ఫేస్బుక్ లో కొన్ని పోస్టులను చూసి, చాలా రోజులకు ఒక పుస్తకాన్ని చదవాలనే బలమైన కాంక్ష కలిగింది. అలా “నెమ్మి నీలం” చేతికి అందగానే 450 పేజీలను ఆపకుండా చదివేసాను.
రచయిత స్వగతంతోనే ఉద్వేగం మొదలయింది. అవినీతి పైన ఉద్యమం ద్వారా మార్పు వస్తుంది అనే ఆయన కల నెరవేరక పోతే ఆయనలో ఒక స్తబ్ధత ఏర్పడింది. ఆ స్తబ్ధత తొలగించుకోవటానికి చేసిన అన్వేషణలో, నేడున్న పరిస్థితుల్లో ఆచరణాత్మక ఆదర్శ వాదానికి గాంధీయ సిద్ధాంతం తప్ప మార్గాంతరం లేదు అని గ్రహిస్తారు. “విసిగి వేసారిపోయిన స్తబ్ధస్థితి నుండి లేచి వెళ్ళి నాకు జీవితంలో ఎదురైన ఆదర్శవాదుల జీవితాలను స్ప్రశించే ప్రయత్నం చేసాను. ఈ వెతుకులాటలో చేరుకున్న గమ్యమే ఈ కథలు” అంటారు. జయమోహన్ గారి ఆలోచనలతో
చాలా కనెక్ట్ అయ్యాను. అమాంతంగా కథలన్నీ నమిలి మింగేయాలన్నంత తపన.
అనుకున్నట్టుగానే ఏ కథా నిరాశ పరచలేదు. చాలా కథల్లో తమిళ సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు పాత్రలుగా వస్తారు. కొన్ని కథల్లో రచయితే ఒక పాత్రగా ఉంటారు. ఎంతవరకూ నిజమైన సంఘటనలో, ఏది రచయిత సృష్టో అని ఆలోచన వచ్చినా కథలో ఫ్లో ఒకేలా ఉండి ఆ తేడా తెలియలేదు. అద్భుతమైన పాత్రలూ, విభిన్నమైన అంశాలూ, సిట్యుయేషన్ ని ఎలివేట్ చేసే అందమైన వర్ణనలూ, అలవోకగా సాగిపోయే కథనమూ..అన్నీ కలిపి మంచి పఠనానుభవాన్ని ఇచ్చాయి.
భాస్కర్ గారి అనువాదం తెలుగు కథలే చదువుతున్న ఫీల్ ఇచ్చింది. తమిళ పేర్లు, అక్కడి సంఘటనలు చదివినపుడు మాత్రం ఇంత మంచి తమిళ కథలు చదివే అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాను.
మొదటి కథ “ధర్మం” నాకు ఇష్టమైన సబ్జెక్టుతో మొదలయ్యింది..ఒక సీనియర్ రచయిత తనను కలిసిన జయమోహన్ గారికి తన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాన్ని చెప్తూ ఉంటారు. అబ్బురమైన వారి రచనా జీవితం కళ్ళ ముందు ఆవిష్కారం అవుతుంది. ఈ పాత్రే ఈ కథలో మన రచయిత వెతుక్కున్న ఆదర్శవాది అనుకుంటూ ఉన్నాను. ఇంతలో కథాగమనంలో మరో అద్భుత పాత్ర ఆవిష్క్రతమవుతుంది.. కథలో వావ్ మూమెంట్ అది…ఆమె గురించి చదువుతుంటే గూస్బంప్స్. ఏంటో తెలుసుకోవాలి అంటే పుస్తకం చదవాల్సిందే మరి.
రెండోకథ “ఒగ్గనివాడు”, టైటిల్ లోనే కథ ఉంది. కుల వివక్ష గురించీ, దాన్ని ఎదిరించిన వారి గురించీ చాలా కథలే చదివాను..కానీ “యానై కఱుత్తాన్ నాడార్ ” గురించి చదివినపుడు కలిగిన ఉత్తేజం, సంతోషం ఎప్పుడూ కలుగలేదేమో. ఇతన్ని మించిన మరో వ్యక్తి నేసమణి..ఏం రాశారు సార్..You truly deserve all this appreciation.
“అమ్మవారి పాదం” కథ ఒక సంగీత విద్వాంసుని హిపోక్రసీ, దాని వళ్ళ అతని భార్యా, మనుమడూ ఎదుర్కన్న మానసిక సమస్యల గురించినది. చిన్నదే అనుకున్న తొందరపాటు పని జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో సటెల్ గా రాసారు.
“ఏనుగు డాక్టర్” కథ గురించి చాలా మంది చెప్తే విన్నాను. విన్నదాని కంటే, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా గొప్పగా ఉంది. ఆయనలో ఒక మంచి డాక్టర్నే కాదు, పరిపూర్ణ మానవున్ని చూడవచ్చు. అడవి గురించీ, అడవి జంతువుల గురించీ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
“నెమ్మి నీలం” కొందరు అద్భుతమైన కళాకారుల భావోద్వేగాలు, ఉన్మత్త రసాస్వాదన, తృష్ణ గురించిన కథనమిది.
