యుద్దమంటే మానవత్వంపై దాడి, హక్కుల హననం. అటువంటి ఒక బీభత్స, విషాద నేపథ్యంలో మనుషుల మధ్య, ముఖ్యంగా యువతీ యువకుల మధ్య ప్రేమలు తొడగడం ఆశ్చర్యం గొలుపుతుంది. ఒక కొత్త ఆశనూ చిగురింపజేస్తుంది. కులాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా పాదుకునే ఈ ప్రేమలు మనుషుల హృదయ సత్ శీలతకు నిదర్శనం. యుద్ధంలో కూరుకుపోయి రాజ్యం కూలిపోతున్నప్పుడు, విలువలు పతనమై దేశం కునారిల్లుతున్నప్పుడు, మనుగడే ప్రశ్నార్ధకమైనప్పుడు యువతీయువకులే దాని ప్రక్షాళనకు నడుంబిగిస్తారు. న్యాయం పక్షాన నిలబడతారు.
బయటికి కనిపించకుండా వుండి యుద్దానికి కారణమైన కూలీన వర్గాల , ప్రభువుల అధికార దాహాన్ని యీ ప్రేమలు నిరశిస్తాయి. ప్రపంచ యుద్ధ నేపధ్యంతో రష్యన్ సాహిత్యంలో వచ్చిన అనేక నవలలకు ప్రేమే కథా వస్తువు. కేవలం అనువాద సాహిత్యంలోనే అటువంటి నవలలు సుమారు ఇరవై చదివి ఉంటాము. అవేవీ మనలను నిరాశపరచక పోగా మానవత్వం మీద అపార విశ్వాసాన్ని కలిగిస్తాయి.
మన దేశం లోనూ అటువంటి యుద్ధాలు ఎన్నో జరిగాయి. విజయనగర సామ్రాజ్యం చివరి దశలో జరిగినది రక్కసి-తంగడి యుద్ధం. ‘హంపీ’ నవల లోని ప్రేమ కథకు నేపధ్యం ఆ రక్కసి-తంగడియుద్ధమే.
చారిత్రిక నవలలు రాయటం అంత సులువుకాదు. కేవలం చరిత్ర పరిశోధన సరిపోదు. రచయిత ఆ కాలాన్ని ఆవాహన చేసుకోవాలి. ఆనాటి సంస్కృతి, ఆహార, ఆహార్య అలవాట్లను గ్రహించగలగాలి. చేస్తున్న సన్నివేశ కల్పన చరిత్ర పరిధిని దాటకుండా జాగ్రత్త వహించాలి. చరిత్ర పేరుమీద తన్ను మోసంచేయడం లేదన్న విశ్వాసాన్ని పాఠకుడిలో కలిగించాలి. హంపి నవల మీకు ఆ విశ్వాసాన్నిస్తుంది.
నవలా రచయిత అవుతున్న మా కర్నూలు కథకుడు మారుతికి శుభాకాంక్షలు