కన్నడనాట కథకుడుగా, నవలాకారుడిగా, నాటక కర్తగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ప్రసిద్ధులైన డా. కృష్ణమూర్తి చందర్ గారు వ్రాసిన మినీ నవల ఈ కాంచన సీత.
దీనిని తెలుగులోకి అనువాదం చేసిన వారు సుప్రసిద్ధ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావు గారు. వీరు ఇప్పటివరకు కన్నడ నుండి తెలుగులోకి 19 నవలలు, 18 కథాసంకలనాలు, 5 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర అనువదించారు.
వీరు చేసిన సాహితీ కృషికిగాను ఇప్పటి వరకు వీరికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాలతోపాటు మరెన్నో సుప్రసిద్ధ సాహితీసంస్థల పురస్కారాలు అందున్నారు.
ఇదో అద్భుతమైన చిన్న నవల.
1940 ప్రాంతంలో కర్ణాటకలోని చామరాజనగర్ జమీందార్ గారి ప్రాంగణంలో ఓ ఉపాధ్యాయుని కుటుంబం నివాసముండేది. ఆ ఉపాధ్యానికున్న ముగ్గురు సంతానంలో వెంటసుబ్బారావనే బాలుడు పెద్దవాడు.
సుబ్బారావు ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు ఆ జమీందారు కూతురు కాంచన అతనికి సహధ్యాయి. ఒకరిని విడిచి ఒకరు వుండలేనంత స్నేహం వారిది. చదులోనూ ఇద్దరూ పోటాపోటీగా వుండేవారు. కొన్నాళ్ళకు సుబ్బారావు కుటుంబం చామరాజనగర్ నుండి మైసూర్ వెళ్ళిపోతుంది. ఆ సమయంలో “నేను ఎప్పుడైనా వచ్చి మళ్ళీ నిన్ను కలుసుకుంటాను” అంటూ సుబ్బారావు కాంచనకు మాట ఇచ్చి వెళ్ళిపోతాడు.
కానీ, కాలమనే సముద్రంలో జీవితమనే నావమీద వెనుదిరిగి చూసుకోలేనంతగా పయనం సాగించాల్సి వచ్చిన సుబ్బారావు చివరికి భార్యా పిల్లలతో అమెరికాలో స్థిరపడిపోతాడు.
సుబ్బారావుకి అరవైనాలుగేండ్ల వయసులో భార్య కాలంచేస్తుంది. కొడుకు, కూతురూ అమెరికాలోనే వేరు వేరు చోట్ల స్థిరపడిపోతే తను మాత్రం న్యూజెర్సీలో వుండిపోతాడు. అమెరికాలో యాభై ఏండ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం తను డెబ్భై రెండేండ్లవాడైపోయాడు. ఆ వయసులో, వంటరితనంతో మిగిలిపోయిన సుబ్బారావుని సహజంగానే బాల్యస్మృతులు, వాటిల్లో తను మళ్ళీ వచ్చి కలుస్తానని కాంచన కిచ్చిన మాట పదే పదే గుర్తుకొస్తుంటుంది.
“ఇన్నేళ్ళతరువాత కాంచన ఇప్పడెలావుందో? అసలుందో? లేదో? వుంటే ఎలావుందో? చామరాజనగర్ వెళ్ళి చూసిరావాల్సిందే” అనుకున్న సుబ్బారావును పిల్లలు “వయసురీత్యా ఇప్పుడు వంటరిగా ఇండియా వెళ్ళి చేసేదేముంది? వెళ్ళొద్దు” అంటారు. అయినా తను అనుకున్న ప్రకారం వెంటనే ఇండియా బయలుదేరుతాడు.
చామరాజునగర్ వెళ్ళే లోకల్ రైల్లో సుబ్బారావుకు సత్యా అనే అదే వూరి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది.
సుబ్బారావు కాంచన కోసం సాగిస్తున్న వెతుకులాటలో సత్యా కీలక భూమిక వహిస్తాడు.
ఆ వెతులాటలో సుబ్బారావుకి ఎదురైన అనుభవాలను, అతను తిరిగిన ప్రాంతాలను, కలుసుకున్న మనుషులను రచయిత గొప్పనేర్పుతో, పాఠకుల్లో ఉత్సూహకతరేకెత్తిస్తూ చెప్పుకొస్తారు.
చివరికి సుబ్బారావు కాంచనను కలుసుకున్నాడా? లేదా? అన్న ఉత్కంఠ ప్రశ్నకు సమాధానాన్ని పాఠకులు నవలను చదవడం ద్వారా తెలుసుకుంటేనే దాని రుచిని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు.