ఏడేడు పద్నాలుగు లోకాలున్నాయంటారు. మన భూలోకం పైన్నున్న ఊర్ధ్వలోకాల్లో కిన్నెర కింపురుషులు, దేవతలు. ఇక భూలోకం కిందున్న అధోలోకాల్లో వింత జీవులు, రాక్షసులు, పాములు, క్రిమికీటకరకాలు ఉంటారని చెబుతారు.
ఆ లోకాలు మనకు కనిపిస్తాయో లేదో తెలియదు. అసలు మనలోకంలోనే ఉన్న అధోజగత్తు జనాల గురించీ తెలియదు. ఆ అధోలోక జనం గురించి వచ్చిన నవల జయమోహన్ గారి “అధోలోకం”.
ఏ గుడికో, తిరుణాళ్లకో పోతాము. వింత, వికృతరూపాలతో ఉన్న ముష్టివాళ్లను చూడ్డానికి కూడా ఇష్టపడము. చూడటానికే ఇష్టపడని జనాల జీవితాల గురించి మనకు తెలిసింది శూన్యం. వాళ్లకంటూ పేర్లుంటాయా? కోరికలుంటాయా? బతికేదెక్కడ?
మా దగ్గరున్న ఒక ఉర్దూ సామెత… “చినాల్ కో చారాణా, బాడకావ్ కో బారాణా”ను అనువదిస్తే “వళ్లమ్ముకునేదానికి పావల, తార్పుడుగాడికి ముప్పావలా” అని. మరి ఈ ముష్టివాళ్లనూ “సరుకు”గా వ్యవహరిస్తూ వ్యాపారం చేసే జనం ఉన్నారు.
ముత్యాలు అనే ఒక వికృతరూపం స్త్రీ ప్రసవవేదనతో నవల మొదలవుతుంది. అప్పటికే 17 “ఈతలు” (వాళ్లు సరుకే కాదు, జంతువులు కూడా… అందుకే వాళ్లు పిల్లల్ని కనరు ఈతలేస్తారు).
మరి ఈ కురూపులకు మామూలు పిల్లలు పుడితే?!?!!? అమ్మో… ఇంకేమన్నా ఉందా? అందుకే వీళ్లకు జతగా ఏ అంగవైకల్యమో ఉన్నవారినే జత చేస్తారు. కురూపులనూ కామానికి వాడుకునే జనాలకూ తక్కువేం లేదు. ఎన్నోసార్లు దినపత్రికల్లో తల్లికాబోతున్న పిచ్చి ముష్టిది వార్తలు చదువుతూనే ఉన్నాము.
ఇక ఈ సరుకునంతా ఏ డొక్కు వాహనాల్లోనో కుక్కి ఉత్సవాలు జరిగే ఆలయాలకు ముష్టెత్తటం కోసం తీసుకుపోతుంటారు. ఎక్కడెక్కడినుంచో వచ్చే వ్యాపారులు ఒకరిసరుకు మరొకరు కొనడం. ఎక్కడెక్కడొ కలసిన ముష్తివాళ్ల పలకరింపులూ ఉంటాయి. మళ్లీ వీళ్లలో కులమత ఆభిజాత్యాలకూ కొదవేం ఉండదు. వీళ్ల వ్యాపారుల దగ్గర మామూళ్లే కాదు, కామం తీర్చుకోవడానికి ముష్టివాళ్లను తీసుకుపోయే పోలీసులూ కనిపిస్తారు.
గుడికి పోయేదారి, మెట్లమీద ఈ ముష్టివాళ్లను చూస్తామే తప్ప ఆ ఆలయాల్లో, దర్శనం క్యూల్లో మనం వీరిని చూసిందే ఉండదు. (ఈ నవల చదివే వరకూ ఈ విషయం నాకూ స్ఫురించలేదు)
ముగ్గురాడపిల్లల తండ్రి అయిన ముష్టివ్యాపారి కుటుంబం కథ ఉంటుంది. ఎంత నికృష్టుడైనా వీడికీ దైవభక్తి, వాడి పిల్లలల మీద మమకారం ఉంటాయి. ఎంతలా అంటే ఉత్సవం నుండి చిన్న కూతురికి గాజులు తేవడం మరచిపోతే, అమ్మాయి ఏడుపు చూసి అర్ధరాత్రి బంగారం గాజులు కొని తెచ్చేంత… వీడికొంపలో చీమచిటుక్కుమన్నా తెలుసుకుని ఊరంతా టాంటాం వేయాలనుకునే సమాజాన్ని ప్రతిబింబించే ముదనష్టపు ముసలావిడా ఉన్నారు.
