మన హృదయాలకు‘నెమ్మి నీలం’ అద్దుకుందాం!

మిళ రచయిత జయమోహన్ (జెయమోహన్ అనాలా?) పన్నెండు కథల సంపుటం ‘నెమ్మి నీలం’ చదవడం ఒక అపురూపమైన, ఉత్తేజకరమైన, ఆలోచనాస్ఫోరకమైన, ఏకకాలంలో విషాద బీభత్స హాస్య కరుణా స్పందనలు కలిగించగల అద్భుత అనుభవం. ఆ పఠన అనుభవం నుంచి, ఆ అనుభవం తర్వాత చెలరేగే ఆలోచనల సుడిగుండాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ కథాస్థలాల నుంచి, ఆ సన్నివేశాల నుంచి, ఆ పాత్రల నుంచి, ఆ సంభాషణల నుంచి, వాటి ప్రభావం నుంచి బైటపడడం చాల కష్టం.

కావడానికి అవి పన్నెండు కథలే గాని, రచయిత వాటన్నిటినీ ‘అఱం’ అనే ఏకసూత్రత కింద బంధించారు, లేదా ఆ ఏకైక విత్తనం నుంచి విస్తరించిన అనేకానేక శాఖోపశాఖల మహావృక్షాల ఛాయలుగా, వ్యక్తీకరణలుగా ప్రకటించారు. అందువల్లనే అవి రచయిత నిర్దేశించిన మౌలిక భావనకు కట్టుబడి ఉంటూనే ప్రపంచాన్నంతా చుట్టివస్తాయి. మానవతను తట్టి లేపుతాయి. భిన్నమైన, సుదూరమైన ఇతివృత్తాల నుంచి కూడా ఒకే రకమైన మానవీయ స్పందనలను ప్రేరేపించడం సాధ్యమని చూపుతాయి.

అఱం అనే తమిళ మాటకు ధర్మం అని ఒక అర్థం ఉంది గాని, ధర్మం అనే మాట ప్రధానంగా మతపరమైన అర్థాన్ని సంతరించుకుని, ధర్మార్థ కామ మోక్షాలలో ఒకటిగా, వర్ణ ధర్మంగా (“స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహ” అని కూడా భయపెట్టి మరీ!!) మారిపోయింది గనుక నావరకు నాకు ధర్మం అనే మాట కన్న, న్యాయం, న్యాయభావన, న్యాయాన్యాయ విచక్షణ, మంచి చెడుల విచక్షణ అనే అర్థంలో ఎక్కువ స్ఫురించింది.

పన్నెండు కథలూ పన్నెండు భిన్నమైన వస్తువులతో నాలుగు వందల పేజీల పైన సాగాయి. అంటే ఒక్కొక్కటి సగటున ముప్పై ఐదు పేజీల పైన. మనకు తెలిసిన ఇటీవలి చిన్న కథలను అధిగమించిన ఈ పెద్ద కథల విశాల ఆవరణ, పత్రికల పద పరిమితి లేని స్వేచ్ఛా విస్తరణ కథకుడికి ఎన్నెన్నో ప్రయోగాలు చేసే, ఆలోచనలనూ, వర్ణనలనూ, వాదనలనూ పేరుస్తూ పోయే అవకాశం ఇచ్చినట్టుంది. పైగా కథకుడికి ఏది చెప్పినా సవివరమైన దృశ్యం కట్టే కవితాత్మకమైన అద్భుతమైన రచనా శైలీ, చారిత్రక స్థలాల మార్గదర్శకులకుండే ఓపికా ఉన్నాయి గనుక ప్రతి కథా ఒక సవివరమైన, ఉద్వేగభరితమైన దృశ్య కావ్యంలా సాగిపోయింది.

