తెలుగు భాషలో రచనలే కాక ఇతర భారతీయ భాషల నుంచి తెలుగులోకి మంచి అనువాద రచనలు తరచు ప్రచురిస్తున్న ప్రచురణ సంస్థ ఛాయ ప్రచురణలు. ఇందులో ఆరు కథలు కథా సంపుటి శీర్షికలా చదివాక మనసున గుబాళించే అత్తరు లాంటి కథలే.
మొదటి కథ అత్తరు నిజానికి అత్తరులా గుబాళించే ఓ ప్రేమలేఖ కథ. ప్రేమ కథలుంటాయిగానీ ఎవరు ఎవరికో రాసుకున్న ప్రేమలేఖకు కూడా ఇంత హృద్యమైన కథ ఉంటుందా? అని అడిగితే ఈ కథ చదివాక మీరూ ఉంటుందని ఒప్పుకుంటారు. ఒకవేళ ఇది నిజమైన ప్రేమలేఖ కథైనా ఆశ్చర్యపడను అసలు నిజంగా అలా జరగడం ఎంత బాగుంటుందో అనుకుంటాను. బహుశా ఎప్పుడైనా అత్తరు వాడితే ఇక ఈ కథే గుర్తొస్తుందేమో కూడానూ.
రెండవ కథ Something is missing. ఈ కథ గురించి ఏం చెప్పను. ముగింపు పేరాలు యధాతథంగా కోట్ చేస్తాను.
×××××××××
“నేను బైక్ వద్దకు వచ్చి తిరిగి చూసాను. నేను బయలుదేరిన చోటే నుంచుని కనిపించింది. మళ్ళీ ఇద్దరూ కలిసి నడిచాము. మరొక్కసారి భల్లూకపు కౌగిలింత. ఆమె నీలి కళ్ళలో ఉప్పొంగిన సముద్రం. ఆమె నుదుటికి ముద్దు పెట్టాను.
13 కోట్ల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న ఆ తమన్ నెగార (మలేషియాలో ఓ అందమైన ప్రదేశం) వర్షారణ్యం ఆ క్షణం మౌనాన్ని ధరించి నిల్చుంది. సీతాకోకచిలుకలు కనబడలేదు.
ఈ దగ్గరితనాన్ని ఎవరు, ఎవరు వదలాలి? ఎవరు వదిలించుకోవాలి?”
ఈ కథ చదివి ఎవరికి వారు ఆ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి.
మూడవ కథ “అద్దం”. అద్దంలో మనకి మన ముఖం మాత్రమే లేదా ప్రతిఫలించే భౌతిక రూపాలు మాత్రమే కనిపించితే పర్వాలేదు. అంతకుమించి అంతరంగం కనిపించితే ఏం జరుగుతుందో, మనమేం చేస్తామో చెప్పే కథ.
నాల్గవ కథ ఔట్ సైడర్ బై అల్బర్ట్ కాము. వయసులో అందరం తప్పులు చేస్తాం. కానీ తప్పును పట్టుకున్న వ్యక్తి ఆ తరువాత మన పట్ల ప్రవర్తించిన తీరు గొప్ప మలుపు తీసుకొస్తుంది. ఆ సత్యాన్నే మంచి కథగా మలిచి తనలో “ఔట్ సైడర్” కి బై చెప్పిన కథ.
అయిదవ కథ “ఇంట్లో ఒంటరిగా”. కరోనా వలన జరిగిన చెడే ఎక్కువ కానీ ప్రతీ దానికీ మంచి చెడు అనే రెండు పార్శ్వాలు ఉంటాయి. ఏ పార్శ్వం ఎక్కువో దానిబట్టి మనం అది ఏమిటి అన్నది నిర్ణయిస్తాం. అది సహజం కానీ ఒక్కొక్కప్పుడు అనుకోకుండా రెండో పార్శ్వం చూసే అవకాశం ఏర్పడుతుంది. కరోనా కాలానికి సంబంధించిన వైవిధ్యమైన కథ. మరి కొంచం వివరిస్తే కథ చదివే ఆనందం పోతుంది. అలాగని ఈ సమీక్ష చదివి ఊహించకండి. మీరు ఊహించగలిగే దానికన్నా కథలో ఎక్కువే ఉంది.
ఆరవ కథ “పింక్ ఎండ్ బ్లూ”. కథ శీర్షిక చెప్పగానే ప్రేమ కథ అని ఈ సమీక్ష చదివేవారు ఊహించేస్తారు కానీ పాత కథనే కొత్త శైలిలో చెబుతూనే ముగింపు మీరు ఊహించలేని విధంగా ముగిస్తారు రచయిత.
కథల అనువాదం చక్కని తెలుగు నుడికారంలో సాగుతూ తెలుగులో రాసిన కథలే అనిపిస్తాయి.