‘నెమ్మి నీలం’ పుస్తకం లోని కధలు చదువుతున్నాను.ఏనుగు డాక్టర్ నాకు ఇష్టమైన కధ అనుకున్నాను.కానీ “వంద కుర్చీలు” కధ చదివాక ఆ అభిప్రాయం మారిపోయింది.వంద కుర్చీలు ఏమి కధ అది,జయమోహన్ ఆ కధని ఎలా రాయగలిగారు.నాయాడు కమ్యూనిటీ గురించి ఆయన ఎంత రిసెర్చ్ చేసి ఉండాలి.కధ చదువుతుంటే కడుపులో పేగులు లుంగచుట్టుకుపోతున్న బాధ,దుఖం.పేరు లేని ఆ తల్లి జీవితం,ఆ భయానకమైన జీవిత విధానం గుండెను పిండేస్తూంది.నాయాడు కమ్యూనిటి ప్రజలు ఎంత సామాజిక అణిచివేతకు గురై ఉంటే,ఎంత దుఖాన్ని ఆమె భరించి ఉంటే చొక్కా,కుర్చీల మీద అంత పెను భయాన్ని పెంచుకుని ఉంటుంది.వాటిని చూడడమే ఆమెను ఒణికిస్తుంది.
నాయాడులంటే మన దగ్గర యానాదులనే భావం కొన్ని చోట్ల కనిపించింది.యానాదులు కూడా తీవ్ర కుల వివక్షకు,అణిచివేతకు గురౌతున్న కమ్యూనిటీ నే.
‘వంద కుర్చీలు’ కధ చదువుతున్నప్పుడు బ్రిటీష్ వాళ్ళు నేరస్త కులాలుగా ముద్రవేసి వేధించిన “ఉచల్యా” నవల గుర్తొచ్చింది.లక్ష్మణ్ గైక్వాడ్ రాసిన ఆత్మ కధాత్మక నవల సాహిత్య అకాడెమీ అవార్డు కూడా పొందింది.ఉచల్యా చదివి ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినా అదెప్పుడూ నాకు గుర్తు వస్తూనే ఉంటుంది.
నెమ్మి నీలం పుస్తకం లోని ఇతర కధలు ఇంకా చదవాలి.
అందరూ వంద కుర్చీలు కధ చదవాలని…
2015 లోనే ‘పద్మశ్రీ’ ని తిరస్కరించిన జయమోహన్ మీకు వంద నమస్కారాలు.