0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

        Chaaya Books

        పదాల మధ్య పెద్ద ఊహనిండుకొని ఉంటుంది.

        కథలు, నవలలు రాసినంత మాత్రాన్నే ఒకరిని సృజనాత్మక రచయిత అనలేను. ఆ రచయిత రాతలోని పదాల మధ్య ఉన్న ఊహ ద్వారా మాత్రమే వారిని సృజనాత్మక రచయిత అనగలను. కేవలం పదాలు పదాలుగానే మిగిలిపోతే అంతకన్నా పేలవమైన రచన మరొకటి ఉండదని నేను తలుస్తాను.

        పతంజలి గారి కథలు చదివినప్పుడు ఆయన రాతలోని పదాల మధ్య పెద్ద ఊహ నిండుకొని ఉంటుంది.

        ఆయన రాసిన ఒక కథ చదివి పుస్తకం మూసేసి, ఇంకో కథను రాయగలిగినంత ఊహను ఆయన పదాలు మనకు అందిస్తాయి.

        ఇప్పుడెందుకిదంతా ప్రస్తావిస్తున్నానంటే పతంజలి గారి కొత్త కథల పుస్తకం గురించి చెప్పటానికి ఉపోద్ఘాతం అనమాట.

        పతంజలి గారి కొత్త పుస్తకం పేరు 2+1=0.

        ఇందులో 7 కథలు ఉన్నాయి.

        ఈ కథలు చదివినప్పుడు రచయిత ఏకకాలంలో పాతాకొత్తా మేలుకలయికగా కనిపిస్తారు.

        ఇందులోని మొదటి కథ “మనలాగా” ఆరోకథ “మృతుభారం” గమనించండి ఈ విషయం తెలుస్తుంది.

        ఈ రెండు కథల్లో వేరు వేరు శైలులు మనం చూడవచ్చు.

        “మనలాగా” కథ అనగానే ఒక విషయం చెప్పాలి.

        ఈ కథ గురించి మాట్లాడుతూ ఛాయ మోహన్ బాబు గారితో ఓ మాటన్నాను. “Lgbt ల గురించి ఇతరులు రాసినప్పుడు అవి ఆదర్శవంతంగా మాత్రమే చిత్రించబడతాయి. పతంజలి గారు ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదేమో” నని.

        అప్పుడు మోహన్ గారు ఒకమాట అన్నారు “ఈ వయసులో ఆయన అలాంటి కథ రాశారు అంటే ఎంత అబ్బురం కలిగించే విషయం” అని.

        అవును. ఈ విషయాన్ని నేను గమనించలేదు కానీ అది అక్షరాలా నిజం. ఇవన్నీ కేవలం ఆధునిక జీవితాలకు సంబంధించినవే కాదు. లైంగిక పరమైన విషయాలలో సమాజం చూపించే క్రూరత్వాన్ని గమనించినప్పుడు మనం వాటి గురించి ఆ వ్యక్తుల స్వేచ్చ గురించి మరింత మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది.

        హేమ, ఇందిరల ప్రేమ రొమాంటిజంగా కనిపించవచ్చు కానీ, అందులో వాళ్ళ సమాజ ధిక్కరింపు, ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉండటం కూడా గమనించవచ్చు.

        ఈ కథల్లో నాకు బాగా నచ్చిన రెండు కథలు “దీపాలపల్లెకు బోవాల”, “యువరానార్”.

        ఈ కథల్లో దీపాలపల్లెకు బోవాల చదువుతున్నప్పుడు అయితే అందులోని తాత మనమరాలి లాగా ఆ ఊరు గురించి గూగుల్ లో సెర్చ్ చేసినా. నిజంగానే ఆ ఊరు ఉందా లేదా అనే మీమాంస నన్ను వీడకుండా ఉంది.

        ఒకవేళ చెప్తే పతంజలి గారే చెప్పాలి.

        ఈ కథ చదవి మ్యాజిక్ రియలిజం అనుకోవచ్చు.

