాయి. కొండవీటి రాజ్యంలో ఉన్న అవచి తిప్పయ్య శెట్టి లాంటి పేర్లు ఇక్కడ కూడా దర్సనం మిస్తాయి. రాజ్యం పట్ల రాజు పట్ల వాళ్ళకుండే అపనమ్మకాలని ఈ నవల రేఖా మాత్రంగా స్పృశిస్తుంది.
యుద్ధం విడదీసిన ప్రేమ ఫలించిందా…? వికటించిందా..? అనే సస్పెన్స్ నేను చెప్పను కానీ మీకీ నవల ఒక అజరామరమైన ప్రేమ కథను అందిస్తుంది. కేవలం అద్దంకి శాసనాన్ని నేపథ్యం గా తీసుకుని రాసిన
“బోయ కొట్టములు పండ్రెండు” సీమ నుంచి వచ్చిన “శప్తభూమి” . ఈ రెండు నవలల సరసన ఈ నవల కూడా సగర్వంగా నిలబడుతుంది.
ఛాయా ఎప్పటిలాగానే మరో మంచి పుస్తకాన్ని తెచ్చింది. ఇలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి పబ్లిషర్స్ తటపటాయిస్తున్న సమయంలో ఛాయ చేసిన ఈ ప్రయోగాన్ని అభినందించాలి. వీరలక్ష్మి గారి ముందుమాట బాగుంది.
అనంతు డిజైన్ చేసిన కవర్ పేజీ బాగుంది.
ముమ్మాటికి రచయిత కృషి అభినందనీయం. మారుతీ పౌరోహితం గారినుంచి ఇలాంటి మేలిమి రచనలు మరిన్ని రావాలని ఈ ‘ప్రణయ హంపీ’ తన జైత్రయాత్ర కొనసాగించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను.
Maruthi Powrohitham –
ఆదిత్య అన్నావజ్జల :
నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, హంపీ మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి.. ఒకటి నేను పుట్టిన ఊరు, ఇంకోటి నన్ను నాకు పరిచయం చేసిన ఊరు అయితే, మూడవది ఇంతవరకు చూడకపోయినా ఆ ప్రదేశం గురించి చాలా చదివి, విని నచ్చిన ప్రదేశం. అదే హంపి. హంపి ఆధారంగా ఎలాంటి కథ రాసినా నేను తప్పకుండా చదవడానికి ప్రయత్నిస్తాను.. అలా చదివిన పుస్తకమే మారుతి పౌరోహితం( Maruthi Powrohitham ) గారు రాసిన ‘ప్రణయ హంపీ’ నవల.
విజయనగర సామ్రాజ్య రాజధానీ, ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్న హంపి, ఈరోజు నిర్జీవంగా, నివాస యోగ్యం కాకుండా మారిపోయిన పరిస్థితులు నన్ను ఎప్పుడూ కూడా ఆశ్చర్యపరుస్తాయి. ఈ కారణాలను తెలుసుకోవడంలో తెలియని ఆసక్తి ఉంది. ఈ కారణాల వల్ల కూడా ఈ పుస్తకం చదివే అవకాశం దొరికింది.
పుస్తకం పేరులో ఉన్నట్లే ఇది ఒక ప్రేమ కథ.. విజయనగర సామ్రాజ్యంలో అళియ రామరాయులు పరిపాలిస్తున్న కాలంలో సంబజ్జగౌడ, ముద్దుకుప్పాయి ల ప్రేమ కథ.
సంబజ్జగౌడ అళియ రామరాయుల అంగరక్షకుడు. ముద్దుకుప్పయి ఒక కళాకారిణి. మొదటి చూపులోనే ప్రేమలో పడతారు. కానీ అదే సమయంలో రాజ్యంలో యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. సంబజ్జగౌడ యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది. యుద్ధానికి వెళ్ళిన సంబజ్జగౌడ సజీవంగా వస్తాడా!!? యుద్ధంలో ఎవరు గెలుస్తారు!? అనేది మిగతా కథ!
సాధారణంగా యుద్ధ కథలు అనగానే ఎక్కువగా రాజుల గురించి, రాజకీయాల గురించి మాత్రమే చదివే మనం, యుద్ధ సమయాల్లో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉంటుంది!!? వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది..!! వారి ఆహార, వ్యవహారాలు ఎలా ఉంటాయి వంటి విషయాల గురించి పెద్దగా చర్చించుకోము. ఈ పుస్తకంలో మారుతి పౌరోహితం గారు ఈ అంశాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు.
