గ్రామీణ కార్మికులకు ఒక ఏడాదిలో 100 రోజులు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మరియు ఇతర సంక్షేమ పధకాలు అమలౌవుతున్న తీరును క్షేత్రస్తాయిలో పరిశీలిస్తున్న పరిశోధకులలో బుద్ధ చక్రధర్ ఒకరు. ‘పరిశోధన’ అంటే అదేదో పి హెడి (Phd) కోసం చేసే పరిశోధన కాదు. పథకాల అమలులో వాటి విధి విధానాలు, ప్రభుత్వాలు ఏకపక్షంగా తెస్తున్న మార్పులు, చేర్పుల వలన లబ్దిదారులు ఎలా నష్టపోతున్నారో సాక్ష్యాధారాలతో ఎత్తిచూపించే పరిశోధన చక్రధర్ బృందం చేస్తున్నది.
ఆ పనిలో, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టవలసిన అవసరంలో భాగంగా తాను తెలుగు, ఇంగ్లిష్ మీడియాకు వ్యాసాలు రాస్తున్నాడు. తెలుగులోని ప్రధాన దిన పత్రికలతోబాటు, ప్రసిద్ధి చెందిన ‘ది హిందు’, ‘ఎకానమిక్ పొలిటికల్ వీక్లీ ( EPW)’, ‘ది వైర్’ లకు రాస్తూ వస్తున్నాడు. వాటిని ఒక చోట చేర్చి తెలుగు పాటకుల కోసం ఉపాధి హామీ పథకంలో హక్కుల సంగతులు” అనే పుస్తకంగా తీసుకువచ్చారు. 20 వ్యాసాలను మూడు భాగాలుగ విభజించారు.
మొదటి భాగం మనకు ఉపాధి హామీ పధకాన్ని పరిచయం చేస్తుంది. రెండవ భాగం, గ్రామీణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తుంది. మూడవది, ఆ సమస్యల పరిష్కారానికి సూచనలను మన ముందు ఉంచుతుంది. పనికి ‘ఆహరం’ పేరుతో ‘ఆహారానికి పని పధకం’ గతంలో వుంది. అందుచేత ‘ఉపాధి’ కోసం ‘పని’ కల్పించడం మరి అంతకొత్త సంగతి ఏమి కాదు. ఒక మౌలికమైన తేడా ఏమిటంటే, ఆహారానికి పని పధకంలో అటు ‘పని’ లేదా ఇటు ‘ఆహరం’ ఒక హక్కుకాదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో ‘పని’, ‘వేతం’ ఒక హక్కు, చట్టబద్దమైన హక్కులు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పాక్షికంగానైనా (ఏడాదికి 100 రోజుల ప్రాప్తికి, దేశ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు) పని హక్కును ‘ గుర్తించినట్లయ్యింది. పాపం ! మోడీ మహాశయునికి ఆ సంగతి తెలియక, పార్లమెంట్ లో అడుగు పెట్టిన మొదటి రోజే ఉపాధి హామీ పధకాన్ని తూలనాడుతూ మాట్లాడాడు.
ఉపాధి హమీలో ప్రాధానమైన ముడు అంశాలను మొదటి విభాగం చర్చించింది. అవి 1. గ్రామీణ కార్మికులకు కావలసినప్పుడు పని (100 రోజుల పరిమితికి లోబడి) 2. చేసిన పనికి వేతనం. 3. పని కల్పించకపోతే నిరుద్యోగ భ్రుతి, 4. వేతనం సకాలానికి ఇవ్వకపోతే నష్టపరిహారం. ఈ హక్కులను వివరిస్తుంది మొదటి విభాగం.
గ్రామీణ కార్మికులు పనికి ఎందుకు వస్తారు ? జిమ్ము చేయడానికి కాదుకదా! వారి శ్రమకు ఫలితంగా వేతనం లభిస్తుందని ఆశతో వస్తారు. కార్మికులతో పని చేయించుకున్న ప్రభుత్వం ‘యజమాని’ అవుతుంది. వేతనం చెల్లించవలసిన బాధ్యత యజమానిదే. ఉపాధి హామీ పధకం మొదలైన నాటి నుండి నేటి వరకూ ఈ వేతనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వాలు ఎన్నో ప్రయోగాలు చేస్తూ గ్రామీణ కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
రకరాకాల ప్రయోగాలు చేసిన మీదట ఇప్పుడు 1. నేరుగా వేతనం బ్యాంక్ ఖాతాకు బదిలీ 2. ఆ ఖాతాను ఆధార్ తో అనుసంధానించడం 3. బయోమెట్రిక్ గుర్తింపు 4. రియల్ టైం లో ఇంటర్ నెట్ తో అనుసంధానం వంటి మార్పులతో ఉపాధి హామీలో గ్రామీణ కార్మికులు, మరీ ముఖ్యంగా ఆదివాసీ గ్రామీణ కార్మికులు తమకు చట్టం ఇచ్చిన హక్కులు ఎలా నష్టపోతున్నది రెండవ అధ్యాయంలో చక్రధర్ వివరించే ప్రయత్నం చేసాడు. పని చేసిన వాడికి నాలుగు రూపాయలు ముట్టజెప్పే ప్రక్రియను పాలకులు రోజు రోజుకు ఎంత సంక్లిష్టంగా మారుస్తున్నారంటే అసలు ఆ మార్పులను అర్థం చేసుకోవడమే గగనకుసమంగా మారుతున్నది. పని కల్పన, వేతనాల చెల్లింపులో తీసుకువస్తున్న ఈ మార్పులను వాటి పరిణామాలను వివరించే, రెండవ విభాగంలోని వ్యాసాలు చాల ముఖ్యమైనవి. మొదటిసారి, కొత్తగా మన ముందు వుంచుతున్న సంగతులు ఇవి. ఈ పుస్తకం యొక్క అవసరం, ప్రత్యేకత, తాజాతనం రెండవ విభాగంలో వున్న సమాచారంలో వుంది.
సమస్య చెప్పి వదిలేస్తే సరిపోదు. ముందు చెప్పినట్లు ఈ వ్యాసాలు, రాయడం కోసం రాసినవి కావు. గ్రామీణ కార్మికుల హక్కులకు ఎక్కడ భంగం కలుగుతుంది, వాటిని అధిగమించడానికకి ఏమి చేయాలనే అన్వేషణలో, ఒక ‘బై ప్రొడక్టు’ గా వెలుగు చూసినవి. చక్రధర్ అతని బృందం చేసిన కృషి ఎంతటిదంటే, కేంద్ర ప్రభుత్వ కొన్ని పిచ్చి నిర్ణయాలని పదేపదే వాయిదా వేసుకోవలసి వచ్చింది. వారు నిత్యం కేంద్ర, రాష్ట్ర అధికారులతో సంవాదం జరుపుతూ వస్తున్నారు. ఆ విధంగా ‘పరిశోధన’ అనే మాటకున్న అర్ధాన్ని విస్త్రుపరిచారు. ఈ వ్యాసాలలో చక్రధర్ చేసిన ప్రతిపాదనలంన్నింటిని మీరు ఎకీభవించకపోవచ్చును. అయినా మీరు తాను ఏమి చెపుతున్నాడో
వినవలసి వుంది. గ్రామీణ సమాజం పట్ల ఆపేక్ష వున్న వారు, కార్మికుల పట్ల అనురక్తి వున్నవారు తప్పక చదవవలసిన పుస్తకం B.చక్రధర్ ‘ఉపాధి హామీ పధకంలో హక్కుల సంగతులు”.