భిన్న పాత్రల్ని మన ముందుంచుతుంది ఈ నవల

అనేక నదులు ప్రవహించి సముద్రాన్ని చేరతాయి. సముద్రాన్ని చేరే చోటు దూరం నుంచి చూస్తే శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ సంగమం మధ్యకెళ్లి చూసినప్పుడే నది సాగరాన్ని చేరేప్పటి కోలాహలం కనిపిస్తుంది. ఈ కథ జరిగే ఉత్తర కన్నడ కడలితీరంలోని ఈ ప్రజల జీవితాల్లోకి వెళ్తేనే వాళ్ళ కథ కూడా మనకు అలానే అనిపిస్తుంది.

సాధారణంగా మనకి మనుషులపై మొదట్లో కలిగిన అభిప్రాయాలను మార్చుకోము, ఎందుకంటే ఆ అవకాశాలు మనకు చాలా అరుదుగా ఉంటాయి. మంచి అభిప్రాయాలు అయితే పర్లేదు, అదే ఒక వ్యక్తి పై చెడు అభిప్రాయం కలిగిందా ఇక అంతే! ఎందుకంటే నచ్చని వ్యక్తులతో మన ప్రయాణాలు ఎక్కువ దూరం ఉండవు కాబట్టి పూర్తిగా ఆ వ్యక్తి గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే మొదట్లో కలిగిన చెడు అభిప్రాయాలని మనం ఎక్కువగా కలిగి ఉంటాము.

ఈ మధ్యే వచ్చిన రవితేజ సినిమాలో… మామిడికాయ, మేకు, యాభై రూపాయల నోటు ఎలా కథను మలుపులు తిప్పుతుందో, ఈ నవలలో కూడా ఒక మామిడికాయ వలన రెండు కుటుంబాల మధ్య ఎలాంటి తగవులొచ్చాయో, కథ ఎలా మలుపులు తిరుగుతుందో తెలుస్తుంది.

నవల మొదట్లోనే అత్తా, కోడళ్ల గయ్యాళి తనంపై ఏర్పరచుకున్న అభిప్రాయం కథలో వాళ్ళతో చేసిన ప్రయాణం చివరికొచ్చేప్పటికీ మన అభిప్రాయాలు ఎంత పెలుసో మనకు తెలియజేస్తాయి. అత్త పండరి, కోడలు యమున భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు. వీళ్ళింటి ప్రక్కనే దేవరాయ – కావేరి ల కుటుంబం ఉంటుంది. దేవరాయ ఇంటికి పురందర, పండరి ఇంటికి మోహిని చదువుకోవడానికాని వస్తారు. వీళ్లిద్దరి వలన ఇరు కుటుంబాల మధ్య గొడవలు వస్తాయి… అలా మొదలైన కథ పురందర చుట్టూ తిరిగి , అతని కుటుంబం లోని ఒక్కోపాత్ర పరిచయం, వాటి స్వభావాలు , పరిస్థితుల ప్రభావం, వాళ్ళ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, స్నేహాలు, డబ్బు చూపించే ప్రభావము మనల్ని ఏకబిగిన చదివేట్టు చేస్తుంది.

కావేరి, కస్తూరి, గోదావరి, మాధురి నలుగురూ అక్క చెల్లెల్లు, వీళ్లకు మంజునాథ అనే తమ్ముడు. పురందర కస్తూరి ఆడపడుచు కొడుకు. తల్లిదండ్రి లేని పురంధరను కస్తూరి, కావేరి కుటుంబాలు పెంచి పెద్దచేసి, చదువు చెప్పించి ఒక బ్యాంకు ఉద్యోగంలో చేర్పిస్తారు. కస్తూరి, వాసుదేవలు తన కూతురైన రత్న కి పురంధరనిచ్చి వివాహం చేయాలని తలుస్తారు. మరోవైపు గోదావరి తన కూతురైన సునందని పురంధరకివ్వాలని మరో వైపు ప్రయత్నిస్తుంటుంది. చివరకు పురందర ఎటువైపు మొగ్గు చూపాడో, కథ ఎలాంటి మలుపులు తిరిగిందో, మామిడి పండు తెచ్చిన గొడవ చివరకు ఎలా ముగిసిందో ” ఒక వైపు సముద్రం” నవల చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది. ముక్యంగా రంగనాథ రామచంద్రరావు గారి అనువాదం చదివించేలా చేస్తుంది.

మనుషులు తీసుకునే నిర్ణయాలు, ఏర్పరచుకునే అభిప్రాయాలు అప్పటి పరిస్థితులు, సందర్భాలను బట్టి ఉంటాయి. అది కరెక్టో కాదో ఇతిమిద్దంగా చెప్పలేం. ఇక్కడ పురందర మేనమామ వాసుదేవ స్వార్ధం కరెక్ట్ అనిపించేలోగా పురందర నిర్ణయం కూడా సబబే అనిపిస్తుంది. పారిపోయి వచ్చిన తన స్నేహితుడు యశవంతను కలిసినప్పుడు “నేను సాధించింది ఏమిటి ” అని పురందర వేసుకున్న ప్రశ్న అతన్ని ఆలోచనలో పడేస్తుంది. పండరి వ్యక్తిత్వం నవల చివర్లోగాని మనకు అర్థంకాదు. ఏపనైనా పట్టుదలగా సాధించాలనుకునే గోదావరి, ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ సర్వోత్తమ, అతని కోలిగ్ వెంకటేష్ ఇలా మరిన్ని విభిన్న పాత్రల్ని మన ముందుంచుతుంది ఈ నవల.

Review by – హరి కుమార్ రెడ్డి వేలూరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top