ఆమె పేరు కాంచన. ప్రైమరీ న్కూల్లో మేమిద్దరం పక్కపక్కనే కూర్చునే వాళ్లం. ఆమె ఇంటి వెనుక వటారంలోని ఒక ఇంట్లో ఉండేవాళ్లం. నేను ఐదవ తరగతిలో ఉండగా మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావటంతో మేము మైనూర్కు వెళ్లిపోయాం. నేను తప్పకుండా తిరిగివస్తానని కాంచనకు ప్రమాణం చేశాను. నాకిప్పుడు డెబ్బయి రెండేళ్లు, అమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను.” –
అని చెప్పిన రావుగారు తన మాట నిలబెట్టుకున్నాడా? కాంచనని, తను ముద్దుగా పిలుచుకునే కాంచీని కలుసుకున్నాడా? ఒకవేళ కలుసుకుంటే, తనతో ఏమని చెప్పాడు? గడచిన ఆరు దశాబ్దాల్లో కనీసం ఒక్కసారైనా ఆమెను కలవనందుకు ఏమని సమాధానం చెప్పాడు?
ఆరుద్ర ఈశ్వర్ –
|| కాంచనసీత ||
రచయిత: కృష్ణమూర్తి చందర్
అనువాదం: రంగనాథ రామచందరరావు
బాల్యం ఎవరికైనా సరే చాలా ముఖ్యం. పెరుగుతున్నప్పుడు తెలియదు, ఒక్కసారి పెరిగాక కానీ దాని విలువ మనకు తెలియదు. పెరిగే కొద్దీ మన మనసులో ఎన్నో రకాల భావాలు, కోరికలు, ధ్యేయాలు, ఆశలు, ఆశయాలు అన్నీ గూడుకట్టుకుని, మనల్ని రణరంగంలోకి తోసి మన సమయాన్ని ముందుకు పరిగెట్టేలా చేస్తుంది. అన్నీ సాధిస్తూ పోయే కొద్దీ ఉత్సాహం ఇంకా పెరిగి, ఏదో సాధించాలని పరుగులు కాదు కదా పరుగును మించి జీవితాన్ని వేగంగా మారుస్తాం. అలా మార్చడమే కాక ఉన్న ఊరిని, కన్న వారిని కూడా విడిచిపెట్టి, రెక్కలు కట్టుకుని అందరికీ దూరంగా వలస వచ్చిన పక్షిలా రెక్కలు విదిలించి మరీ అక్కడ చేరతాము. చేరడమే కాదు, ఆ కాలంతోనే పరుగులు తీస్తూ చూస్తే వెనక ఎన్నో ఏళ్ల జీవితం కనుల ముందు సినిమా రీల్లాగా గిర్రున తిరుగుతుంది. అప్పుడు విశ్రాంతి తీసుకునే సమయంలో ఒకసారి గతాన్ని నెమరువేసుకుంటే, గడిపిన జీవితం, అనుభవించిన అనుభవాలు, ఇచ్చిన మాటలు, తీసుకున్న వస్తువులు, నడిచిన దారులు, ఎక్కిన కొండలు, చేసిన ప్రయాణాలు, చేరుకున్న గమ్యాలు అన్నీ నెమరుకు వస్తాయి. అలా నెమరుకు వచ్చిన సందర్భాలు గుండె బరువెక్కుతుంది. బరువెక్కడమే కాక, మరొక్కసారి ఆ బాల్యాన్ని చూసి రమ్మని, కుదిరితే అక్కడే ఉండిపొమ్మని, లక్షల్లో ఏ కొద్దిమందికి మాత్రమే ఇలా అనిపిస్తుంది. అలా అనిపించిన వారు బయలుదేరడం, గమ్యాన్ని చేరుకోవడం, బాల్యాన్ని కలుసుకోలేక అక్కడే మల్లగుల్లాలు పడటం, తలుచుకున్న వారిని కలుసుకునేవరకు మదన పడటం, కలిశాక ఆ ఆనందాలకు అవధులు లేకుండా పోవడం, అన్నీ జరిగిపోతాయి. ఎంత చక్కని ప్రయాణం కదా, ఇలా ఎవరైనా మన ఇళ్ళల్లో వారి స్నేహితులను, ఇచ్చిన మాటలను నెరవేర్చుకోవడానికి ఎవరైనా ఉంటే, మనం అలాంటి వారికి తప్పకుండా సహాయపడదాం. ఎందుకంటే వారు అనుకున్నవారిని వారి దగ్గరకు చేరిస్తే అంతకన్నా కోట్లు విలువ చేసిన ఆనందం ఇంకోటి ఉండదు.
