ఇలా కూడా రాయొచ్చా ? అయితే నేను కూడా రాయొచ్చు ! అనిపించిందట కాఫ్కా రాసిన మెటామార్ఫసిస్ చదివాక మార్క్వేజ్ కి. అప్పటికి మార్క్వేజ్ రచయిత కాలేదు.
దీన్నిబట్టి రచయిత కాదు అతని వర్క్ మాట్లాడాలి, పిచ్చెత్తించాలి, ఈడ్చుకుపోవాలి, అప్పటివరకు ఎరుగని లోవెలితిని చూపించి అశాంతితో మండించి బూడిద చెయ్యాలి. ఆ బూడిదలోంచి కొత్తజన్మ ఎత్తించాలి. ఇదంతా కళాకారుడు కాదు, అతని కళ చేయాలి.
నిజానికి తాను జీవితంలో అనుభవించిన ఘోరమైన దశల్నే మండే అక్షరాలుగా మలచినవాడు కాఫ్కా. అందుకే అతని వర్క్ కి మంటలా అంటుకొనే లక్షణం సహజంగానే అబ్బింది. అది మార్క్వేజ్ కి మాజిక్ రియలిజమనే మంత్రవిద్యని నేర్పింది. అలాగ మార్క్వేజ్ ‘వందేళ్ల ఏకాంతం’కి బీజం పడిన కారణాల్లో మెటామార్ఫసిస్ ప్రధానమైనది అయ్యింది.
ఇదంతా ఎందుకు జ్ఞాపకం చేసుకోవలసి వచ్చిందంటే నెమ్మి నీలం పేరిట తెలుగు చేయబడిన జయమోహన్ పన్నెండు కథల్లోని ఏ ఒక్క కథలోనూ రచయిత మనతో మాట్లాడడు. అతని వర్క్ మాట్లాడుతుంది. ఇది తెలుగు పాఠక లోకానికి తెలుగు కథల ద్వారా పెద్దగా దొరకని కొత్త అనుభవం.
నేను అతిశయం చెబుతున్నానా ? కాదు ధర్మం చెబుతున్నాను. ఈ తమిళ కథల పుస్తకానికి జయమోహన్ పెట్టిన తమిళ పేరు ‘అఱం’, అంటే ధర్మం అని అర్థం. మరి ధర్మం గురించి ధర్మంగా మాట్లాడమే కనీస ధర్మం కదా ?
మరింత ధర్మంగా ఈ చిన్న వ్యాసాన్ని ముగిస్తాను.
మనకు, అనగా తెలుగువాళ్లకి కథలంటే యాంత్రిక శృంగారం వంటిదై ఉంటే చాలని నా అభిప్రాయం. ఇందుకు “కాఫ్కా – మెటామార్ఫసిస్” అక్కర్లేదు. జయమోహన్ కథలోని ఓ పాత్ర పరిభాషలోనే చెప్పాలంటే నడుము కింద బుల్లకాయ ఉంటే చాలు. మనసుతో పనిలేదు, తొమ్మిది తూట్ల తోలుతిత్తి చాలు. అందుకేనేమో తొలినుంచి ఏ కొందరో తప్ప తెలుగు కథకులందరూ వీర్యవృద్ధి కంటూ నాటుమందులమ్మే మాయగాళ్ల లెక్కన తయారైనారు.
మీరు చదివిన నాలుగు నేరు తెలుగు కథలు వేటితోనైనా జయమోహన్ ఒకే ఒక కథను దేనినైనా పోల్చి చూడండి. అప్పుడు నన్ను మించిన ధర్మాన్ని మీరే మాట్లాడతారని ఊహించగలను.
మనిషిలోని పురుగుని చూపడం కాఫ్కా రాతల్లోని అంతఃసారం అయితే, పురుగుని సీతాకోకచిలుకలా మార్చడం జయమోహన్ కథల్లోని అంతఃసూత్రం.
గుర్తించం కానీ మన మాట, చేత, చూపు, నడత అన్నింటా మాజిక్ రియలిజమే ఉంటుంది. వాటన్నిటినీ సక్రమమైన దారికి మళ్లించే కాలిబాట సూచికలు జయమోహన్ కథలు.
ఆదిమ మానవుడ్ని కొత్త ప్రపంచాలకు చేర్చింది కాలిబాటలే కనుక ఈ కథలతో నడక మనతో మనల్నే కొత్తగా వెతికించే పని పెడుతుంది.
మన చేతికి మనం చిక్కడమే అన్నిటికంటే ‘పరమ ధర్మం’.