వీడే కాదూ… అభ్యుదయం, విప్లవాత్మకమైన నా పార్టీ వేరు; వెనుకబాటు, వేర్పాటు వ్యవహారంతో నడిచే ఆశ్రమ వ్యాపారం వేరంటో, ఉపనిషత్తుల వాక్యాలను ఉటంకించే కమ్యూనిస్ట్ వ్యాపారి కూడా ఉంటాడు. ఈయనలానే రెండు మొహాల గుడిలో అర్చకుడూ ఉన్నాడు.
చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి యాసిడ్‌తో కురూపులుగా మార్చి ముష్టివారిగా తయారు చేసే నికృష్టులూ ఉన్నారు.
ముష్టివాళ్లను బాబా/మాతగా మార్చి వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచనలు, నేటి అవధూతల(?) గురించి తెలుస్తుంది. సరుకును బట్టే విలువ.
మొత్తమ్మీద 18 ఈతలు వేసిన ముత్యాలు ఎక్కువ సమయ గడిపింది మాత్రం 18వ బిడ్డ “రసనీకాంత్” తోనే. ఇక వాడినీ సరుకుగా అమ్మేసారు.
మళ్లీ ముత్యాలును మరో ఈతకు ఒక గూనివాడితో సిద్ధం చేసారు. వాడితో ముత్యాలు బంధం, ఆ హృదయవిదారక వేదన నవల ముగింపు. గుండెలవిసేలా ఏడ్చేది ముత్యాలు మాత్రమే కాదూ చదువుతున్న పాఠకుల హృదయాలు కూడా…
అప్పట్లో శివపుత్రుడు, వాడు-వీడు, పరదేశి, సేతు(శేషు) చిత్రాల దర్శకుడు బాల “నేను దేవున్ని” చిత్రానికి ప్రేరణ ఈ నవలే (కానీ ఆ సినిమాకు కాశీభట్ల వేణుగోపాల్ గారి ఒక కథకూ పోలికలెక్కువ). సినిమాల్లో పుష్పక విమానంలో పీ.ఎల్.నారాయణ ముష్టివాడి పాత్ర, శంకర్ బాయ్స్ సినిమాలో గుడి-అన్నదానం టైం టేబుల్ ఉండే ముష్టివాడు. ఆ మధ్య వచ్చిన బిచ్చగాడు ఇంకా మధుర్ బండార్కర్ ట్రాఫిక్ సిగ్నల్ సినిమాల్లో ముష్టివాళ్లను చూసినా నా మటుకు నేను వీరి జీవితం ఇతివృత్తంగా వచ్చిన నవల చదివింది మాత్రం ఇదే మొదటిసారి.
పాత్రల సంభాషణల్లో బూతులు దొర్లుతున్నా అవన్నీ ఆ పాత్రల సహజ సంభాషణలు మాత్రమే అనిపిస్తాయి.
ఊహాలోకపు జీవితాలే కాదు, అధోలోకం జీవితాలూ తెలియాలంటే తప్పక చదవండి…
1990ల నాటి కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని ప్రాంతాల నేపధ్యంలో నవల సాగుతుంది. కొన్నిపేర్లు వింతగా ఉన్నా అచ్చమైన తెలుగు నవలలా ఉంది. ఎక్కడా పరభాషా వాసన తగలని చక్కని అనువాదం.
అనువాదకులు కుమార్, అవినేని భాస్కర్. ప్రచురుణకర్తలు “ఛాయ” వారికి ప్రత్యేక అభినందనలు.