పాత్రలూ రచయితా చెప్పే మాటల మీదా, చేసే పనుల మీదా ఆధారపడి పన్నెండు కథల గాలిపటాల మీద చదువరి పన్నెండు దిక్కుల విశాలాకాశంలో సంచరించే గొప్ప అవకాశాన్ని ఈ పుస్తకం ఇస్తుంది. అయితే ఆ పన్నెండు గాలి పటాలూ ఎటు పడితే అటు గాలివాటంగా కొట్టుకుపోయేవి కాదు. అన్ని గాలిపటాలకూ సూత్రమూ ఆధారమూ తమిళ-మలయాళ నేల మీద, ఆ సంస్కృతిలో, వారసత్వంలో స్థిరంగా నిలిచిన అపూర్వమైన కలం చేతిలో ఉన్నాయి. ఆ కలం వందల సంవత్సరాల స్థిరమైన సాంస్కృతిక పునాది మీద నిలబడి, కొత్త గాలులకు తలుపులు తెరుస్తున్నది. ఆ సంస్కృతిని గౌరవిస్తూనే అందులో విమర్శనీయమైన, పరిహరించవలసిన, అధిక్షేపించవలసిన అంశాలను పదునైన విమర్శకు గురి చేస్తున్నది. అందువల్లనే ఈ కథలు చదువరిని కల్లోల పరుస్తాయి. కొన్ని నిశ్చల నిశ్చితాలను ధ్వంసం చేస్తాయి. ఆ విధ్వంసం మీదనే ఒక ఉదాత్త, మానవీయ, తాత్విక ఆలోచనా సరళిని నిర్మిస్తాయి.

ఎన్నో కథల్లో తమిళ సమాజంలో జీవించిన, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసిన, ప్రముఖులైన వ్యక్తులు పాత్రలుగా వస్తారు. రెండు మూడు కథల్లో కథకుడు కూడా పాత్రగా ఉంటాడు. దాదాపు ప్రతి కథకూ ఒక చారిత్రక వాస్తవికతా మూలం ఉంది. ‘ధర్మం’లో తమిళ రచయిత టి జానకిరామన్, ‘ఒగ్గనివాడు’లో జాతీయోద్యమ నాయకుడు మార్షల్ నేసమణి, ‘తాటాకు శిలువ’లో మిషనరీ సామర్వెల్, ‘నెమ్మి నీలం’లో తమిళ రచయిత కి. రాజనారాయణన్, ‘పిచ్చిమాలోకం’లో పాత తరం స్వాతంత్ర్య సమరయోధుడు పూమేడై రామయ్య, ‘యాత్ర’లో రచయిత కోమల్ స్వామినాథన్, ‘ఎల్లలోకములు ఒక్కటై’లో ఆధ్యాత్మిక గురువు నిత్య చైతన్య యతి ఆ కథలకు లంగరుగా నిలిచి కథా గమనాన్ని నిర్దేశిస్తారు.

జయమోహన్ సాగించిన అసాధారణమైన కళాత్మక, కాల్పనిక సృజన ఒక నిర్దిష్టమైన వాస్తవిక పునాది మీద కావడం ఆ కథలకు విశ్వసనీయతను పెంచుతుంది. కథలో వాస్తవికత ఎక్కడ అంతమవుతుందో, కల్పన ఎక్కడ ప్రారంభమై వికసించిందో పోల్చుకోవడం తమిళ పాఠకులకు కొంతైనా సాధ్యమవుతుందేమో గాని, తెలుగు పాఠకులకైతే ఆ చారిత్రక వాస్తవికతతో పరిచయం లేదు గనుక ఏకకాలంలో అది ఒక నిగూఢ వాస్తవ చిత్రణగానూ, కళా సృజనగానూ అనిపిస్తుంది.

పన్నెండు కథల్లో ఒక్కొక్క కథ గురించీ వివరంగా విశ్లేషించి నా సంతోషాన్ని వ్యక్తం చేయాలనీ, ఇంత విశాల ప్రపంచాన్ని సృజించిన జయమోహన్ కూ, అద్భుతంగా తెలుగు పాఠకులకు అందించిన, అనువదించిన ఆవినేని భాస్కర్ కూ, ప్రచురించిన ఛాయ మోహన్ బాబు కూ నా హృదయపూర్వక ప్రశంసలు, కృతజ్ఞతలు తెలియజేయాలనీ బలంగా ఉంది గాని, మీ అంతట మీరే కథలు చదవాలని, మీ అభిప్రాయాలు ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను గనుక అన్ని కథల గురించీ రాయను.