కేవలం 110 పేజీలు మాత్రమే ఉండే చిన్న కథ ఇది. కానీ ఇంత చిన్న నవలలో కూడా హంపి నగరం గురించి, అప్పటి సంప్రదాయాల గురించి, ఉత్సవాల పద్ధతి గురించి చాలా వివరంగా రాశారు. అలానే అందరూ యుద్ధంలో సైనికుల గురించి, యుద్ధ ప్రణాళికల గురించి మాత్రమే చెప్తే, ఈ పుస్తకంలో సైనికుల శారీరిక అవసరాలు కోసం ఉపయోగించే వేశ్యల గురించి, ఆహార అలవాట్లు గురించి వివరంగా చర్చించారు.
ఇక్కడ ప్రత్యేకంగా వేశ్యల ప్రస్తావన గురించి తప్పకుండా చెప్పుకోవాలి. విజయనగర సామ్రాజ్యంలో వ్యభిచారం చట్టసమ్మతమైనది. ఆ కారణంగా ఎంతో మంది పేదలు తమ సంతానాన్ని వ్యభిచారంలోకి దింపేవారు. అలా వెళ్లిన వాళ్ళ జీవితాలు, ముఖ్యంగా యుద్ధ సమయంలో ఎలా ఉండేవి అనేది ఈ నవలలో ఎంచుకున్న మరో ముఖ్య అంశం.
చారిత్రాత్మక నవలలు ఇష్టపడే వాళ్ళు ఈ నవలను తప్పకుండా చదవాలి. తెలుగులో కొత్తగా పుస్తకాలు చదవడం మొదలు పెట్టాలి అనుకొనే వాళ్ళకి కూడా ఈ నవల ఒక మంచి ఎంపిక అవుతుంది.
Maruthi Powrohitham –
మధురాంతకం నరేంద్ర గారు :
ప్రణయ హంపీ నవల నిప్పుడే చదవడం ముగించాను. వీరలక్ష్మీ దేవి గారన్నట్టుగా చదివించే గుణం బాగావున్న నవలిది. There will be no song at the time of war అంటారు. కానీ ప్రణయాలు తప్పకుండా వుండే వుంటాయి. విజయనగర రాజులంటే తెలుగువాళ్ళకు వల్లమాలిన ప్రేమ గౌరవం వున్నాయి. అందువల్ల మీ నవల తెలుగు వాళ్ళకంతా ఆత్మీయమవుతుంది. యుద్దమనే పెద్ద ముళ్లచెట్టుకు అల్లుకున్న ప్రేమ అనే చిన్న మల్లె తీగలా వుంది మీ నవల. యుద్దకాలంలో జరిగే వాస్తవాలను పట్టుకుంది. చారిత్రిక వాతావరణాన్నీ, నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులనూ చూపెట్టింది. యుద్దమంటే యేమిటో చెప్పింది. నాటి దేవదాసీల జీవితాన్నీ వివరించింది. మరింత విపులంగా ఫ్రేమకథనూ, నాటి సాంఘిక జీవితాన్నీ చూపెట్టివుండే ఆస్కార ముంది. మీ స్వగ్రామం కర్ణాటకకు దగ్గరనిపిస్తోంది. చాలా పేర్లూ, మాటలూ కన్నడను తలపిస్తాయి. వసుదేంద్ర తేజో తుంగభద్ర నవల గుర్తుకొస్తోంది. చాలా రోజుల తర్వాత రాయలసీమ నుంచీ వచ్చిన యీ నవల fresh గా సాధికారంగా వుంది. అభినందనలు మీకు.
