పతంజ‌లిశాస్త్రి క‌థ‌లు.. వేరే లోకం

పతంజలి శాస్త్రి కథలంటే ఇష్టం. ఎందుకంటే తెలియదు, అది అంతే. ఆయనకి అవార్డు వచ్చినప్పుడు రాద్దామనుకున్నా. రాయలేదు. అవార్డు ఆయనకి మించింది కాదు. జ్ఞానపీఠమైనా తక్కువే. మన కాలం మహారచయిత.

ఈ మధ్య నేను తెల్లారి లేస్తున్నా. బూడిద రాలుతున్న ఆకాశంలో నుంచి బంగారుపల్లెంలా సూర్యున్ని చూస్తున్నా. ఏళ్ల తరబడి జర్నలిస్టు నైట్ డ్యూటీల్లో కోల్పోయిన సౌందర్యం. నిద్రలేని రాత్రుల నుంచి, నిద్రపట్టని రాత్రుళ్ల ఫేజ్లోకి ప్రవేశించా. అందుకే అకాల మెలకువ.
రాయడంలో పతంజలిశాస్త్రి ఎలా పిసినారో, ఆయన కథల్ని చదవడంలో నేనూ అంతే కొంచెం కొంచెంగా చదువుతా. ఒక్కోసారి రెండు మూడు వాక్యాలే చదివి మర్మలోకంలోకి జారుకుంటా. ఈ మధ్య 2+1 =0 అనే కథల పుస్తకం వచ్చింది. చాయమోహన్ వేసారు. కూర్చుంటే పూర్తి చేయడానికి గంట చాలు. కానీ చాలా కాలంగా చదువుతున్నా, అంతేముంది అంటే, లేనిదేముంది?

ఈ రోజు దీపాలపల్లె బోవాలె అనే కథ చదివా. మృత్యువు సరిహద్దుల్లో జీవించే నాగముని ఆఖరి కోరిక దీపాలవల్లె పోవడం. ఎక్కడుంది? ఆయనలోనే వుంది. దుర్గాపురం వస్తానని మాటిచ్చిన దేవదాస్ గుర్తొస్తాడు. వానలో బండి నడిపిన ముసలాయనే నాగమునా? ఎద్దుతోనే ప్రపంచం, ప్రపంచాన్నే ఎద్దులో చూసుకునే గుండ్రంగా జీవించే వ్యక్తి నాగముని,

నాగముని అంటే రమణి తాత కాదు, మా తాత కూడా నేను చిన్నప్పుడు తెలియక ఎద్దుని చల్కాలాతో కొడుతూ వుంటే, దాంతోనే తాత ఒకటిచ్చాడు. గట్టిగా ఏడ్చాను. “నీకు కనపడదు కానీ, ఎద్దు కూడా అట్లనే ఏడుస్తాది” అన్నాడు. ఎద్దు చనిపోయినప్పుడు పసిపిల్లాడి కంటే అన్యాయంగా ఏడ్చాడు. కరువు పల్లెల్లో కన్నీళ్లకి కొదువా?

శాస్త్రి కథలు మనల్ని ఆ అక్షరాల్లో ఉండనియ్యవు. ఎక్కడికో తీసుకళ్లి సంచారం చేయించి మళ్లీ ఈ లోకంలోకి తెచ్చి

నాగముని ఆఖరి ప్రయాణం ఈ కథ. జాతి వెల్లిపోతున్నాడు. ఆయన చివరి కోరిక ఎంలో మనుమరాలికి అర్థం కాదు. D దీపాలపల్లెని వెతికింది. దొరికింది. అయితే అది ఎప్పటి జ్ఞాపకం. ఈ జన్న. గత జన్మ? శాస్త్రి కథల్లోని గొప్పతనం, లోగుట్టు ఇదే. ఏదీ విప్పి చెప్పరు. నేయి పట్టుకొని నడిపించను. తదుముకుంటూ మనమే మార్మిక లోకంలోకి వెళ్లాలి.

మనుషులంగా తెలిసో తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో జీవిస్తూ వుంటారు. ఆట ముగుస్తున్నప్పుడు, కొత్త ఆట ప్రారంభం అవుతున్నప్పుడు, లేదా మైదానం లేని చీకటి గుహలో ప్రవేశిస్తున్నప్పుడు మనిషి ఏం ఆలోచిస్తాడు?

వెళ్లిపోతున్నప్పుడు ఆఖరున రూపు దిద్దుకునే వాక్యం ఏంటి?

శాస్త్రీ కథలు విశ్లేషించడం నా పని కాదు, నాతో కాని పని, పాత కాలం ప్రింటింగ్ ప్రెస్లో పని చేసే కార్మికుడిలాగా అక్షరాలు వెతుక్కోవాలి. ఎవరికి వాళ్ల చదువుకోవాలి. అర్థమైన వాళ్లకి అర్థమైనంత.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top