పన్నెండు కథలూ వాటికవి ఎంచి చూపదగినవే, వివరించవలసినవే, విశ్లేషించవలసినవే. ఏ ఒక్కటీ మరొకదానికి తీసిపోదు. ఒకదానితో మరొకటి పోటీ పడుతుంది. అందులో ఒకటో, రెండో, మూడో ఎంచుకొమ్మంటే చాలా కష్టం. అయినా ‘ఏనుగు డాక్టర్’ గురించి మొట్టమొదట చెపుతాను. ఇది నలబై ఆరు పేజీలు విస్తరించిన, పొరలు పొరలుగా అనేక విషయాలు రంగరించుకున్న పెద్ద కథ. తమిళంలో విడిగా నవలికలా కూడా ప్రచురించినట్టున్నారు. జయమోహన్ అనే అద్భుతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క కథ చదివినా చాలుననిపించేంత, విస్తారమైన విశ్లేషణకు అవకాశం ఇచ్చే గొప్ప కథ ఇది.

సాహిత్య విమర్శలో మామూలుగా నవలలో పాత్రోన్మీలనం గురించి మాట్లాడుతుంటారు. కథ ఒక సూక్ష్మ అంశం ఇతివృత్తంగా సాగుతుంది గనుక అక్కడ నవలలో లాగ పాత్రోన్మీలనం సాధ్యం కాదేమో అని ఒక అభిప్రాయం ఉంది. కాని ఈ కథ ఆ అభిప్రాయాన్ని తోసిరాజంటుంది. నిజానికి ఈ కథలో కథ నడిచేది రెండే రెండు పాత్రల మీద. మరొక మూడు పాత్రలు కూడా ఉన్నాయి గాని వాటికి ఎక్కువ చోటూ లేదు, అంత ప్రాధాన్యతా లేదు. ఆ రెండు ప్రధాన పాత్రలలో ఒక పాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందో, ప్రవహిస్తుందో చెప్పే కథ ఇది. ఆ పాత్ర పరివర్తన ద్వారా మరొక పాత్ర సమగ్ర వ్యక్తిత్వాన్ని రూపుకట్టే అద్భుతమైన నిర్మాణం ఇది. కథానాయక పాత్రను మనకు పరిచయం చేసే క్రమంలో ఉత్తమ పురుష స్వరంలో కథ చెపుతున్న పాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి మారిందో, ఎంత పరివర్తనకు, ఉన్నతీకరణకు లోనయిందో, ఆ పరివర్తనను రచయిత ఎంత సూక్ష్మంగా, సరళంగా, సున్నితంగా వ్యక్తీకరించారో చూస్తే అబ్బురపాటు కలుగుతుంది.

ఇది నిజానికి డా. వైద్యనాథన్ కృష్ణమూర్తి (1929-2002) అనే తమిళ జంతు వైద్యుడి జీవితం పునాదిగా వచ్చిన కథ. ఆయన ముదుమలై తో సహా తమిళనాట అడవులలో వైద్యుడిగా పని చేసి, మరీ ముఖ్యంగా ఏనుగులకు వైద్యం చేసి, ఏనుగులను ప్రేమించి, ఏనుగుల సంరక్షణ కోసం ఎన్నెన్నో పనులు చేసి, ఏనుగుల శవపరీక్షా పద్ధతులు కనిపెట్టి ‘ఏనుగు డాక్టర్’గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ముందే చెప్పినట్టు జయమోహన్ కథల్లో తప్పనిసరిగా ఒక చారిత్రక వాస్తవికత పునాది ఉంటుంది. ఆ పునాది మీద ఆయన అపురూపమైన కళాత్మక, ఆలోచనాత్మక, తాత్విక, మానవీయ మహా భవనం నిర్మిస్తారు. ఈ కథలో కూడా డా. కృష్ణమూర్తి ఉదాత్తతలో, జంతుప్రేమలో, భూతదయలో, జంతు సంరక్షణా కృషిలో కొంత చారిత్రక వాస్తవికత ఉండవచ్చు. కథ లోనే వాచ్యంగా ఆ డాక్టర్ గురించి “ఒక సమకాలీన చారిత్రక పురుషుడు” అని చెపుతారు.

