2018 లో అనుకుంటా.
ఆఫీస్ అయిపొయ్యేసరికి రాత్రి 9.30 దాటింది. పార్కింగ్ లోనుంచి బయటికి రాగానే వర్షం తగ్గిన తర్వాతొచ్చే చల్లగాలి వణికించింది. మళ్లీ వర్షం వచ్చేలోపు క్రిష్ణానగర్ చేరుకోవాలని శిల్పారామం మీదుగా 100 ఫీట్ రోడ్డెక్కింది నా అపాచీ బైక్.
ట్రాఫిక్ తక్కువుండటంతో బైకు వేగం పెరిగేకొద్దీ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి.
మాధాపూర్ వైయస్సార్ విగ్రహం దగ్గర లిఫ్ట్ కావాలంటూ ఎవరో చెయ్యెత్తారు. చూస్తూనే చెప్పొచ్చు ఎవరో లేబర్ పని చేసుకునే అతను అని. ఆ రూట్ రో షేర్ ఆటోలు ఉండవు. బాడుగకు తీసుకుపోయేంత ఉండదు. ఆ స్పీడ్ ను కంట్రోల్ చేస్తూ కొంచెం ముందుకాపాను. పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ ఎక్కాడు.
మనిషి సన్నగా మాసిన బట్టలు వేసుకుని ఉన్నాడు. వయసు ముప్పైకి దాటి ఉంటాయి. వానకు తడిచాడేమో వణికిపోతున్నాడు. అపాచీ బైక్ వెనుక సీటు కొంచెం ఎత్తుగా ఉండడంతో బ్రేక్ కొట్టినప్పుడల్లా మిందికి పడుతున్నాడు. మధ్యలో అడ్డంగా ల్యాప్ టాప్ బ్యాగు ఉండడంతో నా ఒంటికి తగలడం లేదు. అతనలా మీదపడటం నాకు కంఫర్టబుల్ గా లేదు. తొందరగా దిగిపోతే మేలని మరింత వేగంగా వెళ్తున్నాను.
బైక్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లోకి తిరిగింది. మామూలుగానే ఆ రోడ్డు చల్లగా ఉంటుంది, అలాంటిది వర్షం పడితే ఆగుతుందా. చలి పులి విజృంభిస్తోంది.
ఆ వేగానికి బ్యాలెన్స్ కోసమో లేక చలి వల్లో తెలియదు మెల్లిగా చెయ్యి తొడ మీద వేశాడు. బ్రేక్ కొడుతున్న ప్రతిసారీ నా ప్యాంట్ పట్టుకుంటున్నాడు. లోపల భయంగా ఉంది ఎక్కడ ఇంకో చెయ్యి వేస్తాడోనని. ఆ ఆలోచనే ఒళ్లంతా కంపరం పుట్టిస్తోంది.
మర్యేదగా వచ్చేవాన్ని రాకుండా పెద్ద పుడింగిలాగా ఎవడివ్వమన్నాడు లిఫ్ట్ అంటూ నన్ను నేను తిట్టుకుంటున్నాను. ఎంత ఇబ్బంది అనిపించినా ఇంగెవ్వరికీ లిఫ్ట్ ఇవ్వకూడదు అనిపిస్తోంది.
బైకు వెంకటగిరి మలుపు తిరిగింది. జనాలెవరూ లేరు, లైటింగ్ కూడా అక్కడక్కడా వెలుగుతూ దారంతా మొబ్బుగా ఉంది. అతను మరింత దగ్గరవుతున్నాడు అనిపించి “ఏయ్” అన్నాను కసురుకుంటున్నట్టు. ఏమనుకున్నాడో ఏమో ఠక్కున చెయ్యి తీశాడు. క్రిష్ణానగర్ క్రాస్ రోడ్స్ రాగానే మోర్ దగ్గర దించేశాను నేను ఇటు పోతానని.
అతడు వేరే ఉద్దేశ్యంతో చెయ్యి వేశాడో లేదా నిజంగానే చలికి తట్టుకోలేక చెయ్యి వేశాడో తెలీదు గానీ ఆ సంఘటన తలుచుకోవాలంటే కూడా వెగటుగా ఉంటుంది.
రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు రెండు అరచేతులు ఫటా ఫటా కొట్టి ‘పది రూపాయలివ్వు బావా..’ అంటూ డబ్బులగిడే వాళ్లను చూసినా, ఈ మధ్య శివార్లలోని ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏదో బాకీ ఉన్నట్టు బండ్లు ఆపి డబ్బులు గుంజేవాళ్లను అదే వెగటు అభిప్రాయం.
అలాంటి వెగటును అతడు తన కళ్ళతో చూశాడు.
సమాజం చూడని లోతులు మనసుతో తడిమాడు.
వాళ్ల సంఘర్షణని తనదిగా భావించాడు.
ఆ సంఘర్షణనే తన అక్షరాల్లోకి తెచ్చాడు.
ఒకసారి సాయి వంశీ ఫేస్బుక్ లో షేర్ చేసిన ‘సిలమంతూరు రైలు గేటు కాడ కొర్జా’ కథ చదివినప్పుడు వాళ్ల కోణంలో భలే రాశాడు కదా అనిపించింది.
ఇదే రచయిత రాసిన ‘మునికాంతపల్లె కథల’ లోని దిగువ నెల్లూరు ప్రాంత యాస, సువర్ణముఖి నదీ పరీవాహకంలోని జీవనం గురించి జరిగిన చర్చ అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఈ ‘సన్ ఆఫ్ జోజప్ప’ తో అయోమయపు పిల్లోడి మానసిక సంఘర్షణ.
అందరిలో కొందరే వాళ్లను చూడగలరు
చూసిన కొందరిలో కొద్దిమందే ఆలోచించగలరు.
ఆ కొద్దిమందిలో ఒకరిద్దరే అక్షరాలుగా మార్చగలరు.
ఈ సువర్ణముఖి కాదు కాదు మొగిలేరు పక్కన చిగురుపాడు వాసి విజయ్ కుమార్ సంక్రాంతి అది చేశాడు, నిర్భీతిగా నిస్సంకోచంగా.
ఎదుటివారిని, జీవితాన్ని ఎప్పుడూ ఒకే దృష్టిలో చూడాలా, కొత్త కోణంలో చూడలేవా అనుకునేవారికి మరో కోణం పరిచయం చేసే నవల ఈ జోజప్ప.
కొత్త సాహిత్యాన్ని, టాలెంట్ ఉన్న రచయితలను వెతికి మరీ ప్రోత్సహించే Chaaya Books తరపుణ నూరవ పుస్తకంగా రావడం మరింత సంతోషం.
ప్రతులకు: