మనిషి అభివృద్ధి చెందుతున్నాడు. రోజురోజుకీ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాడు. కొత్తవి సృష్టిస్తున్నాడు. మరి మనిషి తన గురించి తాను తెలుసుకున్నాడా..!? శారీరికంగా,మేధోపరంగా కాకుండా మానసికంగా పరిణితి చెందేడా !?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చరిత్ర మాత్రమే చెప్తుంది. ఐతే దేశ చరిత్ర తెలుసుకోవడం వల్ల కేవలం అప్పటి రాజకీయ పరిస్థితులు, సాంఘిక ఆచారాలు తెలుస్తాయి కానీ అప్పటి మానసిక స్థితి తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంది. అలా తెలుసుకోవాలి అంటే కేవలం ఒక్క ప్రాంతం యొక్క చరిత్ర చదివితే కొంచెం అవగాహన చేసుకునే ప్రయత్నం చెయ్యచ్చు.. అలాంటి ప్రయోగమే ఉణుదుర్తి సుధాకర్ గారు “తూరుపు గాలులు”అనే పుస్తకం ద్వారా చేశారు.
ఈ పుస్తకంలో మొత్తం 13 కథలు ఉన్నాయి.. అన్నీ కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ప్రాంతం గురించి రాసిన కథలే.. కథలు అన్నీ కూడా కాలక్రమంలో వెనక్కి వెళుతున్నట్టు అమర్చారు. అంటే ప్రస్తుత కాలంలోని కుల, మత విషయాలతో మొదలు పెట్టి, 800 ఏళ్ల క్రితం ఉత్తరాంధ్ర లో కనుమరుగై పోయిన బౌద్ధం వరకు చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల విషయాలే ఈ కథల్లో ముఖ్య కథనం.
గతానికి సంబంధించి మారుతున్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలు అన్నిట్లో గతం వర్తమానాన్ని శాసించిన మాత్రమే కాకుండా అనేక సూక్ష్మ కథలు (Sub-Plots) అనేకం ఉన్నాయి. అలానే ప్రతి కథలో కూడా అంతర్లీనంగా ఒక రకమైన సంఘర్షణ అనేది ఉంటూనే ఉన్నాయి.
ఈ కథలు ఎవరికి వారే చదువుకొని అర్దం చేసుకొనే కథలు అని నా అభిప్రాయం. విడివిడిగా ఈ కథలను చూడలేము కానీ, అలా చూస్తే నా బాగా నచ్చిన కథలు “ఇద్దరు మావయ్యల కథ”,”బూడిద రంగు అద్వైతం”,”ఏడు కానాల వంతెన”,”మూడు కోణాలు”,”ఒక వీడ్కోలు సాయంత్రం”,”వార్తాహరులు”,”తూరుపు గాలులు”.
స్వతహాగా ఉత్తరాంధ్రలో పెరిగిన వాడిని కావడం వల్ల, ఈ కథలు మరింత బాగా నచ్చాయి.. ఐతే అప్పటి కాలంలో వాడిన భాష, యాసలు కూడా వాడి ఉంటే మరింత అందంగా ఉండేది ఏమో అని నా అభిప్రాయం.
Historical Fiction అనే genre ని ఇష్టపడే వాళ్ళు, తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన “తూరుపు గాలులు”