కాని ఆ ఆధారం మీద జయమోహన్ విస్తరించిన అంశాలు మానవ స్వభావానికీ, జంతువుల నుంచి విడిపోయి మనిషి అలవరచుకున్న కృత్రిమతకూ, మానవ సమాజం రూపొందించుకున్న అనవసర భేషజాలకూ, మనిషి సృష్టించుకున్న అధికారపు వికృతత్వానికీ, అడవి ఘనతకూ, నైసర్గికత్వానికీ, అడవుల్లోకి విహారానికి వచ్చి మనిషి ప్రదర్శించే అనాగరిక అహంకారానికీ, గాంధీవాద ఆదర్శాలకూ, అటువంటి మరెన్నో విషయాలకూ సంబంధించినవి. లోతైనవి, విశాలమైనవి. ఈ కథ చదివినవారెవరైనా చదవక ముందువరకూ తాము నమ్ముతున్న విషయాలను మార్చుకోకపోతే, కనీసం వాటి గురించి పునరాలోచనలో పడకపోతే వారి హృదయం ఉండవలసిన చోటనే ఉన్నదా అనుమానించాలి.

ఇక్కడ కథ చెపుతున్న ఫారెస్ట్ ఆఫీసర్ మొట్టమొదటిసారి డాక్టర్ ను చూసినప్పుడు, ఆ డాక్టర్, చనిపోయి, కుళ్లిపోయిన ఏనుగు శవాన్ని పరీక్షిస్తూ, లోపలి నుంచి పురుగుల ముద్దను చేత్తో తీస్తున్నప్పుడు కలిగిన వెగటు, వాంతి, జుగుప్స, అసహ్యం, పీడకలలు కథ ప్రారంభంలో ఉంటాయి. అదే ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ తో సంభాషణల వల్ల, డాక్టర్ ఆచరణను దగ్గరి నుంచి చూసినందువల్ల, పురుగుల గురించీ, జీవజాతుల సమతుల్యత గురించీ ఆ డాక్టర్ చెప్పిన వివరణలు విన్నందువల్ల పురుగును తన వేలి మీదికి ఎక్కించుకోగలిగే పరిణమిస్తాడు, ప్రవహిస్తాడు. “ఎందుకింత జుగుప్స? నా ఒంటిలో ఉన్నదీ అదే రసి, మాంసమే కదా? శ్లేష్మాలు, ద్రవాలు, మలం, మూత్రం… నేనూ అంతే కదా” అనే తాత్విక స్థాయికి చేరుతాడు.

జంతుజాలం పట్ల, ముఖ్యంగా ఏనుగుల పట్ల ఇంత శ్రద్ధగా పనిచేస్తున్న డాక్టర్ కు బైటి సమాజంలో గుర్తింపు తేవడానికి, పద్మశ్రీ ఇప్పించడానికి మొదట కేంద్ర ప్రభుత్వంతో పైరవీ కూడా చేసిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్, చివరికి ఆ గుర్తింపు ఎంత చౌకబారు వ్యవహారమో అటు నుంచి తెలుసుకోగలుగుతాడు. అంతమాత్రమే కాదు, ఇటు నుంచి అసలు అటువంటి గుర్తింపునే గుర్తించని డాక్టర్ భావాలను గ్రహించలేని స్థితిలో ప్రారంభమై, చివరికి ఆ డాక్టర్ చేసిన సేవలకు ఏనుగులు మందగా తెలిపిన కృతజ్ఞతలు చూసి చలించి, నిజమైన గౌరవమూ గుర్తింపూ ఎక్కడ ఉన్నాయో గుర్తిస్తాడు. అలా ఈ పాత్ర ఆలోచనల్లో పరివర్తన ద్వారా, డాక్టర్ సంభాషణల ద్వారా కూడా డాక్టర్ విశ్వరూపాన్ని జయమోహన్ అపురూపంగా స్థాపించారు.

