ప్రతి కథా ఒక ప్రశ్న…ఒక డిస్కషన్…. ఒక మెలకువ.

పతంజలి శాస్త్రి గారు ఒక లిటరరీ అడ్డిక్షన్. పోలిక సరికాదేమో గానీ, రేపు రిలీజయ్యే సినిమా కోసం ఇవ్వాళ సెకండ్ షో అయిపోయాక, టికెట్ల క్యూ లో నిద్రోయే లాంటి అడిక్షన్. కొత్త కథల పుస్తకం వస్తుందనగానే ఆత్రుత అందునా ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాని కథలు…దాంతో మరింత హైప్. ఉత్సుకత. శాస్త్రి గారు ఎప్పటిలానే పాఠకుణ్ణి ఎలాంటి నిరాశకీ గురి చేయలేదు. గురి తప్పనూ లేదు. కాస్త స్ట్రాంగ్ గా కూడా ఉంది.
ప్రతి కథా ఒక ప్రశ్న…ఒక డిస్కషన్…. ఒక మెలకువ.


అన్నీ చదివాకా ఇందులో బెస్ట్ ఏదో చెప్పుకో అనీ చిన్న చిలిపి కఠిన మైన ప్రశ్న….అవునూ…ఇందులోని కథల్లో ఏది గొప్పది కాదు…కష్టవే. మనకంటూ ఒక ప్రపంచం సృష్టించి అందులో పాత్రల్ని మన చుట్టూ వదిలేసి , కథకుడు ఎక్కడో నుంచుని నవ్వుకుంటూ పరిశీలిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి మేరీ…బావ పిచ్చెదవ తుల్సీ అంటూ వాపోతుంది…. పేరెరగని వాడి కోసం పిచ్చోడిలా మారిపోతాడు హెడ్డు… దీపాల పల్లె కబుర్లు నెమరేసుకుంటూ శాశ్వత నిద్రలోకి జారుకుంటాడు తాత…
అతడి చేతి వేళ్ళ స్పర్శ మనకి తగుల్తూ ఉంటుంది.


కుంపటి వెలిగించి భర్త మంచం కింద పెట్టీ, రామాలయం శుభ్రం చేయడానికి వెళ్లిపోతుంది కాసులు. ఆవిడ పాడే కీర్తనలు మనకి కథ అయిపోయాక (అసలయిపొద్దా !!!), కూడా ఇనబడతానే ఉంటాయి.
ఇక ప్రత్యేకం …ఇప్పటి కాలానికి అత్యవసరం …ప్రస్తుతం ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న యల్. జి. బీ. టీ…నీ తనదైన స్క్రీన్ప్లే తో….తనకి మాత్రమే సాధ్యమైన లిటరరీ కెమెరా టెక్నిక్ తో శాస్త్రి గారు రాసిన రెండు కథలు. ‘మనలాగే.’… 2+1=0… రెండు కథల్లోనూ ప్రధాన పాత్రలు ఇందిర, హేమ. మొదటి ది మొదటి కథ గానూ, రెండోది చివరి నుంచి రెండో కథ గానూ పలకరిస్తాయి(రు). కాదల్ ది కోర్…అన్న మలయాళం సినిమా మమ్ముట్టి నటించి , నిర్మించడం తో అందరి దృష్టి నీ ఆకర్షించింది. అంతా ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ సినిమా మీద చర్చ నడుస్తోంది. ఈ సినిమా కీ ఆ కధలకీ సంబంధం ఏమీ లేదు గానీ…యల్. జి. బీ. టీ రెండింట్లోనూ దండలో దారం.


దీపాల పల్లె పోవాలె… కథ సాహిత్యం లో ఒక శాశ్వత కథ. మాటల్లో చెప్పలేనంత గొప్ప తాత్వికత తో బాటూ, ఒక మెలకువ కలిగించే అపురూపమైన టెక్నిక్ తో చెప్ప బడిన గొప్ప కథ.
తనే రాసిన ఇంతకు ముందు కథల్లోని పాత్రలు, ఇంకా ముసిలాల్లై ఒక చోట కలుసుకుంటే….ఎంత బావుందో ఆ అనుభవం. చివర్లో రచయిత ఆ మాట తానే చెప్పక పోయినా, ఆయన పాఠకులందరికీ ఇట్టే గుర్తొచ్చే పాత్రలవి. కావాలంటే, దీని మీద ఎవరైనా పందెం కట్టచ్చు.


ఎప్పట్లానే…శాస్త్రి గారి పుస్తకం లో దిష్టి చుక్క లాంటి ఏదో ఒక అచ్చు తప్పు లాంటివి తప్పడం లేదు. ఇందులో ఇంకాస్త పెద్ద పెరబాటే జరిగి పోయింది. ప్రతి ఎడమ పేజీ లోనూ, మృత్యు భారం అనీ వేసేశారు. బహుశా పుస్తకానికి ముందనుకున్న టైటిల్ అనుకుంటా…(ముఖ చిత్రం కూడా ఆ పేరున్న కధదే..)
తర్వాత 2+1=0 అని మార్చినట్టున్నారు. ఈ అడావుడి లో ప్రింటింగ్ అప్పుడు మర్చినట్టున్నారు. ఇంత ప్రత్యేకం గా…ఇదెందుకు అంటే..కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి గ్రహీత కొత్త కథల పుస్తకం ఇది. ఎన్నో భాషల్లోకి అనువాదం జరిగే అవకాశం ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు, ఇలాంటి పొరబాటు…ఏదో చేదు మింగినట్టు ఉంటుంది …కదా… ని. రాబోయే రెండో ప్రింట్లో సరిచేసుకుంటారనినూ.
కుంపట్లో బొగ్గులేసి భర్త మంచం మీద పెడుతోంది కాసులు…(మంచం కింద… కదా)… శాస్త్రి గారి వాక్యం అచ్చు తప్పు అని ఎలా అనుకోడం…ఎందుకిలా రాసారబ్బా అనీ ఆగి మళ్ళి చదూకోడం…కానీ అచ్చు …తప్పే..టా.
ముందే చెప్పినట్టు శాస్త్రి గారి కథలు లిటరరీ అడిక్షన్.


అంతగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళకి ఇంకా ఏమేమి కావాలో, ఆయనకి బాగా తెల్సు. అందుకని, తర్వాతి కథల కోసం ఆశగా ఎదురు చూపు….

Review by Kanaka Sudhakar Lanka

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top