Maruthi Powrohitham –
ముక్కామళ్ళ చక్రధర్ :
(సీనియర్ జర్నలిస్ట్, విశాలాంద్ర కాలమిస్ట్)
మన కాలపు చింఘీజ్ ఐత్ మాతోవ్
నేను డిగ్రీ చదివే రోజుల్లో ఓసారి శ్రీకాకుళం వెళ్ళాను మాఊరు అమలాపురం నుంచి. రెంటికీ మధ్య దూరం ఆరేడు గంటలు. పగటి పూట ప్రయాణం. చలం మ్యూజింగ్స్ పుస్తకం చదువుతూ బస్సులో కూర్చున్నాను. ఓ నలభై ఐదు నిమిషాల ప్రయాణం, ఇరవై పేజీలు చదివి ఉంటా. అంతే ఆ ఇరవై పేజీలు నాలో సుడులు తిరుగుతూ నా ఆలోచనలు నాకే అంతు పట్టక ఆ ఆరేడు గంటల ప్రయాణం సాగింది. మధ్యలో టీ కోసం, సిగరెట్టు కోసం ఆగాను కానీ ఆ రెండు నాకు రుచించలేదు. చలం మ్యూజింగ్స్ నన్ను నిలువ నీయలేదు. ఇదిగో మళ్ళీ మూడున్నర దశబ్ధాల తర్వాత ఈ మారుతీ పౌరహితం రాసిన “ప్రణయ హంపి” చారిత్రక నవల నన్ను మళ్ళీ ఆనాటి మ్యూజింగ్స్ స్థితికి తీసుకు వెళ్ళింది. ఈ నవల వచ్చాక చాలా మంది ఫేస్ బుక్ లో తమ తొలి స్పందన రాశారు. ఏకబిగిన చదివేశామని, ఇది పూర్తయ్యే వరకు కన్ను తిప్ప లేకపోయామని చెప్పుకొచ్చారు. అమెరికాలో వుంటున్న మాజీ కమ్యూనిస్ట్, నేటి హిపోక్రాట్ తాను రెండు నవలలు చదువుతుండగా ఈ ప్రణయ హంపి తన చేతికి వచ్చిందని, ఆ రెంటిని ఆపేసి ఇది చదివేశానని చెప్పాడు. ఈ నవలావధానం ఏమిటో నాకు అర్ధం కావట్లేదు. సరే, నా మటుకు నాకు రెండు, మూడు ఛాప్టర్లు చదివాక ఇక ముందుకు వెళ్ళడం సాధ్యం కాలేదు. ఈ ప్రణయ హంపి నవలలో ..
“సాహసం, కవిత్వం, అందం, శృంగారం, ప్రేమ వీటి కోసమే మనం సజీవంగా వుంటాం” అంటుంది నవలలో కధానాయిక ముద్దుకుప్పాయి.
ఈ లైన్లు చదివాక ఇక ముందుకు వెళ్ళ గలమా! నిజంగా మనం వీటి కోసమే సజీవంగా వున్నామా..! ఈ సంక్షుభిత సమాజంలో ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. అనిపించడం కాదు. ఆ ఆలోచనలలోకి తీసుకుపోతుంది.
నా మహా రచయిత, చింఘీజ్ ఐత్ మాతోవ్ రాసిన “జమీల్యా ”కు ఈ ముద్దుకుప్పాయి కి మధ్య అనేకానేక పోలికలు కనబడతాయి. ఈ రెండు నవలల నేపథ్యం యుద్దము – ప్రేమే కావడం యాదృచ్ఛికం కానే కాదు. ఈ రెండు నవల్లోనూ కథానాయకులు, కథానాయికలు ఇద్దరూ అణగారిన కులాలకు చెందిన వారే. ఇద్దరూ అనివార్యంగా యుద్ద బీభత్సానికి చెదిరిపోయిన రెండు గుండెలే. అందుకే ఈ మారుతి పౌరహితాన్ని నేను మన కాలపు ఐత్ మాతోవ్ అన్నాను.
ప్రణయ హంపి చారిత్రక నవల దసరా ఉత్సవాలతో ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాల కోలాహలం మన కళ్ళే ముందే జరుగుతున్న భ్రాంతి కలిగిస్తారు మారుతి. దీన్ని జర్నలిస్ట్ పరిభాషలో అయితే సీన్ రిపోర్టింగ్ అంటారు. ఆ సీన్ రిపోర్టింగ్ ఈ దసరా ఉత్సవాలలో ఎంత గొప్పగా ఉందంటే “వ్యాపారులు రత్నాలను కందుల వలె రాశులు గా పోసి అమ్మకానికి పెట్టారు” అంటారు. ఈ ఉత్సవాన్ని చదువుతుంటే ఆ రాశులలో రత్నాలను కొనుగోలు చేయడానికి నేనూ అక్కడ మోకాళ్ళ పై కూర్చున్న భ్రాంతిని కలిగించారు మారుతి పౌరోహితం.
ఈ ప్రణయ హంపిలో ప్రియురాలు ముద్దుకుప్పాయికి ప్రియుడు సంబజ్జ గౌడ సాహితీవేత్త కనక దాసరు చెప్పిన బియ్యం- రాగి గింజ కథ చెబుతాడు. ఇది త్రేతాయుగంలో జరిగిన కథగా, బియ్యం, రాగి గింజల్లో ఏది గొప్పదో తేల్చే కథగా వివరిస్తారు. ఈ రెంటి వివాదాన్ని శ్రీ రామ చంద్రుడు పరిష్కరిస్తాడు. ఈ రెండు ధాన్యాలలో ఎప్పటికీ నిలువ వుండే రాగులదే పై చేయిగా తీర్పునిస్తాడు. ఈ తీర్పుతో రాగి గింజ గర్వ పడదు. తన పక్కనే నిలబడిన బియ్యపు గింజను ఓదారుస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. నవలలో ఈ ఉపకథ పైకి ధనిక, పేద వర్గాల మధ్యా, ఉన్నత, దిగువ వర్గాల మధ్యా అంతరాన్ని చూపిస్తుంది. నాకైతే ఈ ఉపకథ నేటి రాజకీయ, ప్రాంతీయ అస్తిత్వాల కథ గానే తోచింది. ఆంధ్రా పాలకుల పెత్తందారి తనానికి నలిగి పోయిన రాయలసీమ వాసుల గొంతుగా రాగి గింజ కానవచ్చింది. బియ్యం ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా పండే పంట. అక్కడ రాగి పంట వుండదు. అలాగే రాయల సీమలో రాగులే ప్రధాన ఆహారం. ఇక్కడ బియ్యానికి రెండో స్థానం. నేటి ప్రాంతీయ వాద, అస్తిత్వ వాద ఉద్యమాలతో ఈ బియ్యం, రాగుల మధ్య ఎవరు గొప్ప అనే ఉపకథ రచయిత మారుతి పౌరోహితం లోలోపలి అస్తిత్వ నినాదం.
నవలలో మకుటం లేని మహారాజు అళియ రామరాయులు ముస్లిముల పట్ల ప్రేమను, వాత్సల్యాన్ని అద్భుతంగా చూపించారు రచయిత. తన సైన్యంలో వారిని అధిక సంఖ్యలో నియమించుకున్నారు. తురక వాడలలో గోవధను అంగీకరించాడు. యుద్ద సమయంలో ఆ ముస్లిం సైనికులే కోవర్టులుగా మారి తమ వారినే హతమార్చడం రామరాయులకే కాదు నవల చదివే వారికి కూడ రుచించదు. సరిగ్గా ఇది చదువుతున్నప్పుడే నా చేతిలో వున్న నవలని అసహనంగా విసిరి కొట్టాను. నా మటుకు నాకు ఈ పరిణామం భీతి కొల్పింది. రచయిత పేరు పదే పదే గుర్తుకొచ్చి నా లోలోపల ఆవేదన చెందాను. వ్యక్తి స్వార్దాన్ని మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించడాన్ని చదివి కలత చెందాను. రెండు రోజుల పాటు మనిషిని కాలేకపోయాను. టేబుల్ మీద వున్న ప్రణయ హంపి నా వైపు చూసి “పూర్తిగా చదువు” అని అంటున్నట్లుగా నాకనిపించింది. ఇక్కడ కూడా నేను నవల ఆమాంతం చదివించేటట్లుగా అనిపించ లేదు. రెండు రోజుల తర్వాత ఓ భయం, బెరుకు వెంటాడుతుండగా వెన్ను పోటు పొడిచిన వ్యక్తుల సమూహం కంటే ఆ ముస్లిం సమాజమే, ఆ బాధుషాలే, విడిపోయిన, ఇక కలవలేరనుకున్న ముద్దుకుప్పాయి, సంబజ్జ గౌడలను కలిపిన తీరుతో సేద తీరాను. కోపంతో ఒకింత ఏవగించుకున్న రచయిత మారుతికి మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాను.
