ఛాయా – అజు పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన ‘కథావేదిక – 2024’ను విజయవంతం చేసిన అందరికీ మా ప్రేమ
చాల మంది ఔత్సాహిక రచయితలు వస్తున్నా, తమ చుట్టూ ఉన్న అంశాలను కథలుగా చేయాలని అనుకుంటున్నా ఎలా చేయాలి? ఏది కథవుతుంది? అనే మీమాంస ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి వారి కోసమూ, ఇప్పటికే రాస్తున్న వారిని మరింత పదను పెట్టడం కోసం అజు, ఛాయ ప్రచురణ సంస్థల సంయుక్త నిర్వహణలో ఏర్పడిందే కథా వేదిక. ఈ రెండు సంస్థలూ సాహిత్య జిజ్ఞాస ఉన్న యువతకు వేదికగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. అట్లా, ఓ కథా వర్క్ షాప్ అనుకున్నప్పుడు ‘వసుధేంద్ర’ మాకు తోడయ్యాడు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు (బ్రేక్స్ ఓ రెండు గంటలు మినహాయిస్తే) వసుధేంద్ర ఆద్యంతం అద్భుతంగా నిర్వహించాడు. కిందటిసారీ వచ్చిన మిత్రులు కొందరు మళ్ళీ వచ్చినా వర్క్ షాప్ ముగిసేవరకు శ్రద్ధగా కూర్చుని పాఠం విన్నారు. కథలు చెప్పారు. కథ గురించి చెబుతూనే ఎదురుగా వింటున్న వారికి ఒక టాస్క్ ఇచ్చి కథ చెప్పమనడం వసుధేంద్ర స్టైల్. అట్లా ఇచ్చిన గ్రూప్ టాస్క్ లో పార్టీసిపెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. దినమంతా సుదీర్ఘంగా నడచిన ఈ వర్క్ షాప్ ఓ కథల సంకలనాన్ని తెలుగు నేలకు వాగ్ధానం చేసింది.