భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలలో త్రిపురా ఒకటి. బ్రిటిష్ కాలంలో అక్కడ స్వయంప్రతిపత్తి కలిగిన రాజరికం ఉండేది, దూరదృష్టి కలిగిన రాజవంశం, స్థానిక త్రిపురీయుల గౌరవాన్నీ, మన్ననలనూ పొందింది.
ఆధునీకరణను ప్రవేశపెట్టడానికై త్రిపురా పాలకులు, తొలుత విద్యాధికులైన పశ్చిమ ప్రాంతపు బెంగాలీలను ఆహ్వానించారు. వ్యవసాయక భూముల్ని సాగులోకి తేవడానికి తూర్పు బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్) వ్యవసాయదారులను, కూలీలను ప్రవేశపెట్టారు.
1947లో త్రిపురా ఆధునిక భారతదేశంలో విలీనం అయిపోయి తన చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను పోగొట్టుకోసాగింది. దేశవిభజన ఫలితంగా తూర్పు బెంగాలీయుల వలస వరదగా మారింది. కాలక్రమంలో బెంగాలీలను తమ నేలనూ, అవకాశాలనూ కొల్లగొట్టే ఆక్రమణదారులుగా త్రిపురా మూలవాసీలు భావించడం సర్వసాధారణం అయిపోయింది. నిజానికి అసమగ్ర అభివృద్ధి క్రమం ప్రాంతీయ అసమానతలకూ, విభేదాలకూ, రాజకీయ ఉద్రిక్తతలకూ దారితీయడం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగం.
1980లలో త్రిపురా మూలవాసుల బెంగాలీ ఆధిపత్య వ్యతిరేక ఉద్యమం, సాయుధ పోరాట రూపం దాల్చింది. ఆనాటి పరిణామాలను, సంక్షోభాన్ని వివిధ కోణాల నుండి ఉత్కంఠభరితంగా ప్రతిఫలించిన నవల ఇది.
రచయిత సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ నవలాకారుడు అయిన సమరేశ్ మజుందార్. స్థానికులకూ, స్థానికేతరులకూ మధ్య ఏర్పడ్డ విభేదాలు నేటికీ ఈశాన్య రాష్ట్రాలలో కొనసాగుతున్నవి. కొన్ని శక్తులు వాటికి కొత్తగా మతం రంగు అద్దుతూ, ఉద్రిక్తలను మరింత రెచ్చగొడుతున్న నేటి కాలంలో ఈ నవల నూతన ప్రాసంగికతను ఏర్పరచుకుంది.