నవలలో వేశ్యా వృత్తిలో వున్న “వలంది” పాత్ర నేను రాసిన “భోగం వీధి సుగుణ”కు తోబుట్టువులా తోచింది.
ప్రేమ మాత్రమే మిగలాలని ఆకాంక్షిస్తూ… లక్షలాది ప్రాణాలను బలికొంటున్న యుద్ధం లేని రోజుల కోసం కలలు కనడం వినా ఇంకేం చేయలేమా…!?
(నేడు ఎమ్మిగనూరులో ప్రణయ హంపి చారిత్రక నవల ఆవిష్కరణ)
-ముక్కామల చక్రధర్
సీనియర్ జర్నలిస్ట్, 9912019929
Maruthi Powrohitham –
టి. శ్రీనివాస మూర్తి :
కథా రచయిత
యుద్దమంటే మానవత్వంపై దాడి, హక్కుల హననం. అటువంటి ఒక బీభత్స, విషాద నేపథ్యంలో మనుషుల మధ్య, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు తొడగడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఒక కొత్త ఆశనూ చిగురింపజేస్తుంది. కులాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా పాదుకునే ఈ ప్రేమలు మనుషుల హృదయ సత్ శీలతకు నిదర్శనం. యుద్ధంలో కూరుకుపోయి రాజ్యం కూలిపోతున్నప్పుడు, విలువలు పతనమై దేశం కునారిల్లుతున్నప్పుడు, మనుగడే ప్రశ్నార్ధకమైనప్పుడు యువతీయువకులే దాని ప్రక్షాళనకు నడుంబిగిస్తారు. న్యాయం పక్షాన నిలబడతారు.
బయటికి కనిపించకుండా వుండి యుద్దానికి కారణమైన కూలీన వర్గాల , ప్రభువుల అధికార దాహాన్ని యీ ప్రేమలు నిరశిస్తాయి. ప్రపంచ యుద్ధ నేపధ్యంతో రష్యన్ సాహిత్యంలో వచ్చిన అనేక నవలలకు ప్రేమే కథా వస్తువు. కేవలం అనువాద సాహిత్యంలోనే అటువంటి నవలలు సుమారు ఇరవై చదివి ఉంటాము. అవేవీ మనలను నిరాశపరచక పోగా మానవత్వం మీద అపార విశ్వాసాన్ని కలిగిస్తాయి.
మన దేశం లోనూ అటువంటి యుద్ధాలు ఎన్నో జరిగాయి. విజయనగర సామ్రాజ్యం చివరి దశలో జరిగినది రక్కసి-తంగడి యుద్ధం. ‘హంపీ’ నవల లోని ప్రేమ కథకు నేపధ్యం ఆ రక్కసి-తంగడియుద్ధమే.
చారిత్రిక నవలలు రాయటం అంత సులువుకాదు. కేవలం చరిత్ర పరిశోధన సరిపోదు. రచయిత ఆ కాలాన్ని ఆవాహన చేసుకోవాలి. ఆనాటి సంస్కృతి, ఆహార, ఆహార్య అలవాట్లను గ్రహించగలగాలి. చేస్తున్న సన్నివేశ కల్పన చరిత్ర పరిధిని దాటకుండా జాగ్రత్త వహించాలి. చరిత్ర పేరుమీద తన్ను మోసంచేయడం లేదన్న విశ్వాసాన్ని పాఠకుడిలో కలిగించాలి. హంపి నవల మీకు ఆ విశ్వాసాన్నిస్తుంది.
నవలా రచయిత అవుతున్న మా కర్నూలు కథకుడు మారుతికి శుభాకాంక్షలు
Maruthi Powrohitham –
ఆర్.ఎస్.వెంకటేశ్వరన్ :
చారిత్రక కాల్పనిక ప్రణయ కథ నవల. కన్నడ చారిత్రక కాల్పనిక ప్రణయ నవల తేజో తుంగభద్ర చదివాక తెలుగులో ఇలాంటి నవల ఎవరైనా ఎందుకు రాయరు? అనుకున్నాను. ఆ లోటు తీర్చాడు మిత్రుడు కర్నూలు వాసి అయిన మారుతీ పౌరోహితం.