        కానీ ఊరు పూర్తిగా లేకుండా పోవడంలో ముసలాయన పెయిన్ కథ మొత్తం పరుచుకొని ఉంది. ఊరే లేని వాళ్ళు తలుచుకొని ఇంకెంత బాధ పడతారో. ఈ కథలోనిది మ్యాజిక్ రియలిజమే అని మీరు ఒప్పుకోగలిగితే నేల విడిచి సాము చేయని కథని కూడా అర్థం అవుతుంది.

        జానపదుల నమ్మకాల్లోంచి పుట్టుకొచ్చినట్టు ఈ కథలో జానపద వాసన ఉంది. ఆ వాసన నన్ను ముప్పిరిగొన్నది. అందుకే ఈ కథ నాకు మహా ప్రియమైనది కూడా.

        నేను ఇష్టపడే అత్యంత ఇష్టమైన కథల్లో గురజాడ గారి “మీ పేరేమిటి” కథ తర్వాత కథగా చేరుస్తాను.

        ఇంకో కథ యువరానర్. ప్రభుత్వం పై అసహనాన్ని ఉచ్చ రూపంలో తెలియజెప్పించిన ఒక ఉద్యోగి కథ ఇది.

        ఈ కథలో మేరీ, బాలరెడ్డి ఇద్దరి ప్రేమ ఎంత బాగుంతుందని.

        ఒక సందర్భంలో మేరీ “బావ పిచ్చెదవ తుల్సీ” అనే మాట నాకెంత ఇష్టమంటే ఏం చెప్పగలను. ఈ మాట దగ్గర ఆగిపోయి, మేరీ రూపురేఖలు, ఆమె మాటలో స్వరం ఎలా ఉంటాయా అని ఆలోచించాను.

        ఈ కథలో వస్తువు దాని తాలూకూ సమస్య పెద్దది. అందులో కూడా మేరీ ఉండటం ఈ కథకు మరింత ప్రత్యేకతను చేకూర్చింది. ఈ కథని రచయిత ఆ పాత్రల దగ్గర కూర్చొని రాసినట్టు ఉంటుంది.

        ఇంతసేపూ కథా, కథా అని నసుకుతున్నా గానీ అసలు నాకీ కథ నవలలానే అనిపించింది. నాకెక్కడా కథ చదివుతున్న భావన ఇందులో కలగలేదు. నవల చదువుతున్న భావనే ఇచ్చింది. ఇందులో కథా వస్తువు సూటిగా ఉన్నప్పటికీ, ఇందులో అనేక పార్ష్యాలు ఉన్నాయి. సరే నవల కాదు ఎప్పటికైనా అట్లిస్ట్ నవలికలా రాసినా నేను మహా సంతోషిస్తాను.

        కథ చివర్లో పూర్తయ్యాక రచయిత “ఏలేశ్వరం కుంభకోణం నెపం మాత్రమే” అన్నా. ఈ కథలో దానిని ఏ మాత్రం విడదీసి చూడలేం.

        ఈ కథ చదివినప్పుడు నాకు “థూ…” అనే కథ గుర్తుకు వచ్చింది. సునీల్ కుమార్ గారు రాసింది. మీకూ గుర్తుండే ఉంటుంది. చదివిన వాళ్ళు మర్చిపోయే కథా అది. ఈ కథ కూడా అచ్చంగా అలా మర్చిపోలేనిది.

        ఈ పుస్తకంలోని మిగతా కథల గురించి కూడా ప్రస్తావించాలి. కానీ మీరే చదివి ఆ అనుభవాన్ని పొందుతారని ఆగిపోతున్నాను. రచయిత సమానంగా పాఠకులకు కథ ద్వారా అందించే అనుభూతినో, అనుభవాన్నో నా విశ్లేషణలు, విడమరుపులు ద్వారా చెడగొట్టడం ఎందుకని పుస్తకాన్ని మీకు అందిస్తూ వైదొలుగుతున్న.

        Review by Goondla Venkatanarayana

        Search

        Latest Updates

        Scroll to Top

        SUBSCRIBE

        Chaaya - Subscription
        Scroll to Top