“నిజానికి మనిషే అన్నిటికన్నా బలహీనమైన జంతువు. రోగాన్ని, నొప్పిని భరించడంలో జంతువులు చూపించే ఓర్పుని, గాంభీర్యాన్ని చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ప్రాణం పోయేంత నొప్పి ఉన్నా ఏనుగు ఏడవదు. అల్లాడిపోదు. కళ్లు మాత్రం సగం మూసుకుని ఉంటుంది… అవన్నీ జీవితంలో జరిగే సహజమైన సంఘటనలేనని వాటికి తెలుసు. మనిషే గోల చేసేస్తాడు. మందు ఎక్కడ, మాత్ర ఎక్కడ అని గగ్గోలు పెట్టేస్తాడు. చేతికి దొరికినదాన్ని తినేసి మరో రోగాన్ని తెచ్చుకుంటాడు” అని డాక్టర్ చేత అనిపించిన జీవితసత్యాలు, నిజంగా డాక్టర్ కృష్ణమూర్తి ఎప్పుడైనా అన్నారో లేరో తెలియదు గాని ఆ తాత్విక దృష్టి కచ్చితంగా జయమోహన్ దే.

చారిత్రక వ్యక్తుల, సందర్భాల మౌలిక అనుభవాల వాస్తవికత నుంచి జయమోహన్ ఎంత తీసుకున్నారో, దాన్ని తన ఊహాశక్తితో, కాల్పనిక కళానైపుణ్యంతో, జీవితానుభవంతో, తాత్విక దృక్పథంతో ఎట్లా తీర్చిదిద్దారో బహుశా తమిళ పాఠకులు ఎక్కువగా గుర్తించగలరు. అందువల్ల వాళ్లకు వాస్తవంతో పోలికకూ, తారతమ్య పరిశీలనకూ అవకాశం కూడా వస్తుందేమో. కాని ఆ తమిళ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవిత వాస్తవికత గురించి ఎక్కువ సమాచారం లేని మనవంటి అనువాద పాఠకులకు అటువంటి సంబంధం లేదు. ఆ పాత్రలకు వాస్తవికతా మూలాలు ఉన్నా లేకపోయినా మనకు అవన్నీ కాల్పనిక పాత్రలే. మనకు తెలిసేది రచయిత ఊహాశక్తి, కళానైపుణ్యం, జీవితానుభవ సారం, తాత్విక దృక్పథం మాత్రమే. ఆ కాల్పనిక పాత్రల ద్వారా, ఆ పాత్రల మధ్య సంబంధాల ద్వారా, ఆ పాత్రల సంభాషణల ద్వారా జయమోహన్ మనలో అనంతమైన ఆలోచనా స్రవంతిని ప్రేరేపిస్తారు. మన ఆలోచనలను, అవగాహనలను, విలువలను ఉన్నతీకరిస్తారని నావరకు నాకు అనిపించింది. ఈ పన్నెండు కథల్లో ప్రతి కథా ఆ పని చేస్తుంది గాని, ‘ఏనుగు డాక్టర్’ తో పాటు ప్రత్యేకంగా ‘వంద కుర్చీలు’, ‘కూటి రుణం’, ‘తాటాకు శిలువ’, ‘పిచ్చిమాలోకం’, ‘ఎల్లలోకములు ఒక్కటై’ చదవాలని మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇప్పటికే పెద్దదై పోయిందని ఇక్కడ ఆపుతున్నాను గాని ప్రతి కథ మీదా ఇలాగే రాయాలని ఉంది. అలాగే జయమోహన్ వివరణలు, వర్ణనలు, వాదనలు, వాక్య విన్యాసాలు (బంగారానికి తావి అబ్బినట్టు, ఆ మూల రచనకు అవినేని భాస్కర్ సమర్థమైన అనువాదాలు) ఎన్నిటినో నేను నా హృదయానికి హత్తుకున్నాను. ఇప్పుడు నా హృదయం తెరిచిచూస్తే అది నెమ్మి నీలం అద్దుకునే ఉంటుంది. ఎన్నెన్నో పంక్తుల కింద పెన్సిల్ గీతలతో నా పుస్తకం నిండిపోయింది. అవన్నీ కూడా మీకు పరిచయం చేయాలని ఉంది గాని, మీరే చదవండి. మీకై మీరే ఆ అపురూప రచనను మీలోకి నింపుకొండి. మీ హృదయంలో కూడా నెమ్మి నీలం ఒంపుకొండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top