కొన్ని చీకట్లూ… ఓ వెలుతురూ…
పేరు తగినట్లే వెలుగూ చీకట్ల కథలివి. చీకటిని చీల్చి ప్రభాతం వెలుగొందుతుందని చెప్పిన కథలివి. ప్రగతి మహిళగానూ, ఉపాధ్యాయురాలిగానూ తన చుట్టూ చూసిన మనుషుల్ని కథలు చేసింది. పిల్లలు బడికి రావడం లేదని ఒక్కోసారి తీసుకునే అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం వలన ‘తిరుపాలమ్మ’ లాంటి విద్యార్థుల జీవితాలు ఏ మలుపు తీసుకుంటాయో! ఆ నిర్ణయం తీసుకునే పొజిషన్లో ఉండేవారే చెప్పగలరు. “రైటింగ్ కౌచ్” రచనారంగంలో ఉన్నవారూ, కొత్తగా రాస్తున్నవారు తప్పక చదవాల్సిన కథ.
శానిటరీ నాప్కిన్ అంటూ ఒకటుంటుందని తెలియని పిల్లలకు దాని గురించే చెప్పే “థాంక్యూ టీచర్”, మహిళా రైతు జీవితాన్ని చెప్పిన “నేనూ రైతునే” గాని, బురఖా తొడుక్కుంటే గాని బడికి పోలేని కుటుంబ నేపథ్యాన్ని చర్చించిన “ముస్కురాహట్” గాని ఆవలి వైపు కోణాన్ని చెప్పిన కథలు.
పరువు అనే ఓ అమూర్త భావన చుట్టూతా వేలాడుతూ మనుషుల ప్రాణాలు తీస్తున్న చీకటి కాలంలో నిజంగా వెలుతురూ “కొన్ని చీకట్లూ… ఓ వెలుతురూ…” ఈ కథ చదివితే పరువు కన్నా బిడ్డల ప్రాణాలు ముఖ్యం, వాళ్ళ సంతోషం ముఖ్యం అని కొందరు మారినా లోకం బావుంటుంది. అందరూ వెంకట్రామయ్యాలా ఒక్కరైనా అంతా retrospect చేస్కొని బిడ్డ సంతోషమే ముఖ్యం అనుకుంటే ఎంత బావుంటుంది.
ఇందులో మెజారిటి కథలు కౌమార దశ అమ్మాయిల జీవితాల చుట్టూ తిరిగిన కథలు. ప్రతి తల్లిదండ్రి చదవాల్సిన కథలు.