మీకు థ్రిల్లర్లంటే ఇష్టమైతేహాయిగా కొని చదివెయ్యండి

ఫిబ్రవరి 21, రాత్రి 8.05 నిమిషాలు, ప్రదేశం తాడేపల్లిగూడెం మినీ బైపాస్ మీద ఆగిన ఎక్స్‌ప్రెస్ బస్సులో మొదటి సీటు.

ఐదు నిమిషాలు టిక్కెట్టు కొని చిల్లర పుచ్చుకోవడానికి, మూడు నిమిషాలు సామాన్లు సర్దుకోవడానికి, ఏడు నిమిషాలు చట్నీ నంచుకుంటూ మూడున్నర ఇడ్లీలు (సగం కింద పడిపోవడం వల్ల) తినడానికి ఖర్చయిపోయాయి, వాట్సాప్‌ మేసేజ్‌లకు జవాబులివ్వడానికి, ఫోన్లు చేయడానికి మరో ఐదు నిమిషాలు.

దానితో సమయం 8.25 నిమిషాలు కావచ్చింది. అప్పుడు, బ్యాగులోంచి సూదంటురాయిలా లాగే రంగులు, బొమ్మలు, ఆసక్తికరమైన పొడుపుకథలాంటి పేరుతో ఉన్న పుస్తకం బయటకి తీసి చదవడం మొదలుపెట్టాను. అంతటితో కొద్ది దూరంలో ఉన్న డ్రైవరూ, వెనుకా ముందూ ఉన్న జనమూ, బయట చకచకా వెనక్కెళ్తున్న ఊళ్ళూ, పక్కనే వస్తున్న కాలవా, అన్నీ మాయమైపోయాయి. కళ్ళకు కూడా అందని వేగంతో దడదడలాడుతూ వెళ్ళిపోయే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరి ఆ పుస్తకం చకచకమంటూ నడిచిపోతోంది. కాయితం వెనుక కాయితం, అధ్యాయం వెనుక అధ్యాయం – టకటకా తిరిగిపోతున్నాయి.

*** సమాప్తం *** అన్న ముక్క చదివి పుస్తకాన్ని మూసి పక్కన పెట్టాకా కాస్సేపటికి ఆ ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి మెల్లిగా వస్తున్నాను. బయటకు చూస్తే గన్నవరం పొలిమేరల్లో ఏదో ఫంక్షన్‌ హాల్ దగ్గరకొచ్చింది బస్సు. సమయం – అదే ఫిబ్రవరి 21, రాత్రి 10.08 నిమిషాలు.

అంటే – 109 పేజీల పుస్తకం నన్ను తన వెంట ఈడ్చుకెళ్ళిపోతూ గంటా నలభై అయిదు నిమిషాల్లోపల ఒక్కసారి కూడా కింద పెట్టనివ్వకుండా చదివించేసింది.

ఇంతకీ పుస్తకం పేరు పుస్తకం పేరు – జీరో నెంబర్-1

**********

కొందరు క్లాస్‌మేట్సూ, ఇతర బంధుమిత్రులూ నన్ను అడపాదడపా మంచి పుస్తకాలేమైనా సూచించమని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా పుస్తకాలు చదివే అలవాటు లేనివారు, ఆ అలవాటు చేసుకునే ప్రయత్నంలో పడ్డప్పుడు ఇలా నా సాయం అడుగుతారు. అప్పుడు వాళ్ళలో చాలామంది పెట్టే క్లాజ్ ఏమిటంటే – “మరీ పెద్ద పెద్ద సాహిత్యాలు వద్దురా” అని. కారణం కూడా అర్థం చేసుకోదగ్గదే. మరీ సీరియస్ పుస్తకాలతోనో, పెద్ద పెద్ద సుదీర్ఘమైన రచనలతోనో పుస్తక పఠనం అలవాటు మొదలుపెట్టడం కరెక్టు కాదు. మనలో చాలామంది పాఠకులు కూడా మొదట్లో చందమామో, స్వాతో, ఈనాడో, యండమోరీ, యద్దనపూడి వంటివాళ్ళ నవలలో పట్టుకునే మొదలుపెట్టి ఉంటాం కదా. వాళ్ళూ అలానే కాస్త చదివించే ఆసక్తి ఉండి, లైట్‌ రీడింగ్‌కి పనికొచ్చే పుస్తకాలు చెప్పమంటారు. నాకు తోచిన లైట్ రీడింగ్ పుస్తకాల జాబితాని వాళ్ళ ఇష్టాలు అంచనా వేసుకుని సూచిస్తూ ఉంటాను.

ఈ లైట్ రీడింగ్‌కి పనికొచ్చే పుస్తకాలు దాదాపుగా హిట్ సినిమాల్లాగా నడవాలని నా లెక్క. కథలు అయితే వేరే కానీ ఒకవేళ నవల అయితే దానికి కొన్ని లక్షణాలు ఉండాలని నాకు తోస్తుంది. మొదట్లోనే మనల్ని పాత్రలతో ముడివేయించెయ్యాలి. వాళ్ళకి హై స్టేక్స్ ఉన్న, పోల్చుకోదగ్గ, పాఠకుల మనసుకు హత్తుకోదగ్గ సమస్యలు ఉండాలి. ఆకర్షణీయమైన పాత్రలుండాలి. చకచకా కథనం సాగాలి. ఈ కథ, కథనాల నుంచి మరీ గంభీరమైన తాత్త్విక సమస్యలకో, పాఠకులు అర్థం చేసుకోలేని విషయాల్లోకో తీసుకుపోయి అక్కడే కాసేపు వదిలేసే టైపులో ఉండకూడదు. వీలైతే, థ్రిల్ కానీ, హాస్యాన్ని కానీ, శృంగారాన్ని కానీ, వీటిని జమిలిగా కానీ ఇవ్వాలి. వీలైతే, జీవితంలోని ఏవో కొన్ని పార్శ్యాలను కొత్త కోణంలో చూపించవచ్చు. వీలైతేనే సుమా. అన్నిటికన్నా ముఖ్యంగా, చేతిలో ఉన్న పుస్తకాన్ని కిందపెట్టనివ్వకూడదు. యండమూరి, యద్దనపూడి, మల్లాది వంటివారి నవలలు ఇలానే కదా ఉండేవి.