కథ:
వెంకట సుబ్బారావు, కాంచన చిన్ననాటి స్నేహితులు. వీరు ఒకే క్లాసులో చదువుకుంటూ, ఒకటి, రెండు స్థానాలు భర్తీ చేస్తూ, పోటీ పడి చదివేవారు. కలిసే ఆడుకునేవారు, కలిసే బడికి వెళ్ళేవారు, కలిసే గుళ్ళకు వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళేవారు. అంతలా వారి స్నేహం అల్లుకుపోయి, ఒకరు పెద్ద, ఒకరు చిన్న అని మరచిపోయి మరి జీవితాన్ని ఆస్వాదించేవారు. ఆడా, మగా అని భేదం లేకుండా పెరిగారు. అలా సాగిన వారి జీవితంలో అనుకోకుండా సుబ్బరావు గారి నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావడంతో, వారు ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్ళేప్పుడు కాంచన గుక్క పెట్టి ఏడ్చింది, అది చూసిన సుబ్బారావు గారు మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను అని మాట ఇచ్చి, అక్కడి నుండి పెరిగే క్రమంలో జిల్లాలు కాదు, ఖండాలు సైతం దాటి యాభై ఏళ్ల పైనే అయ్యింది. అయితే మళ్ళీ కాంచన, సుబ్బారావు గారు కలిసారా? లేదా? అనేదే మిగిలిన కథ.
కథనం:
కథే మనసును హత్తుకుంటుంది అంటే కథనంతో ఇంకా కట్టి పడేశారు. కథనం అంతా కూడా ప్రస్తుతం, గతం అంటూ సాగి, ఆ తీయనైన మధురనుభూతులను తలచుకుంటూ సాగే కథనం, కొన్ని చోట్ల ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తుంది. వెంటనే మన స్నేహితులను కూడా మనం కలవాలి అనే కోరికను ప్రేరేపించేలా చేస్తుంది. అక్కడి మనుషులు, వాతావరణం, వారి అలవాట్లు, అన్నీ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్ది, మనకు అక్కడి పాత్రలను, భావాలను, మనుషులను, వారి మనసులను, అక్కడి చరిత్రను పరిచయం చేస్తూ సాగిన కథనం మనల్ని గుండె బరువెక్కేలా చేస్తుంది. దారి పొడుగునా జ్ఞాపకాల సమాహారం అయితే, మనసు పడే వేదన మరో ఎత్తు, అనుకున్న పని నెరవేరకపోతే యువకులే నిరాశ పడతారు, అలాంటిది డెబ్బై రెండేళ్ల సుబ్బారావు గారి పరిస్థితి మీరు చదివి తెలుసుకోవలసిందే.
కథాంశం:
కథలోని అంశం కొత్తది కాకపోయినా కూడా కథను, కథనాన్ని నడిపించిన తీరు ఏ మాత్రం ఒక చిత్రానికి సరిపడా భావాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఛామరాజనగర, మైసూరు, బెంగళూరు, నంజనగూడ, ఇలా ప్రతీ ఒక్క ప్రదేశ, గురించి, వారు బ్రతికిన ఊరి గురించి, అక్కడ ఉన్న ప్రదర్శకమైన ప్రదేశాల గురించి చర్చిస్తూ సాగిన తీరు అమోఘం. ఇంత అత్యద్భుతంగా ఒక కథలో ఆ ప్రదేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాల గురించి, అక్కడ కొలువు తీరిన దేవాదిదేవతల గురించి, ఆ ప్రదేశం యొక్క విశిష్టత గురించి, ప్రతీదీ క్షుణ్ణంగా కథలో భాగం చేస్తూ, ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, అక్కడి విశేషాలను తెలుసుకుంటూ, మనం కూడా వారితో పాటు ప్రయాణం చేయడం ఖాయం. అలా మనకు వెంకట సుబ్బారావు గారు, కాంచన గారు, సత్య, నాగరత్నం, నాగరాజు, మిగిలిన పాత్రల యొక్క కథల సమాహారమే ఈ కథాంశం.