“రచయిత ఎంత దాక్కోవాలని చూసినా పదాల మధ్య తన గొంతు ఆ రచయితను పట్టిస్తుంది”.

ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా, జీవితం ఆధారంగా ఒక నవల రాయవచ్చు.

వాటిని చారిత్రిక నవలలు లేదా జీవిత చరిత్ర నవలలు అనవచ్చు.

గురజాడ జీవితంలోని ఒక ముఖ్య సంఘటన ఆధారంగా ఆయన సాహిత్యాన్ని, జీవితాన్ని చెప్పబడిన నవలగా ఈ పుస్తకాన్ని ఎంచవచ్చు.

ఈ రచన చారిత్రిక, పరిశోధనాత్మక నవల కన్నా ఒక తరం నుంచి మరో తరం చెప్పుకుంటూ వచ్చిన కథ ఆధారంగా అల్లబడినది నవల.

ఈ పుస్తకం మొదట ప్రారంభించినప్పుడు ఒక జాతిలో ఎంతో ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్న, కీర్తించబడుతున్న రచనలో తమ ఊరి పేరు తప్పుగా, శతాబ్దాలకు పేగా ఇన్ని ప్రింటులు, ఇందరు సాహితీ పండితులు విశ్లేషిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పటికి కూడా ఇంకా అలాగే ఉండటం, దాన్ని ఎవరూ గమనించకుండా, సవరించకుండా ఉండటం అనేది ఆ ఊరి మనిషిని బాధ పెట్టడం వలన కూడా ఈ రచన వెలువడింది అనుకున్నాను.

కరటక శాస్త్రి, శిష్యుడికి ఆడ వేషం వేయించి రామప్పంతులు దగ్గరకు వచ్చి అమ్మజూపమని చెప్పే సీన్ లో ఆ ఊరి ప్రస్తావన వస్తుంది. కన్యాశుల్కం మొదటి ఎడిషన్ లో “నందిపిల్లి” అని స్పష్టంగా పడిన ఊరి పేరు. రెండో ఎడిషన్ కి వచ్చేసరికి “నల్లబిల్లి” అని అచ్చయి, అలాగే ఉండిపోయింది. ఈ విషయం చెప్పటంలో రచయిత ఆవేదన తెలుస్తుంది. ఇది చారిత్రిక తప్పు. మన నిర్లక్ష్యానికి కొండ గుర్తు.

కానీ, ప్రధానంగా ఈ నందిపిల్లి అనే ఊరిలో జరిగిన సంఘటన వలన కన్యాశుల్కం పుట్టుకకు కారణం చెప్పటం ప్రధాన ఉద్దేశ్యం అనుకున్నాను. రచయిత కూడా అలాగే ముందు మాటలో చెప్పుకున్నారు.

“1965 లో మా మాతామహులు కీ. శే. శ్రీ పేరి సుబ్బరాయ శాస్త్రిగారు నందిపిల్లిలో జరిగిన కొన్ని సంఘటనలకీ గురజాడ “కన్యాశుల్కం” ఆవిర్భావానికీ ఉండే సంబంధం చెప్పేరు. అది ఏ పరిశోధనలకీ తెలీని విషయం. 16 ఏళ్ళ వయసులో నా మీద బలమైన ముద్ర వేసిన విషయం అది.” ఈ మాటలు ఈ పుస్తకానికి చాలా అవసరం అయినవి.

అయితే ఈ మాటలతో పాటు, 23వ భాగంలో వచ్చే “గురువు గారూ, నందిపిల్లిలో మీకుండే వైరం కేవలం వైయక్తికం, మీ అత్తవారి ఊరు దేవారపల్లి అవడం వల్లే మీకు నందిపిల్లి తెలిసింది. సరే అక్కడ మీరు పేకాటకెళ్ళటం, వాళ్ళ సంస్కృతం ‘ గీర ‘ , మీరు అనవసరంగా సంస్కృతం మాట్లాడటానికి ప్రయత్నించటం, తప్పులు రావటం, ఆ కారణంగా వాళ్ళు దారుణంగా అవమానం చెయ్యటం – అదంతా ఓ కథ” అనే మాటలు చాలా ముఖ్యమైనవి.

“అదంతా ఓ కథ” ని చెప్పటమే ఈ పుస్తకం అసలు కథంతా.

పెళ్ళయిన కొత్తలో అత్తగారి ఊరు వెళ్ళిన గురజాడ, పక్కనే ఉన్న నందిపిల్లి అనే అగ్రహారంలో పేకాట ఆడటానికి వెళ్ళినప్పుడు ఆయనకు అవమానం జరుగుతుంది. అది వైదిక బ్రాహణులు, ద్రావిడ బ్రాహ్మణులు కలిసి ఉండే అగ్రహారం.

అక్కడ పేకాట ఆడుతున్న సందర్భంలో ఆయన “వయం ద్యూతమేవ దైవ మితి మత్యా పూజామః” అన్నారు, చలోక్తి విసురుతూ, నవ్వుతూ.

“పూజయామః” ఓరుగంటి కొండడు సవరించి నవ్వుతాడు. మిగతా వాళ్ళు నవ్వాపుకుంటారు.

అక్కడే ఉన్న సూరేకారం అత్త “ఆర్యా! భవాన్ కిం సంస్కృతమభ్యస్తవానస్తి వా?” అంటుంది.

అక్కడున్న చిన్నత్త అనే మరో ఆమె నవ్వింది.

పేకాట చూస్తున్న గంటిచేన్లు “సంస్కృతం మాటాడ్డం అంటే ఇంగ్లీష్ లో ఎదో నాలుగు బొట్లేరు ముక్కలు పేలడం కాదురేయ్ అప్పారావు” అంటాడు.

అవమానం, దానికి తోడు ఆ రోజు ఆటలో ఓటమిపాలైన గురజాడ “గీర్వాణ భాషా విషయంలో భరించరాని అవమానం. వైదీకపాళ్ల ‘ గీర ‘. వీళ్ళ పనిపట్టాలి” అని శపథం చేసుకుంటాడు.

ఈ శపథం అసలు కన్యాశుల్కం పుట్టుకకు కారణం అవుతుంది. ఇంగ్లీష్ ఒంటబట్టిచ్చుకున్న నియోగి బ్రాహ్మణుడు, సంస్కృతంలో ఆరితేయిన వైదిక, ద్రావిడ బ్రాహ్మణల మీద పగ తీర్చుకోవడానికి రాసిన రచనగా ఈ పుస్తకం చిత్రించినట్లు ఉంది. అయితే ఒక నాటక రచన ద్వారా ఎలా పగ తీర్చుకోగలడు? ఆనంద గజపతి రాజు దృష్టిలో పడాలి. ఆనంద గజపతి రాజు దగ్గర వైదికుల, ద్రావిడ బ్రాహ్మణ పండితుల హవా కొనసాగుతుంది. కాబట్టి వారిని చెడ్డ వారికి చూపించే రచన చేసి, రాజు గారికి చూపించి పెద్ద పదవి కొట్టేసి, ఆయన దగ్గర ఉన్నవాళ్ళని దూరం చేసి, వారి గీర అనచాలి.

అందుకోసం గురజాడ కన్యాశుల్కం రాయటానికి పూనుకున్నారు అనేది ఈ పుస్తకమంతా చూపించ బడుతుంది. అంతేకాక సంస్కృతం రాని ఇంగ్లీష్ ముక్కల గురజాడ అని తక్కువ చేసి చూపినట్టే ఉంది ఈ రచనంతా. కన్యాశుల్కం రాసినందుకు నందిపిల్లిలో గురజాడను కోపగించుకుంటారు ఆ అగ్రహారం వాళ్ళు. రచయిత, గురజాడ అభిమానినే అని చెబుతూ, అగ్రహరపు గీరని గురజాడ మీద ఈ పుస్తకంలో చూపారు అనే అనిపించింది. ఈ పుస్తకం అంతా గురజాడని ప్రతినాయకున్ని చేసి రాసినట్టుగానే కనిపించింది. నాకు అలాగే అనిపించింది. అయితే ఆయన గొప్ప చాటాలని రాయాలనేం లేదు కానీ అపహాస్యపరుస్తూ అయితే రాయకూడదు అనుకుంటాను.

ఇందులో గురజాడ కన్యాశుల్కాన్ని రాజు ముందు మొదటి సారి ప్రదర్శించాలి అని తేదీ నిర్ణయించుకొని, సిద్ధం చేసుకున్నాక నాటకానికి నాందీ ప్రస్తావన సంస్కృతంలో కావాల్సి వచ్చి ముడుంబై వరహా నరసింహ స్వామి దగ్గరకు వెళ్ళి ఆయన చేత రాయించుకుంటారు. ఈ అధ్యయనాన్ని రచయిత గురజాడను చాలా తక్కువ చేసి రాసినట్టుగా ఉంది. ఈ పుస్తకంలో ఈ అధ్యాయాలు గురజాడను తక్కువ చేయటంలో రచయిత ఉద్దేశ్యాన్ని నిరవేర్చాయి కూడా. రచయిత కూడా గురజాడను సంస్కృతం రానివాడని వెక్కిరిస్తున్నట్టుగానే ఉంది.

