ఒక యుద్ధం ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావంతో సైనికులు వారి కుటుంబాలే కాదు.. సామాన్య ప్రజల జీవితాలు కూడా అతలాకుతలం అవుతాయి. ప్రతి జీవితానికీ ఒక మానవీయ కథ ఉండి తీరుతుంది.
మారుతి పౌరోహితం Maruthi Powrohitham విరచిత “ప్రణయ హంపి” కూడా యుద్ధం నేపథ్యంలో ఎన్నుకున్న ప్రేమ కథ.
పూర్తిగా చదివాక, ఇది ప్రేమ కావ్యమా లేక యుద్ధ కావ్యమా అంటే చెప్పడం కష్టం. విజయనగర సామ్రాజ్య పతనానికి దారి తీసిన రక్కసి తంగడి యుద్ధం అనేది చారిత్రక వాస్తవం. ఆ యుద్ధ భీభత్సం నుంచే ఒక లైన్ ఎంచుకుని మారుతి గారు ఒక రసరమ్యమైన ప్రేమకథను సాహితీ లోకానికి అందించారు.
ఒక వాస్తవ చరిత్ర ను అక్షర బద్దం చేసేటప్పుడు రచయిత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నో పరిశోధనలు చేయాలి. వాటిని పూసలుగా కూర్చి ఆసక్తి కరంగా పాఠకులకు అందించాలి.
రచయిత మారుతి ఈ విషయంలో సక్సెస్ అయ్యారా..?
విజయనగర కాలం నాటి సామాజిక నేపధ్యాన్ని, ఆచారాలను, వాడుక పదాలను సరళమైన గ్రాంధికంలో రాసి ఈ నవలను పాఠక రంజితం చేశారు.
… కథ గురించి చెప్పాల్సి వస్తే, చివరి విజయనగర ప్రభువు (పాలకుడు మాత్రమే ) అయిన అలియ రామరాయలు పై ఐదుగురు ముస్లిం చక్రవర్తులు ఏకమై దండయాత్ర చేస్తారు. రక్కసి తంగడి అనే గ్రామాల మధ్య యుద్ధం జరుగుతుంది. దాదాపు ఇదే సమయంలో సంబజ్ఞ గౌడ అనే యుద్ధ వీరుడు, ముద్దు కుప్పాయి అనే కళా కారిణి ల మధ్య నడిచిన ప్రేమ కథ ఇది.
రక్కసి తంగడి యుద్ధం ముగింపు ఏమిటి అన్నది చరిత్ర పాఠాలు చదివిన ప్రతి భారతీయుడికీ తెలుసు. అయితే ఆ యుద్ధ నేపథ్యంలో మారుతి సృష్టించిన ఈ ప్రేమ కథకు ముగింపు ఏమిటన్నది “ప్రణయ హంపి ” చదివే తెలుసుకోవాలి.
ఇది యుద్ధ కావ్యం అనేదాని కంటే ప్రేమ కావ్యం అనడమే సముచితం.
నా కాలేజీ రోజుల్లో నేను “విజయనగర పతనం” అనే చారిత్రక నవల చదివాను. ఆ నవల రచయిత ప్రసాద్ గారు అత్యంత ఉత్కంఠ భరితంగా పాఠకులను పరుగులు పెట్టించారు. అందరికి తెలిసిన ఒక వాస్తవ చరిత్రను నవలగా మలిచి పాఠకులను చివరి దాకా చదివించాలి అంటే మామూలు విషయం కాదు. ప్రసాద్ గారి రచనా చమత్కారమది.
మరి ” ప్రణయ హంపి ” విషయంలో మారుతి పౌరోహితం రచనా శైలి ఏ మేరకు ఆకట్టుకుంది..?
