సన్ ఆఫ్ జోజప్ప: నవలిక: సోలోమోన్ విజయ కుమార్ : ఛాయ ప్రచురణ:
సెప్టెంబరు 6, 2018న దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమన్నది, న్యాయ చరిత్రలో ఒక మైలురాయి. సమలైంగితను ఇష్టపడే వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు. ఏ నేరం చేయకపోయినా
సమలైంగికతను కోరుకునే వారు సమాజంలో ఇక నేరస్థులు కారని చెప్పిన రోజు.
సమలైంగిక సంబంధాల వలన పునరుత్పత్తి జరుగదు కనుక అది ప్రకృతి విరుద్ధమని ముద్ర వేయబడింది కానీ అనాది కాలం నుంచి ఈ సమలైంగిక సంబంధాలు ఉన్నాయనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సమలైంగిక సంబంధాలను అసహ్యించుకునే వారికి అది అసహజమైనది, జుగుప్సాకరమైనదీ కావొచ్చు కానీ ఆ ఇష్టం కలిగేవారికి అది వారిలో సహజంగా కలిగినదే. ఆ లైంగిక ప్రవృత్తి మానసిక రోగమేమీ కాదని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. ఆ లైంగిక ప్రవృత్తి ఉన్నవారు ఆ విషయంలో తప్ప ఏ ఇతర విషయాలలోనూ అసంబద్ధంగానూ, అసహజంగానూ, అసామాజికంగానూ ప్రవర్తించిన లేదా ప్రవర్తిస్తున్న దాఖలాలు లేవు. ఎన్నో రంగాలలో ఉద్ధండులలో సైతం కొందరు సమలైంగిక ప్రవృతి ఉన్నవారే. కొంచం కష్టపడి గూగులించండి. మీకు తెలిసిపోతుంది. అంతమాత్రాన సమలైంగికత్వాన్ని సమర్ధించాలా అని ప్రశ్నిస్తే, జవాబు ఏమిటంటే మనం అసహ్యించుకున్నంత మాత్రాన ఆ ప్రవృత్తి సమూలంగా సమసిపోయేది కాదు. ఆ ప్రవృత్తి ఉన్నవారు నేరస్థులూ కాదు గనుక వారిని అర్థం చేసుకుని సాటి మనుషుల్లా గౌరవించటమే మన కర్తవ్యం. ఆ లైంగిక ప్రవృత్తి ఉన్న వారి గురించి మాత్రమే కాదు LGBT community లో ఉన్నవారందరినీ సాటి మనుషులుగా గుర్తించి ప్రవర్తించిటమే పరిష్కారం. ముఖ్యంగా హిజ్రాలు లేదా కొజ్జాలు పడుపు వృత్తిలోనూ, అడుక్కునే వృత్తిలోనూ ఉంటూ జీవించడానికి అతి ప్రధాన కారణం అన్ని రంగాల నుంచి వారి సామాజిక బహిష్కరణే.
LGBT community పట్ల సామాన్య ప్రజానీకంలో అపోహలను, దురభిప్రాయాలను, వారు సమాజంలో చీడపురుగులన్న భావనను పోగొట్టే ప్రనిలో సాహిత్యం గొప్ప పాత్ర పోషించగలదు. కానీ విచారించ వలసిన విషయం ఏమిటంటే తెలుగులో ఆ విషయాలపై ప్రముఖంగా రాసే రచయిత బహుశా ఒక్కరే వారే ఈ పుస్తక రచయిత సోలోమోన్ విజయ కుమార్. మిగిలిన వారందరూ ఎప్పుడో ఒకటో అరో కథ రాసిన వారే.
సమలైంగిక ప్రవృత్తి ఉన్నవారి పట్ల కనువిప్పు కలిగించే గొప్ప నవల కన్నడ రచయిత రాసిన “మోహనస్వామి”.
తెలుగులోకి కూడా ఈ నవల అనువదించబడింది. విజయ కుమార్ తన “మునికాంత పల్లె కథలు” సంపుటిలోనూ, కొజ్జా గురించి “సిలమంతకూరు రైల్వే గేటు దగ్గర ఓ కొజ్జా” అనే కథనూ రాసారు. ఇప్పుడు ఈ నవలిక “సన్ ఆఫ్ జోజప్ప”.
ఈ నవలిక గురించి నేనేం చెప్పలేను. ఎందుకంటే చదువుతుండగా రెండుమూడు సార్లు కన్నీరొలికింది. చదవగానే కళ్ళలో కన్నీరు తిరిగితే సాహిత్యం గొప్పదా? అని ప్రశ్నించే వారికి, అవుననే అంటాను. దమ్ముంటే “సన్ ఆఫ్ జోజప్ప” లాంటి నవలిక కాదు కనీసం “సిలమంతకూరు రైల్వే గేటు దగ్గర ఓ కొజ్జా” వంటి కథ రాసి చూపీండి అంటాను. ఆ కథ చదివి ఎంతో కాలం అయ్యింది. ఇంకా వెంటాడుతోంది. ఈ నవలికలో రెండు పాత్రలు సన్ ఆఫ్ జోజప్ప ఉర్ఫ్ సన్ ఆఫ్ బాబు ఉర్ఫ్ పిల్లోడు, లింగ పాత్రలను మరిచిపోలేను. ఆ కథ, ఈ నవలిక చదివి చూడండి మీరూ మరిచిపోలేరు.
ఈ నవలిక వెనుక అట్టలో అరుణాంక్ లత గారు అన్నట్లు
“ఇటీవలి కాలంలో తెలుగులోనూ sexuality కి సంబంధించిన చర్చ ప్రధాన స్రవంతిలో చాలానే జరిగింది. అయితే, ఆ చర్చ సైద్ధాంతిక, పండిత చర్చను దాటి సాహిత్యంలోకి వచ్చింది తక్కువే. వేళ్ళమీద లెక్కించే రచనలు వచ్చినా వాటిపై జరగాల్సినంత చర్చ జరగలేదు”
సత్యవతి గారు తెలుగులోకి అనువదించిన “ఒక హిజ్రా ఆత్మకథ” నవల కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారం పొందినా చర్చలోకి రాలేదు. వసుధేంద్ర మోహనస్వామీ నవల అంతే. ఇప్పుడు ఈ సన్ ఆఫ్ జోజప్ప అంతే.
ఇటువంటి విషయాలపై రాసిన రచనలపై విస్తృత చర్చ జరగడం మాత్రమే కాదు. ఎన్నో రచనలు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ధైర్యం కలగాలని మనసారా కాంక్షిస్తూ ధైర్యంగా ఆ విషయాలపై గొప్ప రచనలు చేస్తున్న సోలోమన్ విజయ్ కుమార్ కి నా హేట్సాఫ్. ప్రచురించిన ఛాయ ప్రచురణల వారికీ హేట్సాఫ్.