ఈ పుస్తకంలో కన్యాశుల్కం మొదటి ప్రదర్శన 1892 ఆగస్ట్ 13 న అని రాసి ఉంది. కానీ బంగొరే గారు సేకరించిన మొట్ట మొదటి కన్యాశుల్కం అనే పుస్తకంలో ఆరుద్ర గారు అభిఘారము అని ముందుమాట రాస్తూ కన్యాశుల్కం నాందీ ప్రస్తావన 1892 ఆగస్ట్ 13 నాడు వరహా నరసింహ స్వామి చేత రాయించారు.

ప్రదర్శన మాత్రం బహుశా కొద్ది రోజుల తర్వాత జరిగింది కాబోలు అన్నారు. దీనికి ఆధారంగా అదే నెల 26న తెలుగు హార్పు అనే స్థానిక పత్రిక వార్త రాసింది. అందులో శనివారం రోజు అని ప్రస్తావించారు. ఈ పుస్తకం ప్రకారం కన్యాశుల్కం ఆగస్ట్ 13న గురజాడ ప్లాన్ చేసి ప్రదర్శింప చేశారు అనుకుంటే ఆ రోజు మంగళవారం అయింది. మరి శనివారం, మంగళవారం ఒకే నెలలో 13 అనే తారీఖున వచ్చే అవకాశమే లేదు.

సంస్కృత బ్రాహ్మణ పండితులను ఎత్తుకుంటూ, గురజాడను తక్కువ చేసుకుంటూ, ఆయనను ఏ మాత్రం తక్కువ చేయలేదని చెప్పుకోవటానికి, గురజాడ నిజాయితీ గురించి దావా విషయంలో జ్ఞాతులు 40000 లంచం ఇవ్వబోతే అప్పారావు గారు సునిశిత హాస్యంతో తిరస్కరించేరుట అనే విషయాన్ని రాశారు.

గురజాడ వ్యవహారిక భాష అమలు కోసం చేసిన కృషిలో పేరి కాశినాథ శాస్త్రి గారి గొప్పతనాన్ని చాటినట్టుగానే రాశారు రచయిత.

గురజాడ చనిపోయే ముందుగా ఆదిభట్ల నారాయణదాసు గారి చేత “లంగరెత్తుము” అనే ఆయన రాసిన గేయాన్ని చదువించుకున్నారు అని చెప్తూ”విరిగి పెరిగితి; కష్ట సుఖములపార మెరిగితి” అనే ఈ పాదాలను రాశారు. అంటే గురజాడ తన జీవితంలో చేసిన పనులకు ప్రాయచ్చితమా?

ఆయన చనిపోయాక రచయిత “స్వర్గాధిపతి ఇంద్రుడు సకల దేవతలతో కలిసి గురజాడ పార్థీవ శరీరం మీద పూలవాన కురిపించేడు” అనే మాటలు హేతువాది గురజాడ విషయంలో రాయటం నేను జీర్ణించుకోలేక పోయాను.

1943 లో జరిగిన అరసం మహాసభల్లో గురజాడను అనుబంధం చేసుకుంది అనే విషయాన్ని చెప్తూ, ఆ సభకి అధ్యక్షుడు, హేతువాది తాపీ ధర్మారావు నాయుడు గారు. దేవాలయాల మీద బూతు బొమ్మల పుణ్యమా అని మహా ప్రసిద్దికెక్కినవాడు అని రచయిత రాశారు.

అంటే బూతు రాసి పేరు తెచ్చుకున్నోడు అనా రచయిత ఉద్దేశ్యం. పుస్తకం అని కూడా రాయలేదు. బూతు బొమ్మల పుణ్యమా అని మాత్రమే రాశారు. ఎంత హేళన ఇది. నిజమైన పారిదర్శకత ఉంటే ఇలా రాస్తారా?

తాపీ ధర్మారావు గారి గురించి ఆనేక విషయాలు చెప్పవచ్చే.

ఒక చారిత్రిక అంశాన్ని చెప్పేటప్పుడు రచయిత హేళనస్వరం పుస్తకమంతా వాడటం నిజంగా అందులోని విషయం మీద అపనమ్మకాన్ని కలిగిస్తుంది.

గురజాడ అవమానంతో వైదిక, ద్రావిడ బ్రాహ్మణుల మీద కక్ష సాధించారు రచన ద్వారా అనేది, ఒక నోటి కథ ఆధారం చేసుకొని చెప్తున్నారు.

అలాగే ఒక ఇంగ్లీషు చదువుకున్న నియోగి బ్రాహ్మణుడి ఎదుగుదల చూసి ఈర్ష్యతో, సంస్కృత పండితులు అయిన వైదిక, ద్రావిడ బ్రాహ్మణులు మీరు చెబుతున్న కథను పుట్టించారు ఏమో? ఈ అనుమానం కూడా పాఠకులకు కలుగుతుంది.

చివరిగా గురజాడ మతస్తున్ని కాదు నేను మీరనుకునేటట్లు.

Review By Goondla Venkatanarayana 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top