విజయనగరాన్ని పరిపాలించిన వారిలో నాల్గవ తరం వాడు అళియరామరాయలు. కన్నడ భాషలో అళియ అంటే అల్లుడు. శ్రీకృష్ణ దేవరాయల వారి అల్లుడు కనుక అళియరామరాయలని పేరొచ్చింది. విజయనగరాన్ని పరిపాలించిన నాలుగు వంశాలు: సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశంలో రామరాయలు మొదటి వాడు. అళియరామరాజుల జీవిత చరిత్ర చిలుకూరి వీరభద్రరావు గారు పుస్తకం రాసారు. రాజుల చరిత్ర రాయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
పంచ పాదుషాలు మొదట్లో తమలో తాము కలహించుకోవడంతో బలహీనంగా ఉండి విజయనగర సామ్రాజ్యంపై కన్నెత్తి చూసేవారు కాదు కానీ ఆ తరువాత వారిలో వారికి వైవాహిక సంబంధాలు
ఏర్పడ్డాక కలిసికట్టుగా విజయనగరంపై దండయాత్రకు యోచన చేసారు. రామరాయలను పితృసమానుడిగా భావించిన అలీ అదిల్షా ఈ దాడికి వ్యతిరేకుడైనా మిగిలిన పాదుషాల ఒత్తిడికి తలవొగ్గక తప్పింది కాదు.
ఫలితం ప్రసిద్ధ తళ్లికోట యుద్ధం. అందులో అళియ రామరాయలు ఘోర పరాజయం పొంది, అందమైన హంపీ హాళుహంపీగా (పాడుపడిన హంపీ) మారిపోవడం జరిగింది.
ఈ యుద్ధ మేఘాలు అలుముకోవడాని కాస్త ముందుగా ప్రారంభం అవుతుంది సంబజ్జగౌడ ముద్దుకుప్పాయిల మధ్య ప్రణయం. సంబజ్జగౌడ వీరత్వం తెలుసుకున్న రామరాయలు అతడిని తన అంగరక్షకుడిగా నియమించుకుంటాడు. సరిగ్గా ముద్దుకుప్పాయి సంబజ్జగౌడతో తన ప్రేమ విషయం ఆ నియామకానికి ముందే వ్యక్తీకరిస్తుంది. అది పరిణయంగా మారేలోగా సంబజ్జగౌడ తన అనగొంది గ్రామం విడిచి వెళ్ళాల్సి వస్తుంది. వారి ప్రణయం పరిణయంగా పరిణమించిందా లేక ఏమయ్యింది అన్నది నవల చదివి తెలుసుకోవడమే అసలైన ఆనందం కనుక ఇక్కడ ఆ ప్రస్తావన సబబు కాదు.
గొప్ప కూచిపూడి నాట్యకళాకారిణి అయిన ముద్దుకుప్పాయి, వీరుడైన సంబజ్జగౌడ మధ్య ప్రణయం మాత్రమే ఈ నవలలో కథ అయ్యుంటే ప్రత్యేకంగా చెప్పాల్సినదేమీ లేదు. మరి ఎందుకు ప్రత్యేకం అంటే
మహాకవి శ్రీశ్రీ తన ‘దేశ చరిత్రలు’ కవితలో ఒకచోట
“ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు”
అంటాడు. మిత్రుడు మారుతీ పౌరోహితం ఆ అట్టడుగు మనుషుల కథలు వెదికాడు. కథలో సంబజ్జగౌడ, ముద్దుకుప్పాయిల ప్రణయ కథతో పాటుగా సమానాంతరంగా ఆ కథలు వినిపిస్తాడు. ఈ నవలను ఆకట్టుకునేందుకు ఈ క్రిందివి అసలైన కారణాలు;
*ఆనాటి విజయనగర ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితుల చిత్రణ నవలలో పూలదండలో దారంలా చివరివరకూ కొనసాగింది.
*ఆనాటి ప్రజల సాంస్కృతిక జీవిత చిత్రణ. చదువుతుంటే మన కళ్ళ ముందు కదలాడుతుంది.
*అళియరామరాయల కాలంలోనే జీవించిన గొప్ప కన్నడ ప్రజా కవి, ద్వైత సిద్ధాంత ప్రచారకుడు అయిన కనకదాసర ప్రస్తావన.