ఇక సాహిత్య సర్కిల్లో గౌరవాన్ని సంపాయించుకునే పుస్తకాలు వేరేగా ఉంటాయి కదా. వాటిలో జీవితానికి సంబంధించిన లోతైన చర్చలో, సమాజం సాగుతున్న తీరుపై తమదైన కథనమో – ఇలాంటివి ప్రధానంగా ఉంటాయని స్థూలంగా అనుకోవచ్చు. స్పష్టంగా ఇవేనని చెప్పలేను కానీ ఏదైనా ఒక సామాజిక-చారిత్రకాంశాల పట్ల విస్పష్టమైన అవగాహననో, ఒక లోదృష్టినో, లోతైన ఆలోచననో, ఒక కొత్త దృక్పథాన్నో మనకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూంటాయని అనుకోవచ్చేమో. సంక్లిష్టత, పొరలుపొరలుగా ఉండడం, వేర్వేరు వయసుల్లో-వేర్వేరు పరిస్థితుల్లో చదివితే వేర్వేరు సంగతులు స్ఫురించడం వంటి లక్షణాలు ఉంటాయని అనుకోవచ్చు.

ఈ సుదీర్ఘ సుత్తి అంతటినీ మీకెందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటే – రచయిత గౌస్ ఈ నవలా రచనలో ఒకేసారి ఈ రెండు పడవల మీదా కాళ్ళేసి రెండూ రెండు దిక్కుల్లో కొట్టుకుపోనివ్వకుండా సవ్యసాచిలా రెండు చేతులతో తెడ్డేసి, ఆ సవ్యసాచికి తాతలాగా అదే సమయంలో ఎదురొచ్చే గాలులకు ఎగిరిపోకుండా వాటం చూసి నడిపి ఒడ్డుకు చేరుకుని మొనగాడనిపించుకున్నాడు. ఈ పుస్తకాన్ని “ఉట్టి పాపులర్ నవల” అనుకుని చదివితే మతిపోగొట్టే వేగంతో, ఆకట్టుకునే కథనంతో, అడుగడుగునా థ్రిల్‌తో శుబ్భరంగా “ఎహె! ఇరగదీశాడ్రా ఈడెవడో” అనిపించేలా నిక్షేపంగా పూర్తైపోతుంది. కాదు కాదు “సాహిత్య విలువలు వెతుకుదామని” బయలుదేరితే సామాజిక గమనాన్ని పట్టిచ్చే నేపథ్యాలూ, పెన్న ఒడ్డు కతలన్నిటినీ చాకచక్యంగా పొదువుకున్న సామాజిక చారిత్రక స్పర్శ కలిగి రక్తమాంసాలున్న పాత్రలను తయారుచేసి వాటితో నేల విడిచాడో విడవలేదో తెలియకుండా సాము చేయించేశాడు.

**********

కాబట్టి, చెప్పొచ్చేదేమిటంటే – ఇదేమీ మామూలు ఫీటు కాదు. దీని ఘాటూ, స్వీటూ స్వయంగా ఆస్వాదించాల్సినవి. ముఖ్యంగా మీకు థ్రిల్లర్లంటే ఇష్టమైతే హాయిగా కొని చదివెయ్యండి. నచ్చితే, పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుందని వాపోయే నేస్తాలకి బహుమతిగా ఇవ్వండి.

బైదవే – ఇదే చివరాఖరి ముక్క. ఇది చెప్పి ఆపేస్తా.

కవర్ పేజీ చూసి, పుస్తకం తెరవమన్నారు. ఉన్నమాట చెప్తున్నాను – ఈ పుస్తకం నేను ఎందుకు కొన్నానంటే – ఆ కవర్ పేజీ మీదున్న డిజైన్ చూస్తే ఎక్కడో బుర్రలో లైటు వెలిగింది. ఇదేదో బావుండే పుస్తకంలా ఉందే అని. ఆ పేరు “జీరో నెంబర్.1”, ఆ ఫాంటూ – ఇవన్నీ చదవాలన్న కాంక్షని బాగా ఎగదోశాయి. కాబట్టి, నేను కొని చదవడానికి సాయంచేసిన Arunank Latha (బుక్ & కవర్ డిజైన్), చరణ్ పరిమి (కవర్ పెయింటింగ్) గార్లకు బోల్డన్ని థాంక్సులు.

1 thought on “మీకు థ్రిల్లర్లంటే ఇష్టమైతేహాయిగా కొని చదివెయ్యండి”

  1. hari venkata ramana

    పుస్తకం సంగతి సరే కానీ, రివ్యూ ప్రారంభం చాలా బాగుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top