ప్రసాద్ గారి లాగా మారుతి గారు కేవలం కల్పనా చాతుర్యం పై ఆధార పడలేదు. ఆ కాలం నాటి అంతఃపుర రాణులు కావచ్చు.. వేశ్యలు కావచ్చు.. సైనికులు కావచ్చు.. వారి వారి ఆత్మలను మారుతి తన రచనలో సాక్షాత్కరింప జేశాడు.
రాణులకు అంతఃపుర వైభవం ఉన్నంత మాత్రాన వారు సుఖంగా ఉన్నట్టు కాదు.
పంజరంలో ఉన్న పక్షి బతుకే వారిది కూడా.
పట్ట మహిషి తో సహా రాణులు ఎవ్వరు సంతోషం గా ఎందుకు లేరు..! అని ఈ నవలా కథా నాయకుడు సంబజ్ఞ గౌడ ద్వారా మనల్ని ఆలోచింప జేస్తాడు.
విజయనగర కు యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో.. ” యుద్ధంలో ఓడిన వారు ఎంత నష్టపోతారో గెలిచిన వారు కూడా అంతే నష్ట పోతారు ” అంటూ ముద్దు కుప్పాయి నోట పలికిస్తాడు.
యుద్ధరంగంలో సైనికుల శారీరక అవసరాలు తీర్చే వేశ్యలు కూడా ఒక భాగం అని ఈ నవల ద్వారా తెలుస్తుంది. ఈ భీభత్స వాతావరణం లో వేశ్యలు పడే ఇక్కట్ల గురించి వర్ణించేటప్పుడు మారుతి గారు “వలంది” పాత్ర లో పరకాయ ప్రవేశం చేసాడు అనిపిస్తుంది.
” యుద్దాన్ని ఈ భూమి మీద నుంచి రద్దు చేయకపోతే, ఈ భూమి మీద నుంచి అదే మనల్ని రద్దు చేస్తుంది “
” యుద్ధరంగంలో మరణిస్తున్న సైనికుడి కళ్ళలోకి చూసిన ఏ రాజయినా మరోసారి యుద్ధ ప్రకటన చేస్తాడా..? “
“తన సైనిక వైభవం రక్తపు జల్లులతో ఏర్పడిన ఇంద్ర ధనస్సు వంటిది. దాని ఉనికి ఎవరిని సంతోషపెడుతుంది?”
ఇలాంటి వాక్యాలతో పాఠకుల మనసు చూరగొంటూ ఈ నవల సాగుతుంది.
బియ్యం రాగి గింజ.. కథ తో తరాతరాలుగా సమాజంలోని అంతరాల గురించి చెప్పడం బాగుంది.
రాజ్యానికి రక్షణ గా నిలవడం యోధుల తొలి కర్తవ్యం అని ముద్దు కుప్పాయి తన ప్రియుడైన సంబజ్ఞ గౌడ కు చెప్పడం ఉద్విగ్నంగా ఉంటుంది.
కథా నాయకుడు సంబజ్ఞ తో పాటు రచయిత పాఠకుడిని యుద్దరంగంలోకి తీసుకుని వెళ్తాడు..
ఆ దృశ్యాలను కళ్లకు కట్టిస్తాడు.
విజయనగర పతనం దృశ్యాలను, బాదితు లైన సామాన్య ప్రజల వెతలను రాసిన విధానం … అలాగే ఒక ఉపద్రవం మనుషులందరినీ సమానం చేస్తుంది అని రచయిత కడు హృద్యంగా చిత్రించాడు.
….. ఊరి మర్లు కథా సంపుటంతో తెలుగు పాఠకుల మర్లు విపరీతంగా చూరగొన్న మారుతి పౌరోహితం ఈ “ప్రణయ హంపి ” నవల తో మరోసారి తనదైన ముద్ర వేశాడు. ప్రతి పాఠకుడు కొని చదువ వలసిన నవల ఇది.
కాపీల కోసం ఛాయా పబ్లికేషన్స్ మోహన్ బాబు Mohan Babu గారికి 9848023384 కు వాట్సాప్ చేయగలరు