*యుద్ధ ప్రారంభం తర్వాత సామాన్యుల జీవితం ఏ విధంగా అతలాకుతలమౌతుందో వర్ణన.
*యుద్ధ కాలంలో రాజు వెంట నడిచేది సైన్యం, సైనికులకు తిండి, నీరు ఏర్పాటు చేసేవారు మాత్రమే కాదు. వేశ్యలు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఆశ్చర్యపోకండి. ఇది పచ్చి నిజం. అయిదు నెలల పాటు హింసాత్మకంగా కొనసాగిన తళ్లికోట యుద్ధంలో వేలాది మంది విజయనగర వేశ్యలపై జరిగిన హింస తక్కువేమీ కాదు. యుద్ధ హింసలో బలైన ఈ వేశ్యల కోణం బహుశా మొదటిసారిగా తెలుగు నవలలో చిత్రించబడింది.
*యుద్ధంలో విజయం పొందిన సైన్యం జయించిన రాజ్యంలో జరిపే పాశవిక వీర విహార చిత్రణ.
ఒక్క మాటలో చెప్పాలంటే నవలకు ముందుమాటలో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు అన్నట్లు ఇదొక “పరిపూర్ణ” నవల మాత్రమే కాదు మంచి రచనకు ఉండాల్సిన అన్ని కోణాల్లో “పరిపూర్ణ” నవల. శైలి ఎలా ఉందంటే మొదలుపెడితే పూర్తి చెయ్యనిదే ఆపలేరు.
మిత్రుడు పౌరోహితంకి నా అభినందనలు.
ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.
Maruthi Powrohitham –
గోపిని కరుణాకర్ :
మారుతి పౌరోహితం ప్రణయహంపి నవలని చదవడంలో నా స్వార్థం వుంది. సంవత్సరం క్రితం
నా ఎఫ్ బి వాల్ పై పారిజాతపహరణం అని నవల
రాసాను. ఫస్ట్ పార్ట్ బుక్ గా ప్రింట్ చేయాలి. ఈ నవల హంపి నేపథ్యంలో నడిచే ప్రేమకథ.పెనుగొండ,
చంద్రగిరి,బంగారుపాళ్యం నేపథ్యంలో కూడా ఉంటుం
ది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో జరిగే కథ.ప్రణయ హంపి నవల నా ఇతివృత్తానికి దగ్గరగా ఉంటుందో
ఏమోనని కొంచం టెన్షన్ పడ్డాను.చదివిన తరువాత
ఈ ప్రణయహంపి పూర్తి భిన్నంగా వుంది. ఒక్క సారిగా చదివించింది.శైలి,శిల్పం అధ్బుతంగా వుంది.
తీసుకున్న కథ హృదయాన్ని కదిలించింది. సంబజ్జ గౌడ, ముద్దుకుప్పయి ప్రేమకథ,యుద్ధనేపథ్యం, ముస్లీమ్, హిందువుల మైత్రి,ఆ రాజులు, వాళ్ళ అలంకరణ,అప్పటి వంటలు, ఆ రుచులు ఆ కాలాన్ని మన కళ్ళముందు దృశ్యాలు, దృశ్యాలుగా కనిపిస్తూ ఉంటాయి. కథ చెప్పను కానీ,మీరు నవల కొనుక్కుని చదివితే ఒక అనుభూతికి లోనవుతారు.ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిన తీరుకి అచ్చెరువు వొందు తారు.
ఈ నవలని ఇంకా విస్తృతంగా రాయాల్సింది. విస్తృతి అంటే సాగదియ్యడం కాదు.అలా అని కుదించడం
కాదు. భావొద్వేగాలను పండించడం. షేక్స్ పియర్ నాటకాలు లాగా, టాల్స్ టాయ్ నవల్స్ లాగా, వ్యాసుడి మహాభారతం లాగా రాయడం.మన
ముందు ప్రదర్శన ఇవ్వడం.
శప్తభూమి నవల కానీ, మనోధర్మపరాగం నవల కానీ వస్తు విస్తృత్రి ఉంటుంది. కానీ అంతే గొప్పగా ప్రదర్శన ఉండదు.
రచయితలు ఎందుకో చెట్టు మీద పండుని మాగ కుండానే దించేస్తున్నారు.చెట్టులో మాగిన పండు రుచేవేరు.
ఆ తీపి అమృతం.