“కూటి ఋణం” కథ చదివాక కెత్తేలు సాయిబు చేతిని ఒక్కసారి ముట్టుకోవాలి, ఆర్తిగా ముద్దాడాలి, భక్తితో మొక్కాలి అనిపిస్తుంది. మనిషి ఎంత లోతుగా వెళ్ళయినా సేవ చేయవచ్చు, నిస్వార్థంగా ఉండొచ్చు అని సాయిబు ద్వారా చూపించారు రచయిత. ఒకరి మంచితనం, తన సాయం తీసుకున్న మరొకరికి పాకటం..ఇది కదా కావాల్సింది..చెడే కాదు మంచి కూడా స్ప్రెడ్ అవుతుంది అనే భరోసా, నమ్మకం కావాలి ప్రస్తుత సమాజానికి. మంచికి కాలం కాదులే అనే అభిప్రాయం బలపడుతున్న కాలంలో ఇలాంటి మనుషులు కావాలి..వారి గురించిన కథలు కావాలి.
“వంద కుర్చీలు” కథ గురించి రాసే, మాట్లాడే ధైర్యం కూడా రావటం లేదు. ఇంత దయనీయమైన, బాధాకరమైన జీవితాలు ఉంటాయి అని ఊహకు కూడా అందదు. ఇలాంటి కథ ఎప్పుడూ చదవలేదు కూడా. కథలో ఒక దగ్గర రచయిత కనిపిస్తారు కాబట్టి యదార్థమైన జీవితాల ఆధారంగానే రాసి ఉంటారు అనుకుంటున్నాను. ఇంతటి వివక్ష ఉన్న సమాజంలో బతకడానికి సిగ్గుపడాలి.
“యాత్ర ” కథ కోమల్ స్వామినాథన్ అనే గొప్ప రచయిత, దర్శకుడు కథకుడితో పంచుకున్న కైలాస్ యాత్రానుభవం. ఇది హిమాలయాలకు చేసిన యాత్ర మాత్రమే కాదు, తనలోకి తను చేసిన మనో యాత్ర. మనిషి నిరంతర అన్వేషణ..తను వదులుకున్నవి, పట్టించుకోనట్టు నటించినవి మనసులో ఎంత లోతుగా పాతుకొని ఉంటాయో..అవి ఏ ఒంటరి క్షణాల్లో బయట పడుతాయో. learning..unlearning…ఆలోచనల అవలాంచ్ ఈ యాత్ర.
“చిలుకంబడు దధికైవడి ” కథ కొందరు తమిళ రచయితలకు, వారి మెంటోర్ కి మధ్య అనుబంధాన్ని గురించినది. కంబరామాయణం గురించి వచ్చిన ప్రస్తావనలోని పద్యంలోని తొలి పదాలను టైటిల్ గా పెట్టారు.
“తాటాకు శిలువ” ఒక మిషనరీ వైద్యుని కథ. మత మార్పు గురించి ఒక శిష్యుని అంతస్సంఘర్షణ కథలో అంతర్లీనంగా ఉంటుంది.
“పిచ్చిమాలోకం” ఒక నికార్సయిన స్వాతంత్య్ర సమరయోధుడు పూమేడై రామయ్య గారి కథ. ఈయన బ్రిటీష్ వాళ్ళతో చేసిన యుద్ధం కంటే, తన చివరి శ్వాస వరకూ స్వతంత్ర భారతదేశంలోని అవినీతి మీద చేసిన యుద్ధమే ఎక్కువ.
“ఎల్ల లోకములు ఒక్కటై” నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన కథ. విశ్వ మానవుడు, వసుధైక కుటుంబం ఈ పదాలు మొదటినుండీ చాలా ఇష్టం. ఇలాంటి ఆలోచనకు ఒక రూపం తెచ్చారని, దానికోసం ఒక వ్యక్తి జీవిత కాలం పోరాడాడు అని తెలిసి సంభ్రమాశ్చర్యం కలిగింది. అమెరికాలో పుట్టి పెరిగిన మాజీ సైనికుడు గ్యారీ డేవిస్ ” International Registry of World citizens ” అనే సంస్థను స్థాపించి తన అమెరికన్ పాస్పోర్ట్ త్యజించి ఈ సంస్థలో మొదటి పౌరుడు అయ్యాడు. “ఆల్బర్ట్ కామూ” మొదలైన వారు ఆయనకు మద్దతు తెలిపారు. వివిధ దేశాల ప్రధానమంత్రులూ, ప్రెసిడెంట్ లూ వారి దేశాల్లోకి అతని world passport తో అనుమతించారు. ఆయన తమిళనాడుకు చెందిన “నటరాజగురు” తో ఒకే ప్రపంచం అన్న సిద్ధాంతం కోసం కలిసి పని చేసారు. వీరి శిష్యుడు “నిత్యచైతన్యయతి” ని కలవడానికి వెళ్లిన మన కథకునికి అక్కడ గ్యారీ డేవిస్ తో పరిచయం అవుతుంది..వారిద్దరి సంభాషణ, నమ్మశక్యం కాని గ్యారీ డేవిస్ జీవితాల గురించి తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.